కేసీఆర్ పై అమరావతి ఎఫెక్ట్?

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నభూతో నభవిష్యత్ అన్నట్లుగా అత్యంత వైభవంగా నిర్వహించిన అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి హాజరయిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఆ ప్రభావం బాగా పడినట్లుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడిని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూసి చాలా భయపడుతున్నట్లున్నారని, అందుకే డిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిసినా పోలవరం ప్రసక్తి తేలేదని అన్నారు.

 

పొంగులేటి వాదన ఎలా ఉన్నప్పటికీ, అమరావతి శంఖుస్థాపనకి తెదేపా ప్రభుత్వం చేసిన ఆర్భాటం కేసీఆర్ పై ప్రభావం చూపించిందని చెప్పవచ్చును. ఆయన డిసెంబర్ 23 నుంచి 27 వరకు ఆయుత మహా చండీయాగం చేయబోతున్నారు. ఇంతకు ముందు కూడా కేసీఆర్ చండీయాగం చేసినప్పటికీ ఈసారి మాత్రం నభూతో నభవిష్యత్ అన్నట్లుగా చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. మెదక్ జిల్లాలో ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ సమీపంలో గల 22 ఎకరాలలో స్థలంలో త్రిదిండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఈ యాగం చేయబోతున్నారు. దేశం నలుమూలల నుండి వేద పండితులను, పీఠాధిపతులను, అన్ని రాష్ట్రాల గవర్నర్లను, ముఖ్యమంత్రులను ఈ యాగానికి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. ఈ యాగానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, ప్రధాని నరేంద్ర మోడిని, కేంద్ర మంత్రులను కూడా కేసీఆర్ ఆహ్వానిస్తున్నారు. ఐదు రోజులపాటు సాగే ఈ యాగం కోసం తెలంగాణా ప్రభుత్వం చాలా భారీ ఏర్పాట్లు చేస్తోంది.

 

తెలంగాణా రాష్ట్రం సుఖశాంతులతో వర్ధిల్లాలని కేసీఆర్ ఈ యాగం చేస్తున్నట్లు తెరాస నేతలు చెపుతున్నారు. ప్రభుత్వాధినేతలు ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకోవడాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. కానీ అందుకోసం ప్రజాధనం ఖర్చు చేసి ఆర్భాటంగా యజ్ఞాలు, యాగాలు చేయాలనుకొంటే ఎవరో ఒకరు ప్రశ్నించక తప్పదు..విమర్శించక మానరు. ఇంతకు ముందు ఇరువురు ముఖ్యమంత్రులు పోటాపోటీగా గోదావరి పుష్కరాలకు అనవసరమయిన ప్రచారం చేసి, వాటి నిర్వహణ కోసం వందల కోట్ల ప్రజాధనం మంచి నీళ్ళలా ఖర్చు చేసినప్పుడు ప్రజల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. బహుశః కేసీఆర్ మళ్ళీ విమర్శలు ఎదుర్కోక తప్పదేమో?