వరంగల్ లో ఫలిస్తున్న గులాబీ వ్యూహం

 

వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో టీడీపీ-బీజేపీ కూటమిని దెబ్బతీయాలని టీఆర్‌ఎస్ పన్నిన వ్యూహం ఫలించినట్లే కనిపిస్తోంది. గులాబీ పార్టీ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర లేపడంతో ఆయా పార్టీల్లోని పలువురు ముఖ్యనేతలు, చోటామోటా లీడర్స్ అంతా కారెక్కనున్నారనే టాక్ వినిపిస్తోంది, దీన్లో భాగంగా వరంగల్ జిల్లాకి చెందిన టీడీపీ రాజ్యసభ ఎంపీ గుండు సుధారాణి రేపోమాపో టీఆర్ఎస్ లో చేరడం ఖాయమని చెబుతుండగా, మరికొందరు పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి టీఆర్ఎస్ పాలనపైనా, పథకాలపైనా ప్రశంసల వర్షం కురిపించిన గుండు సుధారాణి... తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పే దిశగా అడుగులు వేయగా, ఇదే కోవలో మరికొందరికి గాలమేయాలని గులాబీ నేతలు పావులు కదుపుతున్నారు. అందుకే కాస్త పేరున్న నాయకులకే కాకుండా ద్వితీయ శ్రేణి నేతలకు కూడా టీఆర్‌ఎస్ గాలం వేస్తోంది. పైగా మొన్నటివరకూ ఆపరేషన్ ఆకర్ష్ బాధ్యతలను ఒక్క హరీష్ రావు మాత్రమే చూడగా, వరంగల్ బైపోల్ నేపథ్యంలో మంత్రులంతా అదే పనిలో నిమగ్నమయ్యారని అంటున్నారు, ప్రధాన పార్టీల్లోని పేరున్న నాయకులను చేర్చుకోవడం ద్వారా ప్రతిపక్షాల మనోధైర్యాన్ని దెబ్బతీయాలని భావిస్తున్నారు.

అలాగే త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ లీడర్ దానం నాగేందర్ కోసం కొంతకాలంగా ప్రయత్నిస్తున్న గులాబీ పార్టీ... మరోసారి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ముఖ్యనేతలు ఇప్పటికే ఎన్నోసార్లు చర్చలు జరిపినా, డీల్ ముందుకు కదలకపోవడంతో ఈసారి ఎలాగైనా టాస్క్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారట.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu