లోకానికి రంగులు జల్లేద్దామా??
posted on Mar 17, 2022 9:30AM
ఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అందాలు అంటాడు ఒక సినీగేయ రచయిత. నల్లానల్లాని కళ్ళ పిల్లా అంటాడు మరొక రచయిత. ఎర్రని జాంపండు అని ఊరిస్తారు అందరూ. ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయా అని ముద్దుగుమ్మలు అందాన్ని, సంప్రదాయాన్ని కలిపి అలరిస్తారు. పచ్చని ప్రకృతి అంటూ ప్రకృతి ప్రేమికులు నినదిస్తారు. పిండారబోసినట్టు వెన్నెలా, సముద్రం మీద తెల్లని కలువపువ్వాలా చందమామా అంటూ చమత్కారాలు కురిపిస్తారు. కేంజాయ రంగు సూరీడు ఆకాశమంత నోటితో నవ్వుతాడన్నట్టు అంతా నారింజ వర్ణమే.
ఇట్లా అన్నింటిలో రంగుల హొయలు, రంగేళి పాటలా ప్రపంచాన్ని కనువిందు చేస్తూ ఉంటుంది. ఆకులోనూ, పువ్వులోనూ, మట్టిలోనే కాక నీటిలోనూ, గాలిలోనూ రంగుల్ని చూసే మనసును, సృజనాత్మక వర్ణనను ఆ రంగులే కొందరికి ఇచ్చేసాయేమో అనిపిస్తూ ఉంటుంది.
ఇప్పుడిదంతా ఎందుకూ అంటే!!
ప్రపంచమంతా రంగులతోనూ, రంగులలో ఉన్న ఆనందంతోనూ నిండిపోయి అందరినీ ఆనందంలో ఉంచుతున్నా రంగుల పండగ ప్రత్యేకంగా ఉంది మనకు. తెల్లని మల్లెపూవుల్లాంటి బట్టలు వేసుకుని రంగులు జల్లుకుని సప్తవర్ణ హరివిల్లులా ఒక్కొక్కరూ మెరిసిపోతూ ఉంటే ఎంతో సంబరంగా ఉంటుంది.
వసంతఋతువులో అందరిని పలకరించే రంగుల పండగ వర్ణశోభిత వికసిత మాలిక అయిన హొలీ పండుగ భారతదేశమంతా ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ. ముఖ్యంగా కృష్ణుడి ఆరాధకులు వ్రేపల్లె కన్నయ్యను తలచుకుంటూ గోధూళి పాటలు పాడుకుంటూ ఆనంద పరవశంలో మునిగి తేలుతూ ఉంటారు. రంగులు జల్లుకోవడాలు, ఉట్టి కొట్టడాలు, బృందావనంలో రాధాకృష్ణులను తలపించే దాండియా నృత్యాలు ఇలా హొలీ పండుగ హడావిడి అంతా ఇంతా కాదు. ఇవన్నీ ఒకెత్తు అయితే హొలీ పిండివంటల హాంగామా వేరే లెవెల్ అనుకోవచ్చు.
ముఖ్యంగా తీపి పదార్థాలదే ఇక్కడ పైచెయ్యి. పాలతో చేసే పదార్థాలకు పెద్ద పీట వేస్తారు. ప్రతి ఇంట్లో నేతి వాసనలు గుబాలిస్తూ ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాలలో హొలీ సందడి తక్కువే అయినా ముంబయ్, బెంగాల్, గుజరాత్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో హొలీ పండుగ, దాని తాలూకూ హంగామా ఆకాశాన్నంటుతుంది. పిల్లలు పెద్దలు తారతమ్యం లేకుండా రంగులలో తడిసి ముద్దవుతూ ఉంటుంది.
సంబరంతో జాగ్రత్తలు!!
అయితే సంబరాలలో అపశ్రుతులు జరుగుతూ ఉంటాయి. వాటి గురించి తెలిసిన ప్రజలు ముందుజాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని విషయం కూడా మరచిపోకూడదు. రంగులు జల్లుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కళ్ళలోకి రంగులు పడకుండా సంబరాన్ని ఆస్వాదించాలి. అలాగే కృత్రిమ రంగులకు దూరంగా ఉండాలి. ఎలాగైతే వినాయకచవితి సంబరాలలో కాలుష్యం పెరగకూడదని మట్టి గణపతిని ప్రోత్సహిస్తున్నామో అలాగే రంగుల విషయంలో కూడా సహజమైన పదార్థాలను ఎంచుకోవాలి. నిజానికి ఇలా సహజమైన రంగులు తయారు చేసుకోవడం వల్ల ఖర్చు తగ్గడం మాత్రమే కాకుండా కాసింత ఓపిక పెరుగుతుంది. మనుషుల్లో సృజనాత్మకత బయటకు వస్తుంది. ఇంకా చెప్పాలంటే బోలెడంత ఆత్మసంతృప్తి మిగులుతుంది. ఇంకా శరీరానికి కొబ్బరి నూనె, బాడీ లోషన్ వంటివి ముందుగానే పూసుకోవడం వల్ల రంగుల ప్రభావం చర్మం మీద పడకుండా ఉంటుంది. ఇంకా ఫస్ట్ ఎయిడ్ కిట్ దగ్గరలో ఉంచుకోవడం మంచిదే.
ఇబ్బంది పెట్టని సంబరాలు ఆనందాలు!!
కొందరికి రంగులు చల్లుకుని హంగామా చేయడం ఇష్టం లేకపోవచ్చు. ఏవో కారణాల వల్ల హొలీ మూడ్ ను ఎంజాయ్ చేయలేకపోవచ్చు. మరేవో కారణాల వల్ల దూరంగా ఉండాలని అనుకోవచ్చు. స్నేహితులు, చుట్టాలు, పక్కాలు, కొలీగ్స్ ఇలా అందరిలోనూ ఎవరో కొందరు ఇలాంటి వాళ్ళు ఉండచ్చు. అలాంటి వాళ్ళ మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి కానీ బలవంతంగా రంగులు పూయడం అల్లరి చేయడం వంటివి చేస్తే అవతలి వాళ్లకి అది గోలగానూ, సాడిజంగానూ అనిపిస్తుంది. అందుకే వీలైనంత వరకు ఎదుటి వారిని, వారి అభిప్రాయాలను గౌరవించాలి.
పంచభూతాలూ, ప్రకృతి, మనుషులూ, ఆనందాలు, అల్లర్లు, సంతోషాలు, అలకలు, ఆటపట్టించడాలు ఇలా అన్ని రంగులలో కలసి వసంతఋతువులో లోకానికి మరింత కొత్తశోభను అద్దుతాయి. ఎలాంటి అపశ్రుతులు ఎదురుకాకుండా లోకం మీద హొలీ రంగులు జల్లేద్దాం!!
◆వెంకటేష్ పువ్వాడ.