న్యూ ఇయర్ రిజల్యూషన్.. కొత్త ఏడాది నిర్ణయాల్లో తప్పనిసరిగా ఉండాల్సిన విషయమిదే..!
posted on Dec 31, 2024 9:30AM
కొత్త.. అనే పేరులోనే చాలా గొప్ప ఆశావాదం ఉంటుంది. కొత్త దనం ఎప్పుడూ మంచే చేస్తుందనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. ఈ పాజిటివ్ ఆలోచన వల్లనే చాలామంది కొత్తదనం అంటే ఆసక్తిగా ఉంటారు. కొత్తదనం అంటే జీవితానికి బోనస్ లాంటిది. అయితే కొత్తగా మొదలు పెట్టేది ఏదైనా సరే జీవితానికి మేలు చేసేది అయి ఉండాలి. ఏ పని చేయాలన్నా దానికి ఓ పద్దతి, పాడు ఉంటుంది. ముఖ్యంగా ఏ పని చేయాలన్నా దానికి తగిన ఆలోచనా విధానం, శరీర ఆరోగ్యం సహకరించాలి. ఇవి రెండూ లేకపోతే ఏ పని అయినా సమర్థవంతంగా చేయలేరు. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కొత్త ఏడాది తీసుకునే నిర్ణయాలు ఏవైనా కానివ్వండి.. అది ఎంత గొప్పది అయినా కానివ్వండి.. వాటిలో ముందు వరుసలో.. మొట్టమొదటగా ఉండాల్సినది ఆరోగ్య రక్షణ. కొత్త ఏడాది చాలా మంది తీసుకునే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ లో ఆరోగ్యం కు సంబంధించి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఇంతకీ ఈ కొత్త ఏడాదిలో అయినా ఆరోగ్యం గురించి తీసుకోవాల్సిన నిర్ణయాలను గూర్చి తెలుసుకుంటే..
మంచి ఆరోగ్యం సంపాదించానే నిర్ణయం తీసుకోవడం భవిష్యత్తులో అనేక రకాల వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడుతుంది. మంచి ఆరోగ్యం ఉంటేనే జీవితంలో ఏదైనా చేయగలం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ మధ్యకాలంలో కనిపించే అన్ని వ్యాధులలో ఒక విషయం సర్వసాధారణంగా చెబుతున్నారు. అదే రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండటం. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారిలో తీవ్రమైన జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది. ఆరోగ్యం బాగుండాలంటే కొన్ని పనులు తప్పనిసరిగా చేయాలి.
బరువు..
బరువు తగ్గడం మెరుగైన ఆరోగ్యానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన దశల్లో ఒకటి. శరీర బరువులో కేవలం ఐదు నుండి పది శాతం తగ్గడం వల్ల గుండె జబ్బులు, టైప్-2 మధుమేహం, అధిక రక్తపోటు వంటి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులను నివారించవచ్చు. బరువు తగ్గాలంటే రోజూ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే అలవాటు ఇందులో చాలా ముఖ్యమైనది. బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా అనేక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడే కొన్ని ప్రత్యేక ఆహారాలను కూడా అనుసరించవచ్చు.
కొత్త సంవత్సరంలో మంచి ఆరోగ్యాన్ని పొందాలనుకుంటే ఆహారాన్ని మెరుగుపరచడంపై శ్రద్ధ పెట్టాలి . ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏమి తింటారు, ఎలా తింటారని అర్థం. ప్రతి రోజు ఆహారంలో పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. పండ్లు, కూరగాయలలో తక్కువ కేలరీలు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటాయి. కొత్త ఏడాది సందర్భంగా ఆహారంలో పండ్లు, కూరగాయలు తప్పకుండా ఎక్కువ మోతాదులో ఉండేలా చూసుకుంటామని ఎవరికి వారు వాగ్దానం చేసుకోవాలి.
పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు కొలెస్ట్రాల్, షుగర్ పెరగకుండా నిరోధిస్తాయి. అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడే ఆకుపచ్చ కూరగాయలతో పాటు నట్స్, విత్తనాలను ఆహారంలో చేర్చడం ద్వారా యాంటీఆక్సిడెంట్లను పొందవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న వ్యాధులకు శారీరక నిష్క్రియాత్మకత ప్రధాన కారణమని చాలా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి . రోజులో ఎక్కువ సమయం కూర్చొని లేదా విశ్రాంతి తీసుకునే వ్యక్తులు నడుస్తూ ఉండే వ్యక్తుల కంటే రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం మొదలైన అనేక ఆరోగ్య రుగ్మతలకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, 2025 సంవత్సరంలో మీ దినచర్యలో - తక్కువగా కూర్చోవడం -ఎక్కువగా నడవడం అనే విషయాన్ని చేర్చుకోవాలి. దీన్ని ఆచరణలో ఉంచాలి కూడా.
రోజువారీ జీవితంలో శారీరక శ్రమను పెంచడం లక్ష్యంగా పెట్టుకోవాలి. లిఫ్ట్‌కు బదులుగా మెట్లను ఉపయోగించడం, దగ్గరగా ఉన్న ప్రదేశాలకు డ్రైవింగ్ చేయడానికి బదులుగా నడుచుకుంటూ వెళ్లడం. మీరు రోజంతా ఆఫీసులో ఉంటే అప్పుడప్పుడు సీట్ నుండి లేచి నడవడం వంటివి చేయాలి. ఈ అలవాటు ఆరోగ్యంలో సానుకూల మార్పులను తీసుకురావడానికి సహాయపడుతుంది.
ఆరోగ్య పరీక్షలు..
చాలా ఆరోగ్యం బానే ఉందిగా మళ్ళీ పరీక్షలకు డబ్బులు దండగ అనే ఆలోచనలో ఉంటారు. అయితే ఆరోగ్య పరీక్షలు జబ్బుల ఉనికిని ముందుగానే గుర్తిస్తాయి. దీనివల్ల ఒకరిగేది ఏంటంటే.. శరీరం ఎక్కువ బాధపడకుండా.. ఎక్కువ నష్టం జరగకుండా చూసుకోవడం. సమస్య పెద్దది అయ్యాక వైద్యం కోసం చేయాల్సిన ఖర్చులో కనీసం 10శాతం ఖర్చులు పెట్టి ముందుగానే పరీక్షలు చేయించుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
ఇంట్లో షుగర్, రక్తపోటును క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవచ్చు. దీని కోసం ఇంట్లో సదరు పరికరాలు ఇంట్లోనే ఉంచుకోవచ్చు. శరీర స్థితికి తగ్గట్టు ఏ పరీక్షలు అవసరమో ఆరోగ్యానికి అనుగుణంగా ఏ పరీక్షలు చేయించుకోవాలో అనే విషయాన్నివైద్యుల సలహాతో తెలుసుకోవాలి. ఆరోగ్యాన్ని సంపాదించుకునే పనిలో ఈ కొత్త ఏడాది మరింత మెరుగ్గా ఉండాలి.
*రూపశ్రీ.