యుద్ధం మార్చిన జీవిత కథలు... ప్రపంచ యుద్ధ అనాథల  దినోత్సవం2025..!

 


ఈ ప్రపంచం ఇప్పటివరకూ రెండు ప్రపంచ యుద్ధాలని చూసింది. అధికారం కోసమో, అస్థిత్వం కోసమో లేక నాయకుల అహంకారపు విధానాల వల్లనో రోజూ ఏదో మూలన చిన్నదో, పెద్దదో యుద్ధం జరుగుతూనే ఉంటుంది.. మనం వింటూనే ఉంటాము. కానీ  మనలో చాలామంది ఆలోచనలు యుద్ధంలో  ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఏ సైనికులు, ప్రజలు ఎంతెంతమంది  చనిపోయారు? అనే ప్రశ్నల దగ్గరే ఆగిపోతాయి.. కానీ, ఆ యుద్ధాలవల్ల కొందరి బ్రతుకులు ఒక్క రోజులోనే చీకట్లోకి నెట్టివేయబడుతున్నాయన్న విషయం  మనమంతా మర్చిపోతుంటాము. ఎవరివి ఆ జీవితాలు అనుకుంటున్నారా... ఇంకెవరివి!! దేశ రక్షణ కోసం ప్రాణాలు ధారబోయటంతో  అనాథలైన   సైనికుల పిల్లలవి..  అలాగే జీవితం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏ బాంబో వచ్చిపడి అందరూ చనిపోయి అనాథలుగా మిగిలిపోయిన సామాన్య ప్రజల పిల్లలవి.... ఇటువంటి వారి పరిస్థితి ఏమిటా అని ఎప్పుడైనా ఆలోచించారా?.. ఆలోచిస్తేనే భయంగా ఉంది కదా..!  మరి వారి భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచిస్తారు?. ఇలా ప్రపంచ యుద్దం కారణంగా అనాథలైన పిల్లల గురించి అనాథల గురించి ఆలోచించే దిశగా ప్రజలను చైతన్యం చేసేదే ప్రపంచ యుద్ద అనాథల దినోత్సవం.  దీని గురించి తెలుసుకుంటే..


ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవం ఎప్పుడు మొదలైంది....

యుద్ధం వల్ల అనాథలైన  సైనికుల పిల్లల గురించి ఆలోచించి వారి కోసం మొదటగా అనాథాశ్రమాలు ఏర్పాటు చేసిన  ఘనత రోమన్లకి దక్కుతుందని చరిత్ర చెబుతుంది. అయితే   ఆధునిక ప్రపంచంలో  ప్రస్తుత   యుద్ధాల కారణంగా అనాథలుగా మారిన పిల్లల గురించి ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం,  అనాథలైన  పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఎదుర్కొనే మానసిక, సామాజిక,  శారీరక ఆటంకాలను గుర్తు చేయడం కోసం   ‘ఎస్ఓఎస్ ఎన్ఫాంట్స్ ఎన్ డిట్రెసెస్’ అనే ఫ్రెంచ్ సంస్థ ఈ ప్రపంచ యుద్ధ అనాథల  దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి6 న జరపడం మొదలుపెట్టింది.  ప్రపంచ వ్యాప్తంగా జరిగే కార్యక్రమాలకు వేదికను అందించడం, వ్యక్తిగత స్థాయి నుంచి వ్యవస్థ, ప్రభుత్వాల దాకా అందరినీ  ఇందులో భాగం చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనాథల హక్కులు, సమస్యలు గురించి పోరాడేలా చేయటం, వారి భవిష్యత్తుకి మంచి పునాది వేయటమే దీని ఉద్దేశ్యం.  

 ఎందుకు జరుపుకోవాలి....

యూనిసెఫ్ ప్రకారం, 1990 నుంచి 2001సంవత్సరాల మధ్య జరిగిన యుద్ధాల కారణంగా  అనాథల సంఖ్య విపరీతంగా పెరిగింది.  ప్రపంచవ్యాప్తంగా 140 మిలియన్లకుపైగా అనాథలు ఉన్నారు.  2001 నుంచి ప్రతి సంవత్సరం 0.7 శాతం అనాథల సంఖ్య తగ్గుతున్నప్పటికీ అది చెప్పుకోతగ్గ  మార్పెమీ  కాదు. పైగా  రష్యా-ఉక్రెయిన్ యుద్ధం,  ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం,  కొత్తగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య రగులుతున్న చిచ్చు వంటి   ప్రస్తుత ప్రపంచ రాజకీయాలు చూస్తే  అనేక మంది పిల్లల భవిష్యత్తు మీద ప్రభావం పడుతుందని అనిపిస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంత మంది అనాథ పిల్లలు  నిర్లక్ష్యం చేయబడకుండా ఉండటం కోసం ప్రతి సంవత్సరం ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవం జరుపుకోవాలి. అటువంటి అనాథ  పిల్లలు జీవితంలో ఎదుర్కునే అన్ని సమస్యలను  గుర్తు చేసుకోవడం కోసం, అలాగే ఈ ప్రపంచంలో ఎవరూ ఇలా అనాథలుగా మిగలకుండా, యుద్ధం లేని ప్రపంచ స్థాపన కోసం కృషి చేయటంలో అందరి బాధ్యతని  గుర్తు చేయటం కోసం  ఈ దినోత్సవం జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

యుద్ధాలవల్ల పిల్లలకి జరుగుతున్న అన్యాయం..

యుద్ధ కాలంలో పిల్లలపై జరుగుతున్న అన్యాయాలని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ గుర్తించి, వాటిని నివారించాలని ప్రపంచ దేశాలకి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది. పిల్లలకు మానవతా సహాయం అందకుండా చేయటం  పిల్లలను కిడ్నాప్ చేయటం,  చంపేయడం,  బలాత్కారం లేదా ఇతర తీవ్రమైన లైంగిక హింసకి పాల్పడటం.  స్కూల్ల్స్, హాస్పిటల్ల మీద దాడులు చేయడం వంటి ఎన్నో  అన్యాయాలు జరుగుతున్నాయి. ఇంకా దారుణంగా పిల్లలని సాయుధ దళాల్లో  లేదా రెబల్ గ్యాంగుల్లో చేర్పించి వాళ్ళని  అక్రమ కార్యాలకి ఉపయోగించుకోవటం కూడా చేస్తున్నారు.

 ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండాలంటే  ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవ వేదికగా ప్రజలందరూ ప్రశ్నించి, నిలదీయాలి. ఒకవేళ వ్యవస్థలు, ప్రభుత్వాలు ఇటువంటి వారిని నిర్లక్ష్యం చేస్తే, వారు మన సమాజంలో ఉన్న అసాంఘిక, ఉగ్రవాద సంస్థల చేతుల్లోకి చిక్కి, తప్పుడు దారిలో నడుస్తారు. అది మన సమాజానికి, ప్రపంచానికి మంచిది కాదు. మన సమాజంలో ఏ ఒక్క వ్యక్తీ నిర్లక్ష్యం చేయబడకూడదు, పైగా సర్వస్వం కోల్పోయి అనాథలుగా మిగిలిన పిల్లలు అస్సలు నిర్లక్ష్యం చేయబడకూడదు.


                                            *రూపశ్రీ.

Related Segment News