మన ఆరోగ్యమే మనకున్న  గొప్ప సంపద.... ఇంటర్నేషనల్ మైండ్-బాడీ వెల్నెస్ డే 2025..!

 


మనం స్కూలులోనో, కాలేజీలోనో చదివేటప్పుడు క్లాస్ రూంలో టీచర్స్ పాఠాలు చెప్పేటప్పుడు  సరిగా వినకుంటే ఓ మాట అనేవారు.. మనిషివి ఇక్కడే ఉన్నావ్ కానీ ఎక్కడ ఆలోచిస్తున్నావ్ అని.  దీన్నే “బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్” అని అంటుంటారు.  అప్పట్లో దీని గురించి పెద్దగా అర్థమయ్యేది కాదు కానీ రాన్రానూ వయసు పెరిగేకొద్ది ఇందులో ఉన్న నిజం, దీని వల్ల మనిషికి ఏర్పడిన పరిస్థితి  స్పష్టంగా అర్థమవుతోంది అన్నది నిజం.  ఎలాంటి  పనినైనా  ఏకాగ్రతతతో చక్కగా చేయాలంటే దానికి మన శరీరం, మనస్సు రెండూ ఆ పని మీదనే ధ్యాస పెట్టాలి. ఆ రెండూ కలిసికట్టుగా పనిచేసినప్పుడే మనం చేసే పనికి సరైన ఫలితం దక్కుతుంది. రెండూ ఒక పనిమీద ఏకాగ్రత కాలేదంటే దాని అర్థం మనిషి శరీరం, మనసు రెండూ సమన్వయంలో లేవని.  మనిషి  శరీరం, మనస్సులు ఆరోగ్యంగా ఉండటం  ఎంత ముఖ్యమో అందరూ అర్ధం చేసుకోవాలన్న లక్ష్యంతో  ప్రతీ సంవత్సరం జనవరి3 వ తేదీన ఇంటర్నేషనల్ మైండ్-బాడీ వెల్నెస్ డేని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ప్రతి మనిషి జీవితంలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకునే మైండ్ హెల్త్,  బాడీ హెల్త్.. ఈ రెండింటిని సంపాదించుకునే మార్గం.. మొదలైన విషయాలు తెలుసుకుంటే..

మైండ్-బాడీ వెల్నెస్ అంటే..

మైండ్-బాడీ వెల్నెస్ అనేది శారీరక, మానసిక ఆరోగ్యాల మధ్య సమతుల్యాన్ని సూచిస్తుంది. ఒక వ్యక్తి పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం శారీరక ఆరోగ్యం ఉంటే సరిపోదు.  మానసికంగా ప్రశాంతత, సంతృప్తిగా ఉండటం   కూడా అవసరం. ఎందుకంటే మన ఆలోచనలు, భావాలు, ప్రవర్తన శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. ఈ విషయాన్ని స్వయానా వైద్యులు, పరిశోధకులు వెల్లడిస్తున్నారు.  గుండె జబ్బులు,  తలనొప్పి వంటి సమస్యలకు మానసిక ఒత్తిడి కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు..  సానుకూల ఆలోచనల ప్రభావంతో  రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుందని, దేని నుంచైనా త్వరగా కోలుకునే  శక్తి  కలుగుతుందని  తేలింది.

మైండ్-బాడీ ఆరోగ్యం ఇప్పుడు చాలా అవసరం..

ప్రస్తుత పరిస్థితుల్లో  బిజీ లైఫ్, పనిలో ఒత్తిడి, అనారోగ్య అలవాట్లు తదితర కారణాల వల్ల  ఆరోగ్యంపై తక్కువ శ్రద్ధ చూపిస్తున్నారనే మాట వాస్తవం. దానివల్ల  ఇప్పటి తరం వారు శారీరకంగా, మానసికంగా చాలా బలహీనమైపోతున్నారు. అందుకే ఇంటర్నేషనల్ మైండ్-బాడీ వెల్నెస్ డే ద్వారా ఆరోగ్యవంతమైన జీవన విధానానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు అర్థం కావాలి.  శరీరం, మనస్సు, ఆత్మ ఈ మూడు చాలా ఆరోగ్యకరంగా ఉండటం చాలా ముఖ్యమని మైండ్-బాడీ వెల్నెస్ డే అందరికి అర్థమయ్యేలా చేస్తుంది. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను చర్చించేందుకు, అవగాహన పెంచేందుకు వారధిగా నిలుస్తుంది.  ఈ రోజు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకునేలా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించవచ్చు.  మంచి  ఆహారపు అలవాట్లను, వ్యాయామ పద్ధతులని  అందరికీ తెలియజేయవచ్చు..  యోగా, మెడిటేషన్ క్యాంపులు పెట్టి,  మానసిక ప్రశాంతత కోసం మెడిటేషన్, యోగా వంటివి చేయడం ఎంత అవసరమో తెలియజేస్తారు. మానసిక ఆరోగ్యంపై సెమినార్స్ పెట్టి సానుకూల ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తారు.

మనమేం చేయాలి....

మైండ్-బాడీ వెల్నెస్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఎందుకంటే ఒకరు చెప్పడం వల్ల ఎవరి శరీరంలోనూ మార్పు రాదు. మానసిక, శారీరక ఆరగ్యం బాగుండాలంటే ప్రతి ఒకరు తమ గురించి తాము కేర్ తీసుకుని తమ ఆరోగ్యాన్ని తాము రక్షించుకోవాలి.  జీవనశైలి సరిచేసుకుని సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం, తగినంత నీరు త్రాగటం,  నిత్యం వ్యాయామం చేయడం, మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగా చేయడం,  తగినంత నిద్రపోవటం వంటివి ప్రతీ ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. మనసు, శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనుషుల  ఆలోచనా విధానం మంచిగా ఉంటుంది.  ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి శారీరక, మానసిక శ్రేయస్సు సాధించడంలో అందరూ  కలసి పనిచేయాలి. అప్పుడే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలం. ఎన్ని సౌకర్యాలున్నా, ఎన్ని సిరి సంపదలున్నా ఈ రోజుల్లో  ఆరోగ్యమే   చేతిలో ఉండే నిజమైన సంపద.. అందుకే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.  

                                                               *రూపశ్రీ.

Related Segment News