కేటీఆర్... కింకర్తవ్యం?

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఈ ఫార్ములా కార్ రేసింగ్ కేసులో నిండా మునిగారా అంటే న్యాయ నిపుణులు ఔననే అంటున్నారు. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ను కోర్టు మంగళవారం (జవవరి 7) కొట్టి వేసింది. ఈ కేసులో కోర్టు తన క్వాష్ పిటిషన్ కు అనుకూలంగా తీర్పు వెలువరిస్తుందనీ, తనపై కేసు నిలవదనీ కేటీఆర్ నమ్మకంతో ఉన్నారు. అయితే కోర్టు ఆయన పిటిషన్ ను కొట్టివేయడమే కాకుండా, అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న ఆయన విజ్ణప్తిని కూడా తోసిపుచ్చింది.

దీంతో ఈ కేసులో కేటీఆర్ పాత్ర, ప్రమేయంపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్టు భావిస్తున్నట్లు స్పష్టమైంది. అసలు కేటీఆర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తునకు గవర్నర్ ఆమోదం తెలిపిన రోజే ఫార్ములా ఈ కార్ కేసులో కేటీఆర్ కు చిక్కులు తప్పవన్న విషయం నిర్ధారణ అయ్యిందని పరిశీలకులు విశ్లేషించారు. ఇప్పుడు ఆయన దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడం, అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వడానికి కూడా నిరాకరించడంతో ఇక ఆయనను ఏసీబీ అరెస్టు చేస్తుందన్న చర్చ పోలిటికల్ సర్కిల్స్ లో మొదలైంది. మరో వైపు ఈడీ ముందు ఆయన మంగళవారం (జనవరి 7) విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే తన క్వాష్ పిటిషన్ పై తిర్పు వెలువడుతుంది కనుక రాలేనని కేటీఆర్  ఈడీకి తెలపడంతో బుధవారం (జనవరి 8)న విచారణకు రావాల్సిందిగా మరోసారి నోటీసులు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో కేటీఆర్ అరెస్టు నుంచి మినహాయింపు కోసం సుప్రీంను ఆశ్రయించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. తన క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంను ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇదే కేసులో కేటీఆర్ పై ఈడీ నమోదు చేసిన కేసులో కూడా ఆయన అరెస్టయ్యే అవకాశాలున్నాయంటున్నారు. దీంతో ఇప్పుడు కేటీఆర్ ఏం చేయబోతున్నారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.