అమరజీవి జయంతి!!


ఆంధ్రరాష్ట్రం ఏర్పడి తెలుగు నేల కొత్త అడుగులు వేయడానికి కారణమైన నాయకుడు పొట్టిశ్రీరాములు. ఈయన ప్రాణత్యాగం ఫలితంగా ఎంతో క్లిష్టమైన తెలుగు రాష్ట్రం ఏర్పాటు జరిగింది. 


బాల్యం!!


ఎక్కడో మద్రాసులో 1901 సంవత్సరంలో పుట్టిన శ్రీరాములు గారు తెలుగు రాష్ట్రం కోసం మరణించడం అనే విషయం వింటే ఆశ్చర్యం వేస్తుంది. మనుషులకు మనుషులకు మధ్యా, మనుషులకు ప్రాంతాలకు మధ్య ఇంత గొప్ప అనుబంధాలు ఉంటాయా అనిపిస్తుంది. ఇరవై సంవత్సరాల వరకు మద్రాసులోనే చదువుకున్న శ్రీరాములు గారు తన విద్యను పూర్తి చేసుకుని చక్కగా ఉద్యోగం సంపాదించారు.  


విషాదం, జీవితంలో పెద్ద మలుపు!!


మనిషి జీవితం ఎప్పుడు ప్రభావానికి లోనవుతుంది అంటే అనుకోని విధంగా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు. పొట్టి శ్రీరాములు గారి జీవితంలోనూ అలాంటిదే జరిగింది. చదువు పూర్తి చేసి, ఉద్యోగం సంపాదించి, పెళ్లి చేసుకుని చక్కగా ఉన్న జీవితంలో పెద్ద కుదుపు పుట్టిన బిడ్డ చనిపోవడం, ఆ తరువాత కొన్ని రోజులకే భార్య కూడా మరణించడం. వెంట వెంట రెండు చావులను చూడటంతో వైరాగ్యానికి లోనైన శ్రీరాములు గారు ఉద్యోగానికి రాజీనామా చేసి, ఆస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టేసి గాంధీ స్థాపించిన సబర్మతి ఆశ్రమంలో చేరిపోయాడు. 


అదే ఆయన జీవితంలో పెద్ద మలుపుగా చెప్పవచ్చు. గాంధీ మాటలకు ప్రభావితుడై సత్యాన్ని, సత్య మార్గాన్ని నమ్మి, అహింసాయుత జీవితాన్ని గడిపిన గొప్ప వ్యక్తి అయ్యాడు.


సత్యాగ్రహాలు, ఉద్యమాలు!!


గాంధీ వెంటే ఉండటం వల్ల పొట్టి శ్రీరాములు గారిలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా దేశం కోసం దేశ స్వాతంత్య్రం కోసం జరుగుతున్న పోరటాలలో తనదైన పాత్ర పోషించారు. ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించాడు. క్విట్ ఇండియా ఉద్యమం వల్ల మూడు సార్లు జైలుకు వెళ్ళాడు.


ఇవన్నీ ఒక ఎత్తు అయితే హరిజనుల కోసం పాటు పడిన గొప్ప వ్యక్తి శ్రీరాములు గారు అన్న విషయం చాలామందికి తెలియదు. హరిజనుల ఆలయ రవేశం కోసం ఎన్నో దీక్షలు చేపట్టి హరిజనోద్ధరణ శాసనాలను మద్రాసు ప్రభుత్వం చేత ఆమోధింపజేశాడు.


గురు శిష్యుల అనుబంధం!!


గాంధీని గురువుగా భావించి ఆయన అడుగుజాడల్లో నడిచినవాడు శ్రీరాములు గారు. కాకపోతే ఈయనలో మొండితనం ఎక్కువ ఉండేదని గాంధీ చెబుతూ ఉండేవారు. ఒకోసారి ఆ విషయంలో గాంధీ చిరాకు పడేవారు కూడా. సబర్మతి ఆశ్రమంలో శ్రీరాములు గారు ఎంతో క్రమశిక్షణతో మరెంతో ప్రేమతో అందరిని పలకరిస్తూ ఉండేవారు.


ఆంధ్రరాష్ట్ర ఉద్యమం!!


తెలుగు భాషా ప్రయుక్త ప్రాంతాలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావాలని చర్చలు మొదలుపెట్టింది ఎంతో మంది ఆంధ్రరాష్ట్రం కోసం గొంతులు విప్పారు. అయితే చూసి చూడనట్టు కాలం ముందుకు సాగిపోతూ ఉంది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆంధ్రరాష్ట్రం కోసం ఎన్ని అభ్యర్థనలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించక పోవడం ఇంకా ఇంకా నిరుత్సాహాన్ని నింపి కొందరిని వెనక్కు లాగేసింది కూడా. 


అయితే పొట్టి శ్రీరాములు గారు అమరనిరాహారదీక్ష మొదలుపెట్టినప్పుడు అందరూ ఎగతాళి చేసినవారే!! కానీ క్రమంగా ఆయనే ఒక మహాశక్తిగా ఎదిగిపోయి కృశించిపోతున్న తన శరీరాన్ని లెక్కచేయకుండా దీక్ష విరమించకుండా ప్రాణాన్ని కూడా వదులుకున్నారు. 


మహాత్మా గాంధీ గనుక బతికి ఉంటే శ్రీరాములు గారు దీక్షలో అలా మరణం కౌగిట్లోకి వెళ్లిపోయేవారు కాదని ఎందరో అభిప్రాయ పడ్డారు. కానీ చరిత్ర మాత్రం తన రాత తాను రాసుకున్నట్టు అందులో శ్రీరాములు గారి ప్రాణత్యాగాన్ని విషాదాక్షరాలతో లిఖించుకుంది.


ప్రాణత్యాగమే నేటి సంతోషాల పలితం!!


శ్రీరాములు గారి ప్రాణత్యాగం వల్లనే ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది అనేది అందరికీ తెలిసిన నిజం. కానీ ఆయన మరణించినప్పుడు ఆయన మృతదేహాన్ని తాకడానికి కూడా వెనకడుగు వేసిన ఈ మనుషుల వారసత్వాలే నేడు ఆయన ప్రాణత్యాగం వల్ల లభించిన స్వేచ్ఛయుత ఆంధ్రరాష్ట్రంలో బతుకుతున్నాయి. ఆనాటి తప్పిదాలు వదిలినా నేటి తరాలకు, రేపటి తరాలకు  అమరజీవి పొట్టిశ్రీరాములు గారి గురించి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


◆వెంకటేష్ పువ్వాడ

 

Related Segment News