9న కేటీఆర్ అరెస్ట్?
posted on Jan 7, 2025 12:29PM
బీఆర్ఎస్ అధినేత, మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ గురువారం అంటే జనవరి 9న అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫార్మూలా ఈ కార్ కేసులో ఆయన దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడమే కాకుండా, అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వడం కూడా కుదరదని స్పష్టం చేయడంతో ఆయనకు ఉన్న అన్ని దారులూ మూసుకుపోయాయి. కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేసిన తరువాత ఏసీబీ దూకుడు పెంచింది. గ్రీన్ కో కంపెనీ కార్యాలయాలలో సోదాలు ప్రారంభించింది. ఫార్ములా ఈ కార్ నిర్వహణలో గ్రీన్ కో భాగస్వామి అన్న విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ కంపెనీ పలు దఫాలుగా బీఆర్ఎస్ కు దాదాపు 41 కోట్ల రూపాయలు ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు ఇచ్చినట్లు రేవంత్ సర్కార్ ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు హైదరాబాద్, మచిలీపట్నంలోని గ్రీన్ కో కార్యాలయాలలో మంగ ళవారం (జనవరి 7) తనిఖీలు చేపట్టారు. మరో వైపు నందినగర్ లోని కేటీఆర్ నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. దీంతో ఏ క్షణంలోనైనా కేటీఆర్ అరెస్టయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జోరందుకుంది. అయితే ఏసీబీ కేటీఆర్ కు ఈ నెల 9న విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆ రోజు వరకూ కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశాలు లేవని పరిశీలకులు భావిస్తున్నారు. వాస్తవానికి సోమవారం (జనవరి 6) విచారణకు హాజరు కావాల్సిన కేటీఆర్.. ఏసీబీ కార్యాలయం వరకూ వెళ్లి కూడా తనతో పాటు తన న్యాయవాదులనూ అనుమతించాలని పట్టుబట్టి విచారణకు హాజరు కాకుండా వెనుదిరిగారు.
ఈ నేపథ్యంలో ఏసీబీ కేటీఆర్ కు మరోమారు నోటీసులు జారీ చేసి.. గురువారం (జనవరి 9) హాజరు కావాల్సిందిగా పేర్కొంది. ఆ నోటీసుల్లో న్యాయవాదులకు అనుమతి లేదని స్పష్టంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ విచారణకు గైర్హాజరైతే సహకరించడం లేదన్న కారణంతో అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా ఆయన విచారణకు హాజరైనా, విచారణ అనంతరం అరెస్టు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ అరెస్టు మాత్రం అనివార్యమనీ, అది గురవారమే అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.