హురియత్ నేతలు జైలుకి! వేర్పాటువాదం కథ కంచికి

గతంలో ఎప్పుడూ లేనంతగా కాశ్మీర్ అల్లోకల్లోలం అవుతోంది. అయితే, చరిత్రలో ఎప్పుడూ జరగనవి కూడా కాశ్మీర్లో ఇప్పుడు జరుగుతున్నాయి! నిన్న అరెస్ట్ చేసిన హురియత్ కీలక నేతల్ని ఇవాళ్ల దిల్లీ కోర్టులో హాజరుపరిచారు ఎన్ఐఏ అధికారులు! ఇది అస్సలు సాధారణ విషయం కాదు. అసలు ఇలాంటి చర్య కాశ్మీర్ చరిత్రలో గతంలో ఎప్పుడూ జరగలేదు. 1990ల తరువాత నుంచీ హురియత్ నేతలు అడ్డూ అదుపు లేకుండా వేర్పాటువాద ఉపన్యాసాలు, నినాదాలు చేస్తూ స్వైర విహారం చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు మోదీ సర్కార్ తొలి సారి వేర్పాటువాదులపై వేటు వేసింది! ఇక ఇప్పుడు అసలు ఆట మొదలైంది…

 

హురియత్ అంటే కాశ్మీర్లోని వేర్పాటు వాద సంస్థ. ఒక్కటిగా లేకుండా మూడు ముక్కలైన హురియత్ మొత్తం మీద మాత్రం భారత్ కు వ్యతిరేకం. హురియత్ నేతల్లో కొందరు అతివాదులు, కొందరు మితవాదులు, కొందరు పూర్తిగా పాకిస్తానీ చెంచాలు. ఎవరు ఏది అయినా… అందరి లక్ష్యం మాత్రం ఒక్కటే! భారత్ నుంచి కాశ్మీర్ ను విడదీయటం. అయితే, 2106నుంచీ పదే పదే కొనసాగుతోన్న హింసాత్మక రాళ్లు రువ్వే దుశ్చర్య వీరి పన్నాగమే. ఆ విషయం తేల్చేలా ఖచ్చితమైన ఆధారాలు సేకరించిన ఎన్ఐఏ ఇప్పడు హురియత్ ప్రధాన నేతల్ని అరెస్ట్ చేసింది. అందులో హురియత్ అత్యున్నత నాయకుడైన సయ్యద్ గిలానీ అల్లుడు కూడా వున్నాడు. వీరందర్నీ జైలుకి తరలించటం, త్వరలో ఇంటరాగేట్ చేయనుండటం… అతి పెద్ద పరిణామం అనే చెప్పాలి…

 

హురియత్ పైకి కాశ్మీరీ స్వాతంత్ర్యం అని కబుర్లు చెప్పినా దాని అసలు ఉద్దేశం పాకిస్తాన్ కు సాయపడటం. ఎలాగైనా కాశ్మీర్ ను ఇండియా నుంచి విడదీయాలని కలలు కనే పాక్ నిరంతరాయంగా ఈ హురియత్ వేర్పాటువాద నాయకుల్ని మేపుతూ వుంటుంది. అలా వారికి లభించిన పాకిస్తానీ నిధుల్లోంచే వారు మధ్య స్థాయి హురియత్ నేతలకి డబ్బుల మూటలు అందించారు. అవ్వి తరువాతి దశలో కింది స్థాయి కాశ్మీరీ రాళ్లు రువ్వే అల్లరి మూకలకి అందాయి. ఇంత కాలం దీన్ని మాటల్లో చెప్పిన మన దర్యాప్తు సంస్థలు గత కొన్ని నెలల్లో పక్కా ఆధారాలు సంపాదించాయి. రాళ్లు రువ్వుటంలో ప్రత్యేక నైపుణ్యం కలిగిన దాదాపు 50మంది కాశ్మీరీ యువత హురియత్ నేతలతో మాట్లాడిన ఫోన్ కాల్స్ ఎన్ఐఏ రికార్డ్ చేసింది. పదే పదే వారు చేసిన కాల్స్, అలాగే, కాశ్మీర్లోని అనేక సమస్యాత్మక ప్రాంతాల నుంచి అదే స్టోన్ పెల్టర్స్ హురియత్ వాళ్లతో మాట్లాడటం పోలీసుల అనుమానాలు నిజం చేసింది. కాశ్మీర్లో రాళ్లు రువ్వటం ఊరికే జనం ఆవేశంతో చేస్తున్నది కాదు. అంతా వ్యూహాత్మకంగా డబ్బులిచ్చి చేయిస్తున్న కుట్ర. ఇది నిరూపించే ఆధారాలు దొరకటంతోనే హురియత్ నేతల్ని అరెస్ట్ చేశారు…

 

హురియత్ వేర్పాటు వాద నాయకుల తరువాత రాళ్లు రువ్వటంలో పాల్గొన్న అల్లరి మూకల్ని అరెస్ట్ చేసే అవకాశం వుంది. అంతే కాదు, రానున్న కాలంలో వేర్పాటు వాదం పేరుతో పాకిస్తాన్ కు సాయపడుతున్న హురియత్ నామరూపాలు లేకుండా పోయే ఛాన్స్ కూడా వంది. అతి త్వరలో గిలానీ, యాసిన్ మలిక్ లాంటి సీనియర్ హురియత్ నాయకుల్ని కూడా అదుపులోకి తీసుకుంటారని అంటున్నారు. అదే జరిగితే వేర్పాటు వాదం తీవ్రంగా నష్టపోక తప్పదు. రాళ్లు రువ్వే అల్లరి మూకలు కూడా తోకలు ముడవాల్సి వస్తుంది…