చంద్రబాబు తెలంగాణా తెదేపాకు దూరం అవుతున్నారా?
posted on Dec 2, 2015 6:36PM
.jpg)
స్థానిక సంస్థల కోటాలో జరుగునున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో తెదేపా అనుసరించాల్సిన వ్యూహాల గురించి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈరోజు తన పార్టీ తెలంగాణా నేతలతో చర్చించారు. మహబూబ్ నగర్ నుండి మాజీ ఎమ్మెల్యే కొత్త కోట దయాకరరెడ్డిని పార్టీ అభ్యర్ధిగా నిలబెట్టేందుకు ఆయన ఆమోదం తెలిపారు. కానీ రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలో పోటీ చేయాలా వద్దా చేస్తే గెలిచే అవకాశాలున్నాయా లేవా? అని ఆలోచించుకొని బరిలోకి దిగడం మంచిదని ఆయన తన నేతలకు సూచించారు. ఈ విషయంలో వారినే తగిన నిర్ణయం తీసుకోవలసిందిగా చంద్రబాబు నాయుడు సూచించారు. అలాగే గ్రేటర్ ఎన్నికల కోసం కూడా ఇప్పటి నుండే తగిన వ్యూహ రచన చేసుకోవాలని కోరారు.
అంటే చంద్రబాబు నాయుడు తెలంగాణాలో పార్టీ బాధ్యతలను క్రమంగా అక్కడి నేతలకే అప్పగించాలని భావిస్తున్నట్లు అర్ధమవుతోంది. ఎర్రబెల్లి-రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి-ఉమా మాధవ రెడ్డిల మధ్య నెలకొన్న తీవ్ర భేదాభిప్రాయాల వలన పార్టీ చాలా బలహీనపడింది. పార్టీలో నేతల మధ్య సయోధ్య లేదని తెలిసి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీ బాధ్యతలు వారికే పూర్తిగా అప్పగించినట్లయితే దాని వలన పార్టీ మరింత నష్టపోయే ప్రమాదం ఉంటుంది. వచ్చే నెలలో కీలకమయిన జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు పార్టీపై తన పట్టు వదులుకొన్నట్లయితే దాని వలన ఎన్నికలలో పార్టీ నష్టపోవచ్చును.