అమెరికా, సాన్ బెర్నార్డినో నగరంలో కాల్పులలో 14 మంది మృతి
posted on Dec 3, 2015 7:14AM
.jpg)
అమెరికాలో సాన్ బెర్నార్డినో నగరంలో నిన్న ఉదయం స్థానిక కాలమాన ప్రకారం 10.59 గంటలకి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆ కాల్పులలో అక్కడికక్కడే 14 మంది మరణించగా, మరో 17 మంది గాయపడ్డారు. సాన్ బెర్నార్డినో నగరంలో ఇన్ ల్యాండ్ రీజియనల్ సెంటర్ లో ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. కొన్ని స్వచ్చంద సంస్థలు కలిసి ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో స్థానిక ప్రజలు పాల్గొన్నపుడు ముగ్గురు దుండగులు లోపాలకి ప్రవేశించి వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల సమాచారం అందుకొన్న వెంటనే సాన్ బెర్నార్డినో స్వాట్ పోలీసుకు తక్షణమే అక్కడికి చేరుకొని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఆ ముగ్గురు దుండగులను పట్టుకొనేందుకు ప్రయత్నించారు. వారిలో ఒకడు పోలీసు కాల్పులలో మరణించగా మరొకడు తప్పించుకొని పారిపోయినట్లు సాన్ బెర్నార్డినో పోలీస్ ఉన్నతాధికారి వికీ సెర్ వాంటిస్ తెలిపారు. మూడో వ్యక్తి ఆచూకి తెలియలేదు. బహుశః అతను కూడా తప్పించుకొని పారిపోయుండవచ్చునని భావిస్తున్నారు. కాల్పులు జరిపిన ముగ్గురూ ఏదయినా ఉగ్రవాద సంస్థకి చెందిన వారా లేక నగరంలో అసాంఘిక శక్తులా? అనేది పోలీసుల దర్యాప్తులో తెలియవలసి ఉంది. ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ఈ కాల్పులకు భాద్యత తీసుకోలేదు.