అవును! అమీర్ ఖాన్ గురించి నేను అలాగా మాట్లాడటం తప్పే: వర్మ
posted on Dec 2, 2015 2:49PM
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మత అసహనం గురించి మాట్లాడిన కొన్ని మాటలపై చాలా మందిలాగే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఆయనపై విమర్శలు గుప్పించారు.
తనపై వస్తున్న విమర్శలపై అమీర్ ఖాన్ స్పందిస్తూ నేను భారతదేశాన్ని విడిచి ఎక్కడికి వెళ్లిపోవాలనుకోవడం లేదు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. నా దేశభక్తిని రుజువు చేసుకోవలసిన అవసరం లేదు. నా ఇంటర్వ్యూ యొక్క పూర్తి సారాంశం గురించి తెలియని వాళ్ళే నన్ను విమర్శిస్తున్నారు. అది చూస్తే వాళ్ళు కూడా తమ అభిప్రాయం మార్చుకొంటారని నేను భావిస్తున్నాను,” అని అన్నారు.
అమీర్ ఖాన్ చెప్పిన ఆ మాటలు విన్న తరువాత రామ్ గోపాల్ వర్మ ఆ ఇంటర్వ్యూ సారాంశం మొత్తం చదివి అమీర్ ఖాన్ చెప్పినట్లే తన అభిప్రాయం మార్చుకొన్నారు. మార్చుకోవడమే కాకుండా ఇటీవల ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను తొందరపడి అమీర్ ఖాన్ పట్ల తప్పుగా మాట్లాడానని ఒప్పుకొన్నారు.
దాని గురించి వివరిస్తూ “మన జీవితంలో మనం ఎన్నో తప్పులు తెలిసీ తెలియకుండా చేస్తుంటాము. ఇది కూడా అటువంటిదే. ఫ్లాప్ సినిమాలు తీయడం పెద్ద తప్పు అనుకొంటే ఈవిధంగా తొందరపడి స్పందించడం చిన్న తప్పు అనుకోవచ్చును. అమీర్ ఖాన్ మాట్లాడిన ఆ రెండు ముక్కలు బయటకు రాగానే అందరూ తమ స్పందిన్చినట్లే నేను ఆ రెండు ముక్కలలో ఉన్న అర్ధాన్ని మాత్రమే స్వీకరించి స్పందించాను. ఆ సమయంలో నా మనసుకు ఏమి తోచిందో అదే చెప్పాను. కానీ అమీర్ ఖాన్ ఇంటర్వ్యూ పూర్తి సారాంశం చదివిన తరువాత ఆయనేమీ తప్పు ఉద్దేశ్యంతో అలాగా మాట్లాడలేదని అర్ధమయింది. నేను ఆవిధంగా మాట్లాడటం తప్పే,” అని రామ్ గోపాల్ వర్మ అన్నారు.