మళ్ళీ సాగు చట్టాలు? మంత్రి వ్యాఖ్యలతో మొదటి కొచ్చిన చర్చ!

కేంద్ర ప్రభుత్వం,  రైతుల ఆందోళనకు తలొగ్గి మూడు వివాదస్పద సాగు చట్టాలను రద్దు చేసింది.  పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సాగు చట్టాల రద్దు బిల్లును ఉభయ సభలు ఆమోదించాయి. అలాగే, వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ సుమారు ఏడాదికి పైగా దేశ రాజదాని ఢిల్లీ సరిహద్దులలో ఆందోళన చేసిన రైతు సంఘాల సమన్వయ సమితి ఆందోళన విరమించుకుంది. ఉద్యమానికి నాయకత్వం వహించిన రైతు నాయకులు, రైతులు ఢిల్లీ వదిలి వెళ్లారు.  అక్కడితో, ఆ వివాదం ముగిసినట్లే అనుకున్నారు. 

అయితే కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి, నరేంద్ర సింగ్‌ తోమర్‌ తేనె తుట్టెను మళ్ళీ కదిల్చారు. ఉద్దేశపూర్వకంగా ఆన్నారో, యాదృచ్చికంగా ఆయన ఆ వ్యాఖ్యలు చేశారో గానీ, నాగపూర్’లో ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు వివదస్పదం అవుతున్నాయి.   నాగ్‌పుర్‌లో జరిగిన అగ్రో విజన్‌ ఎక్స్’పో  కార్యక్రమంలో పాల్గొన్న తోమర్, మాట్లాడుతూ.. "స్వాతంత్ర్యం వచ్చిన 70ఏళ్ల తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో అతిపెద్ద సంస్కరణ జరిగింది. వ్యవసాయానికి సంబంధించిన చట్టాలను సవరించి కొత్త చట్టాలను తీసుకొచ్చాం. అయితే విపక్షాలకు, కొందరు రైతు నాయకులకు ఈ సంస్కరణలు నచ్చలేదు. అందుకే నల్ల చట్టాలుగా ప్రచారం చేసి వాటిని రద్దు చేయించారు. కానీ ప్రభుత్వం ఏం అసంతృప్తి చెందడం లేదు. మేం ఒక అడుగు వెనక్కి వేశాం. కానీ తప్పకుండా మళ్లీ ముందడుగు వేస్తాం. ఎందుకంటే రైతులే ఈ దేశానికి వెన్నెముక" అని  అన్నారు. 

మరోమారు రైతుల ఆందోళన, రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని  దిగొచ్చి నూతన సాగు చట్టాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. వాటిని మళ్లీ తీసుకురానుందా? అనే చర్చ మళ్ళీ తెర మీదకు వచ్చింది. నిజానికి, చట్టాల రద్దు ప్రకటన చేసిన సందర్భంలోనే, ప్రధానమంత్రి చట్టాలలో లొసుగులు ఉన్నాయని ఉపసంహరించుకుంటున్నామని చెప్పలేదు. చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారిని సమాధాన పరచడంలో విఫలమయ్యామని, రైతులకు మేలుచేసే చట్టాలను అమలు చేయలేకపోతున్నందుకు క్షమాపణలు చెప్పారు. ఇప్పుడు కేంద్ర మంత్రి అదే విషయాన్ని మరో కోణంలో విప్పి చెప్పారు. దీంతో సాగు చట్టాలను మళ్లీ తీసుకొచ్చే అవకాశాలున్నాయనే  చర్చ మొదలైంది. అయితే దీనిపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయి, అనేది చూడవలసి వుంది.