మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై కేసు

తమ పార్టీ అధికారంలో ఉండగా  చట్టాలు, రాజ్యాంగం ఇలా వేటినీ లెక్క చేయకుండా ఇష్టారీతిన చెలరేగిపోయిన వైసీపీ నేతలకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. చట్టానికి లోబడి ఉండక పోతే ఏం జరుగుతుందో అర్ధం అవుతోంది. వైసీపీ అధికారంలో ఉండగా పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని పెత్తనం చెలాయించిన నేతలపై ఇప్పుడు అదే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.

కాకినాడలో తాను చెప్పిందే వేదం, తాను చేసిందే చట్టం అన్నట్లుగా విర్రవీగిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై కాకినాడలో కేసు నమోదైంది. పోలీసులు, అధికారుల విధులకు ఆటంకం కలిగించిన నేరంపై ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.  

ఈ నెల 2వ తేదీన వైసీపీ నేత బళ్ల సూరిబాబుకు చెందిన అక్రమ కట్టడం కూల్చివేత సమయంలో మునిసిపల్ అధికారులు, సిబ్బంది, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సహా 26 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని ఏ1గా పేర్కొన్నారు. అలాగే బల్ల సూరిబాబును ఏ2గా పేర్కొన్నారు.