ఏపీకి చేదు మిగిల్చిన సంవత్సరం 2021

మరో సంవత్సరం (2021) కాలగర్భంలో కలిసిపోతోంది.. కొత్త  సంవత్సరం (2022) వచ్చేస్తోంది. వెళ్లి పోతున్న సంవత్సరం (2021) లో, ఏపీలో ఏమి జరిగిందో, అందరికీ తెలిసిన విషయమే. నిజానికి ఈ ఏడాదిలో ఏపీలో ఏదైనా పెరిగిందంటే, అప్పులు పెరిగాయి, అరాచకం పెరిగింది. నేరాలు,ఘోరాలు పెరిగాయి. సంక్షేమానికి చిల్లులు పడ్డాయి. ప్రస్తుతం వీడ్కోలు పలుకుతున్న 2021 సంవత్సరం ప్రారంభం నాటికే, రాష్ట్ర రుణ భారం రూ.3,73,140 కోట్లకు చేరిపోయిందని గత జనవరిలో విడుదల చేసిన నివేదికలో ‘కాగ్’  హెచ్చరించింది. అయినా అదేమీ పట్టించుకోకుండా జగన్ ప్రభుత్వం అందిన కాడికి అప్పులు చేసుకుంటూ పోయింది.ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, ఈ సంవత్సర కాలంలో మోస్ట్ అఫ్ ది టైమ్.ఎక్కువ కాలం అప్పుల వేటలోనే ఉన్నారు. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏటికేడాది అప్పులు పెంచుకుంటూనే ముందుకు సాగింది. 

ఇప్పడు సంవత్సరం ముగిసే సమయానికి రాష్ట్రం అధికారిక అప్పుల పద్దే రూ. 4లక్షల కోట్లు దాటిపోతుందని అంటున్నారు. ఇది గాక వివిధ కార్పొరేషన్ల ద్వారా వేలకోట్ల రూపాయలు అప్పులు చేసింది. చివరకు అప్పుల కోసమే సూట్ కేసు కార్పొరేషన్లు ఏర్పాటుచేసి ఈ చేత్తో అప్పు చేసి ఆ చేత్తో ప్రభుత్వ ఖజానాలో జమ చేసే చీకటి వ్యవస్థను జగన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతం అప్పులు పుట్టే దారులు అన్నీ మూసుకు పోయాయి. మరోవంక  నెలకు ఐదు వేల కోట్ల  రూపాయలు అప్పు చేయనదే పూట గడవని పరిస్థితి. అందుకే, ఓటీఎస్ వంటి పధకాల ద్వారా అడ్డదారిలో ఆదాయం సమకూర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. విద్యుత్ చార్జీలు,ఆర్టీసీ బస్సు చార్జీలు పంచి ప్రజల మీద భారం మోపుతోంది.చివరకు, చెత్త పన్ను వేసి జనం జేబులకు చిల్లులు పెడుతోంది. సకాలంలో రుణాలు తిరిగి చెల్లించక పోవడంతో, కేంద్ర విద్యుత్ ఆర్థిక సహాయ సంస్థ, ఆర్‌ఈసీ రికార్డుల్లో జెన్‌కో, రాష్ట్ర పవర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్లను నిరర్ధక అకౌంట్ల జాబితాలోకి చేర్చింది.

ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎప్పుడూ ఇలాంటి అవమానం జరగలేదని, అధికారులు అంటున్నారు. నిజానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమై పోయింది. ఏ పూటకు ఆ పూట గడవడమే కష్టంగా మారింది. ఇదిలా ఉంటే, కొత్త సంవత్సరంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని, అప్పుల భారం , వడ్డీల చెల్లింపుల భారం పెరిగి ఇంకా ఇంకా దిగజారినా ఆశ్చర్య పోనవసరం లేదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

అదే విధంగా సంక్షేమ పథకాలను ఎరగా వేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో సంక్షేమానికి చిల్లులు పెట్టింది. నవరత్నాలు నవరంద్రాల ఖాజానాను ఊడ్చేస్తోంది. దీంతో సర్కార్ సంక్షేమ పథకాలకు కత్తెర్లు వేస్తోంది. జగన్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా, అత్యంత ఆర్భాటంగా ప్రారంబించిన అమ్మఒడి’ పధకానికి ఒక ఏడాది వాయిదా పేరిట  మంగళం పాడింది. వచ్చే ఏడాది అయినా అమలవుతుందా లేదా అనేది, అనుమానమే అంటున్నారు సంబందిత అధికారులు. అమ్మ ఒడి ఒక్కటే కాదు, ఇతర పథకాలకు కూడా జగనన్న సర్కార్, కోతలు పెడుతోంది. చివరకు వృద్ధాప్య పెన్షన్లు మొదలు సామాజిక పెన్షన్ల విషయంలోనూ, జగన్ రెడ్డి ప్రభుత్వం, పంచ పాండవులు, మంచం కోళ్ళు సామెతను నిజం చేస్తోంది. ఆంక్షలు విధించి, కొత్త లెక్కలు చెపుతోంది. 

ఈ నేపధ్యంలో సంవత్సర ఆరంభంలో అంతో ఇంతో ఘనంగా కనిపించిన సానుకూల వాతావరణం సంవత్సరాంతానికి వచ్చే సరికి, పూర్తిగా ప్రతికూలంగా మారింది. ఓ వంక పీఆర్’సీ విషయంలో ప్రభుత్వం ఉద్యోగులతో దాగుడు మూతలు ఆడుతోంది. ఉద్యోగ సంఘాలు సర్కార్ తీరు పట్ల భగ్గుమంటున్నాయి. అంతే కాదు, తాము తలచుకుంటే ప్రభుత్వాన్నే కూల్చేస్తామనే వరకు వెళ్లి హెచ్చరికలు చేస్తున్నాయి. మరో వంక ఓటీపీ,విద్యుత్ చార్జీలు, భగ్గుమంటున్న నిత్యావసర సరకుల ధరలు ఇలా వివిధ కారణాలతో, వివిధ రూపాలలో జనాగ్రహం భగ్గు మంటోంది. ఇలా ఎలా చూసినా, వెళ్ళిపోతున్న సంవత్సరం ఏపీ ప్రజలకు, ప్రభుత్వానికి కూడా చేదు అనుభవాలనే మిగిల్చి వెళుతోంది. అంతే కాదు కొత్త సంవత్సరం కూడా అంత ఆశాజనకంగా కనిపించడం లేదనే రాజకీయ, ఆర్థిక  విశ్లేషకులు భావిస్తున్నారు.