దుష్ప్రచారం కోసమే మార్గాని ప్రచార రథం దగ్ధం

వైసీపీ అరాచకాలు అధికారం కోల్పోయిన తరువాత కూడా కొనసాగుతున్నాయి. దొంగే దొంగ దొంగ అని అరిచిన చందంగా ఆ పార్టీ వ్యవహారశైలి ఉంది. ఇందుకు తాజా ఉదాహరణ రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రచార రథం దగ్ధం ఘటనే. గత నెల 28న అంటే వైసీపీ ఘోర పరాజయం పాలై అధికారం కోల్పోయిన తరువాత ఈ ఘటన జరిగింది.

రాజమహేంద్రవరం వీఎల్ పురంలోని మార్గాని భరత్ ఎస్టేట్స్ ప్రాంగణంలోనే ఉన్న ఆయన కార్యాలయం వద్ద ఉన్న ఆయన ప్రచార రథం దగ్ధమైంది. ఈ రథం దగ్థం ఘటనపై పోలీసులకు ఈ నెల 2న ఫిర్యాదు అందింది. ప్రచార రథం దగ్థం ఘటనపై అంత ఆలస్యంగా ఫిర్యాదు అందడంపై అప్పట్లోనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. సరే ఆ సంగతి పక్కన పెడితే.. తెలుగుదేశం వారే మార్గాని భరత్ ప్రచార రథాన్ని దగ్ధం చేసేశారంటూ ఊరూ వాడా ఏకమయ్యేలా నానా యాగీ చేశారు. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు.

వారి దర్యాప్తులో వైసీపీ వాళ్లే రథాన్ని దగ్థం చేసి నెపాన్ని తెలుగుదేశంపై నెట్టేందుకు ప్రయత్నించారని వెల్లడైంది. ఇక రథం దగ్ధానికి సినీ ఫక్కీలో ప్రణాళిక రచించినట్లు కూడా పోలీసు దర్యాప్తులో తేలింది. ఇంతకూ రథాన్ని దగ్థం చేసింది ఎవరంటే మార్గాని భరత్ తండ్రి మార్గాని నాగేశ్వరరావు ముఖ్య అనుచరుడు శివేనని కూడా తేలింది. మార్గాని ఎస్టేట్స్ లో మార్గాని భరత్ కార్యాలయానికి సమీపంలోని షెడ్ లో ఉన్న రథం తగుల బెట్టడానికి  శివ పోలీసులు సైతం దిగ్భ్రమ చెందేలా ప్రణాళిక రచించారు. అల్యూమినియం ఫాయిల్‌ కవర్‌లో పెట్రోలు నింపి దానిని రథం ముందు టైరుపై పెట్టాడు. ఒక్క సారిగా మంటలు ఎగసిపడకుండా మస్కిటో కాయిల్ ను ఆ కవర్ కు కట్టి దానిపై అగ్గిపుల్లలు పేర్చాడు. మస్కిటో కాయిల్ మెల్లిగా కాలుతూ అగ్గిపులల వరకూ వచ్చి ఒక్కసారిగా పెట్రోలు అంటుకుని మంటలు వ్యాపించాయి.  సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు ఛేదించారు. నిందితుడు శివను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. విచారణలో మార్గాని భరత్ పై ప్రజలలో సానుభూతి కలిగేలా చేయడం కోసమే రథాన్ని దగ్థం చేసినట్లు శివ వెల్లడించాడు.