బ్రిటన్ ఎన్నికలలో రిషి సునాక్ ఓటమి!

బ్రిటన్ పార్లమెంట్‌కి జరిగిన ఎన్నికలలో  భారత సంతతికి చెందిన ప్రధానమంత్రి రిషి సునాక్ ఓటమి పాలయ్యారు. ఈ పరాజయానికి బాధ్యత వహిస్తున్నట్టు రిషి సునాక్ ప్రకటించారు. రిషి సునాక్ మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, సుధామూర్తిల అల్లుడు అనే విషయం తెలిసిందే.

‘‘ఈ సార్వత్రిక ఎన్నికలలో లేబర్ పార్టీని విజయం వరించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్‌కి అభినందనలు తెలియజేస్తున్నాను. అధికారం శాంతియుతంగా చేతులు మారుతుంది. అది మన దేశ భవిష్యత్తు, స్థిరత్వంపై అందరికీ విశ్వాసం కలిగిస్తుంది’’ అని సునాక్ అన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన ఎంపీగా గెలిచిన తన సొంత నియోజకవర్గం రిచ్‌మండ్ అండ్ నార్తర్న్ అలర్టన్‌లోని పార్టీ మద్దతుదారుల్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన వారిని క్షమించమని కోరారు. ఈ ఓటమికి బాధ్యత వహిస్తున్నట్టు ప్రకలించారు. 

ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ వ్యాప్తంగా మొత్తం 650 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. అధికారం కోసం 326 సీట్లలో గెలుపొందాల్సి వుంటుంది. లేబర్ పార్టీకి ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం మెజారిటీకి మించిన స్థానాలు వచ్చాయి. సునాక్‌కి చెందిన కన్జర్వేటివ్ పార్టీ 80 స్థానాలు మాత్రమే దాటగలిగింది. గత 14 సంవత్సరాలుగా బ్రిటన్‌లో కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో వుంది. ఈ ఎన్నికలలో విజయం సాధించిన లేబర్ పార్టీ నాయకుడు కీర్ స్మార్టర్ తదుపరి బ్రిటన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు.