సీజేఐతో సీఎం.. తలా తోక లేని పాలన.. ఆంక్షలు షురూ.. సాగు వర్రీ.. టాప్ న్యూస్@7PM

ఏపీ పర్యటనలో ఉన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను ఏపీ సీఎం జగన్ కలిశారు. తన భార్య భారతితో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. క్రిస్మస్ సందర్భంగా మూడు రోజుల కడప జిల్లా పర్యటనకు వెళ్లిన జగన్... తన పర్యటనను ముగించుకుని ఈ మధ్యాహ్నం విజయవాడకు చేరుకున్నారు.తర్వాత నేరుగా నొవోటెల్ హోటల్ కు వెళ్లిన జగన్... అక్కడ భారత ప్రధాన న్యాయమూర్తిని కలిశారు
--------
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న లొసుగుల కారణంగానే కేంద్రాన్ని వైసీపీ ప్రభుత్వం ఏదీ అడగలేకపోతోందని చెప్పారు. తలా తోక లేని పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని అన్నారు. రానున్న 30 నెలల్లో బీజేపీ సత్తా ఏమిటో చూపిస్తామని చెప్పారు. వైసీపీలో ఆ పార్టీ నేతలే ఇబ్బంది పడుతున్నారని అన్నారు.
------
జగన్,  చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. వీరిద్దరూ మాటలతో జనాలను మోసం చేశారని అన్నారు. రాష్ట్రంలో ఏయే అభివృద్ధి పనులు చేశారో వీరిద్దరూ చెప్పాలని డిమాండ్ చేశారు. వీరు పనులు చేయరు, చేసే వారిని అడ్డుకుంటారని చెప్పారు. వీరికి ఏపీ ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పారు. గత సీఎం గ్రాఫిక్స్ తో మాయ చేస్తే... ప్రస్తుతం సీఎం  మాటలతో మోసం చేస్తున్నారని అన్నారు. 
--------
ప్రతి వ్యవస్థను, ప్రతి రంగాన్ని భయపెట్టి గుప్పిట్లో పెట్టుకునేందుకు ఏపీలోని వైసీపీ ప్రభుత్వం యత్నిస్తోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. ఇప్పటికే రాష్ట్రంలోని పరిశ్రమలను బెదిరించి వెళ్లగొట్టారని, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా వారిని భయపెట్టారని అన్నారు. ఇప్పుడు సినీ పరిశ్రమపై పడ్డారని దుయ్యబట్టారు. వైసీపీ అవినీతి పాలనతో ఏపీ అభివృద్ధి పడిపోయిందని అన్నారు. 
--
నూతన సంవత్సర వేడుకలపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వేడుకలు నిర్వహించుకునే ప్రదేశంలో భౌతికదూరం పాటించాలని ఆదేశించింది. మాస్క్ పెట్టుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. మాస్కులు ధరించని వారికి వెయ్యి రూపాయల జరిమానా విధించనున్నారు. జనవరి 2వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొంది. ఈరోజు నుంచే ఆంక్షలు అమల్లోకి వస్తాయని చెప్పింది.
------
 ప్రభుత్వాలైనా ప్రజల కోసమే పని చేయాలని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులను రోడ్డు మీద పడేసిందని విమర్శించారు. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల కోసం మంత్రులు ఢిల్లీకి వెళ్తే... ఢిల్లీ పెద్దలు అవమానించారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని అన్నారు.
------
ఇందిరా శోభన్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక సామాన్యుల పార్టీ అని.. అందుకే తాను ఆ పార్టీలో చేరానన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయ ముఖచిత్రం మారిపోయిందన్నారు. ఒక సాధారణ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చానని... బీజేపీ, టీఆర్ఎస్ ఒకే గొడుగు కింద పని చేస్తున్నాయన్నారు. కేంద్రంలో బడా మోదీ, రాష్ట్రంలో చోట మోదీ కేసీఆర్ అంటూ ఇందిరా శోభన్ సెటైర్ వేశారు
---------
కరోనాకు మందు తయారు చేసిసంచలనం రేకెత్తించిన ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య ఒమిక్రాన్ కు కూడా మందును తయారు చేశారు. ఒమిక్రాన్ సోకకుండా ముందు జాగ్రత్తగా బూస్టర్ డోస్ మాదిరి ఈ మందును వేసుకోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సుమారు 22 రకాల దినుసులతో ఐదు రకాల మందులు తయారు చేసినట్టు చెప్పారు. ఈ మందును ఒకే రోజు రెండు పూటలా తీసుకుంటే సరిపోతుందని తెలిపారు. 
----
ఇటీవల రద్దు చేసిన సాగు చట్టాలను మళ్లీ తెస్తామంటూ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ సంచలన ప్రకటన చేశారు. మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో తోమర్ మాట్లాడుతూ.. రైతుల మేలు కోసం ఒక్క అడుగు వెనక్కి వేశామని, భవిష్యత్తులో మళ్లీ ముందుకు వెళ్తామని తెలిపారు. వ్యవసాయ చట్టాలను స్వల్ప మార్పులతో మళ్లీ తెస్తామని ప్రకటించారు. 
------
పంజాబ్‌లోని లుథియానా కోర్టు కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన బాంబు పేలుడు ఘటనలో ఖలిస్థాన్, గ్యాంగ్‌స్టర్లు, మాదక ద్రవ్యాల స్మగ్లర్లకు సంబంధాలు ఉన్నట్టు పంజాబ్ డీజీపీ సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ తెలిపారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయనీ విషయాన్ని వెల్లడించారు. మనం ఉగ్రవాదం, డ్రగ్స్ నుంచి సవాళ్లు ఎదుర్కొంటున్నామని, మాదక ద్రవ్యాల వ్యవస్థీకృత నేరాలు, టెర్రరిజం ప్రమాదకరమైన కాక్‌టెయిల్ వంటివని, లుథియానా కేసు కూడా అలాంటిదేనని పేర్కొన్నారు.