మాజీ  ఐ అండ్ పి ఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డికి ఎసిబి నోటీసులు 

ఎపి  ఐ అండ్ పీఆర్ మాజీ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. వైకాపా  హయాంలో ఆయన జగన్ మీడియా, వైసీపీ అనుకూల మీడియా సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు దోచి పెట్టారు. వందల కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చి ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టారన్న  ఆరోపణలు ఉన్నాయి.2019 నుంచి 24 మధ్య సాక్షి పత్రికకు 371 కోట్ల రూపాయలను ప్రకటనల రూపంలో విజయ్ కుమార్ రెడ్డి దోచి పెట్టారు. ఐఅండ్ పిఆర్ లో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నిబంధనలకు విరుద్దంగా నియమించారు.  సాక్షి మీడియాలో పని చేస్తున్న సిబ్బందికే ప్రాధాన్యత ఇచ్చారు. మిగతా పత్రికలు, చానళ్లకు ప్రకటనలు ఇవ్వకుండా పక్ష పాత వైఖరి అవలంబించారని ఎసిబి ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఆయా సంస్థలకు   బిల్లుల చెల్లింపుల్లో కూడా  వివక్షత కనబరచారని విచారణలో తేలింది. 
2019లో ఆయన నియామకమైనప్పుడు కేవలం రెండేళ్లవరకే ఈ పదవిలో ఉండాలి.   ఈ నిబంధనను జగన్ సర్కార్ పక్కకు  పెట్టింది.  వైకాపా అధికారం కోల్పోయే వరకు ఐ అండ్ పిఆర్ కమిషనర్ గా ఆయన  కంటిన్యూ అయ్యారు. తనకు ఐఅండ్ పి ఆర్ కమిషనర్ పదవి రాగానే విజయ్ కుమార్ రెడ్డి జగన్ ఇంటికి వెళ్లి  సత్కరించి తన విధేయతను చాటుకున్నారు.  సాధారణంగా మీడియా సంస్థలకు ప్రకటనలు ఇవ్వాలంటే తక్కువ కొటేషన్, ఎక్కువ సర్క్యులేషన్ ప్రాతి పదికన ఇస్తారు. కానీ విజయ్ కుమార్ రెడ్డి అవేమీ పట్టించుకోలేదు . సాక్షి ఇచ్చిన టారిఫ్ ను ఎక్స్ అఫిషియో హాదాలో పెంచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఆయనపై  ఎసిబి కేసు నమోదుచేసి విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా వచ్చే వారం గుంటూరులోని ఏసీబీ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. నోటీసులను ఈ-మెయిల్ ద్వారా ఎసిబి పంపింది. దీనితో  పాటు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి కూడా ఏసీబీ అధికారులు వెళ్లారు. నోటీసులను ఇంటికి అతికించారు.   ప్రస్తుతం ఆయన కోల్‌కతాలో పని చేస్తున్నారు. విచారణకు హాజరవుతారా డుమ్మా కొడతారా తేలాల్సి ఉంది.