లక్కు అంటే కేసీఆర్ సార్‌దే!



నిజంగా లక్కు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారిదే. చకచకా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చేసేశారు... అలా సోనియా గాంధీ చెవిలో క్యాలీఫ్లవర్ పెట్టేసి ఇలా తెలంగాణ సాధించేశారు. ఎలక్షన్లలో మాంఛి మెజారిటీ సాధించి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. ఎన్నికల ముందు తాను ఇచ్చిన వాగ్దానాలకు భంగం కలిగినా వాటి గురించి ప్రశ్నించిన వాళ్ళను విజయవంతంగా నోళ్ళు మూయించగలుగుతున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీడియాతో సహా ఎవరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేదు. ఇలాంటి గొప్ప అవకాశం గతంలో ఏ ముఖ్యమంత్రికైనా వచ్చిందా... కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి మాత్రమే దక్కింది. అందుకే లక్కు అంటే కేసీఆర్‌దేనని చెప్పుకోవాల్సి వచ్చింది. తాజాగా అనేక విషయాలలో ఆయనకు లక్కు లక్కలా అతుక్కుపోయింది. అలాంటి  రెండు విషయాలను ఇప్పుడు ప్రస్తావించుకుందాం.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కేసీఆర్ మదిలోకి ప్రవేశించిన రెండు విషయాలు... అసాధ్యమైనా అమలు చేయాలని అనిపించిన అనేక విషయాల్లో రెండు ముఖ్యమైన విషయాలు... ఒకటి హుస్సేన్ సాగర్ని ఖాళీ చేసి మంచినీటి సరస్సుగా మార్చడం. రెండోది సచివాలయాన్ని ఉన్నచోట నుంచి తరలించి ఎర్రగడ్డకి తరలించడం. ఈ రెండు విషయాలనూ ప్రతిపక్షాలు, ప్రజలు, ప్రజా సంఘాలు ఎంత వ్యతిరేకించినా కేసీఆర్ ఎంతమాత్రం వెనకడుగు వేయలేదు. ఒక దశలో ఈ రెండు పనులనూ చేసి తీరతానని ఆయన మొండి పట్టుదలతో వ్యవహరించారు. ఆ పట్టుదల ఎంతవరకూ వెళ్ళిందంటే, ఈ రెండు అంశాలూ అసాధ్యాలని ఆయనకే అర్థమైపోయినా వెనకడుగు వేయలేనంత పట్టుదలను ప్రదర్శించారు.

అయితే, ఈ రెండు విషయాల్లో ఆయన వెనకడుగు వేసినట్టు కాకుండా, చట్టం ఒప్పుకోలేదు అందుకే ఈ రెండు పనులనూ చేయలేకపోయానని ఆయన చెప్పుకోవడానికి వీలుగా ఆయనకు గోల్డెన్ ఛాన్స్‌లు వచ్చాయి. ఎర్రగడ్డలో సచివాలయాన్ని నిర్మించడానికి పౌర విమాన యాన శాఖ అభ్యంతరం తెలిపినట్టు సమాచారం. అందువల్ల సికింద్రాబాద్‌లో మిలటరీ ఆధ్వర్యంలో వున్న జింఖానా, పరేడ్ మైదానాల్లోకి సచివాలయాన్ని తరలించాలని ఆయన భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కేసీఆర్ ఆలోచనలకు మిలటరీవాళ్ళు ఎలాగూ ఒప్పుకోరు. కాబట్టి సచివాలయాన్ని తాను అనుకున్నట్టుగా తరలించలేకపోయానని కేసీఆర్ చెప్పుకోవచ్చు. అలాగే హుస్సేన్ సాగర్ ఖాళీ చేసే పనులు మొన్నీమధ్యే ప్రారంభమయ్యాయి. ఈ ఎండాకాలం లోపు హుస్సేన్ సాగర్ ఖాళీ చేయడం అనేది దేవుడు దిగి వచ్చినా అయ్యే పని కాదు. కేసీఆర్ హుస్సేన్ సాగర్ని ఖాళీ చేయించలేకపోయాడనే విమర్శలు రాకుండా ఆయన్ని చట్టం కాపాడుతోంది. చెన్నైలోని సదరన్ గ్రీన్ ట్రిబ్యూనల్ హుస్సేన్ సాగర్ని ఖాళీ చేయడం తక్షణం ఆపేయాలని ఆదేశించింది. ఇప్పుడు ఈ విషయంలో కూడా గ్రీన్ ట్రిబ్యునల్ తమకు అడ్డు పడిందని కేసీఆర్ తప్పించుకోవచ్చు. లక్కు అంటే ఇలా వుండాలి.