ఈ ప్రత్యేక మరణాలు ఆగేదెప్పుడు?
posted on Aug 28, 2015 2:42PM
ప్రత్యేక హోదా వలన రాష్ట్రానికి ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. కానీ అది రానంత కాలం ప్రతిపక్షాలకు రాజకీయ లబ్ది చేకూర్చే అంశంగా, అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు అది వాటి చేతిలో ఒక బలమయిన ఆయుధంగా ఉపయోగపడుతోంది. కానీ మాంసం తింటారని ఎవరూ ఎముకలు మెళ్ళో వేసుకొని తిరుగనట్లే, ఈ బహిరంగ రహస్యాన్ని రాజకీయ పార్టీలు బయటకి చెప్పుకోవు. ప్రజలే అర్ధం చేసుకోవాలి. ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ కొన్ని వారాల క్రితం తిరుపతిలో జరిపిన బహిరంగ సభలో మునికోటి ఆత్మహత్య చేసుకొన్నప్పుడు, అతని అంత్యక్రియలకు హాజరయిన రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితర కాంగ్రెస్ నేతలు స్వయంగా అతని పాడె మోశారు. ఎందుకు మోసారో వారికీ తెలుసు, ప్రజలకీ తెలుసు.
ప్రత్యేక హోదా కోసం నెల్లూరు జిల్లా వేదాయపాలెంకుచెందిన రామిశెట్టి లక్ష్మయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకొన్నాడు. అతని కుటుంబాన్ని పరామర్శించేందుకు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు నెల్లూరు వెళ్ళారు. మృతిని కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ, “ప్రత్యేక హోదా కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. అందరూ కలిసి పోరాడి సాధించుకొందాము. కలిసి పోరాడితే చంద్రబాబు నాయుడే కాదు ఆయన నాయిన (తండ్రి) అయినా దిగిరావలసిందే.” అని అన్నారు. అంటే మనుషులు ప్రాణాలు పోతున్నా తన ఉద్యమం కొనసాగిస్తానని చెప్పుతున్నట్లే ఉంది.
రామిశెట్టి లక్ష్మయ్య మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ “ప్రత్యేక హోదా గురించి ప్రతిపక్షాలు చెపుతున్న మాటలతో భావోద్వేగానికిలోనయి కొందరు ఆత్మహత్యలు చేసుకొన్నారు. అలా చేస్తే వారి కుటుంబాలు రోడ్డున పడతాయనే సంగతి గుర్తుంచుకోవాలి. రాష్ట్రాభివృద్ధి చేసే బాధ్యత నాపై ఉంచినప్పుడు ప్రతిపక్షాల మాటలు విని ప్రజలు ఆందోళన చెంధవలసిన అవసరం లేదు. దయచేసి ఎవరూ ఆత్మహత్యల ఆలోచన కూడా చేయవద్దు,” అని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేసారు.
కానీ రాజకీయ పార్టీలు రాజేసిన ఈ అగ్గికి ఇంకా ఎవరో ఒకరు సమిధలుగా మారుతూనే ఉన్నారు. ఈరోజు కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన ఉదయ్ భాను(40) అనే వ్యక్తి ప్రత్యేక హోదా రానందుకు ఆత్మహత్య చేసుకొన్నాడు. అతని తల్లి తులసీ రాణి గుడివాడ పట్టాన తెదేపా మహిళాధ్యక్షురాలిగా ఉన్నారు. జిల్లా తెదేపా నేతలు అతని కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం రాజకీయ పార్టీలు పోరాడితే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ దాని కోసం అన్యాయంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిసిన తరువాత కూడా వారి మరణాలను ఎత్తి చూపిస్తూ తమ ఉద్యమాన్ని కొనసాగించడం మానవత్వం అనిపించుకోదు. మనుషుల ప్రాణాలకంటే ప్రత్యేక హోదా ఏమీ ముఖ్యమయినది కాదు. కనుక అన్ని పార్టీలు ఇకపై ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని పిలుపునివ్వాలి. వీలయితే సినిమా హీరోలు, క్రీడాకారులు తదితర సెలబ్రేటీలు కూడా ప్రజలకు సందేశం ఇస్తే బాగుంటుంది. ముఖ్యంగా రాజకీయాలలో ఉన్న సినీ తారలు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రోజా, జూ.ఎన్టీఆర్ వంటివారు సోషల్ నెట్ వర్క్ మరియు టీవీ మాధ్యమం ద్వారా ప్రజలకు సందేశం ఇస్తే దాని వలన కొంత ప్రయోజనం ఉంటుంది.