దేనికయినా రాసిపెట్టి ఉండాలి: డి.శ్రీనివాస్

 

కాంగ్రెస్ మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తనకు రెండవసారి ఎమ్మెల్సీ పదవి ఇవ్వనందుకు కాంగ్రెస్ పార్టీతో సుమారు నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని పుటుక్కున త్రెంచుకొని తెరాసలో చేరిపోయారు. ఆయనను ఎవరూ సంజాయిషీలు అడగనప్పటికీ గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నట్లుగా తను పదవులు, అధికారం కోసం తెరాసలో చేరడం లేదని చెప్పుకొని తన అంతర్యం ఆయనే బయట పెట్టుకొన్నారు. ఊహించినట్లే ఆయన తెరాసలో చేరిన నెల రోజుల్లోగానే క్యాబినెట్ హోదా గల ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాజకీయ అనుభవాన్ని గుర్తించి తనకు ఆ పదవి ఇచ్చి గౌరవించారని ఆయన చెప్పుకొన్నారు. ఆయన బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా పదవులు రావాలంటే రాసిపెట్టి ఉండాలని అన్నారు. ధర్మాధర్మాలు, న్యాయన్యాయాలు అన్నీ పైనున్న భగవంతుడే చూసుకొంటాడని అన్నారు. తన టాలెంట్ చూసే కేసీఆర్ ఈ పదవి ఇచ్చారని, దానిని బంగారి తెలంగాణా కోసం ఉపయోగిస్తానని అన్నారు. తెరాసలో కొత్త బ్యాచి, పాత బ్యాచి అని రెండు గ్రూపులు ఏవీ లేవని, అందరూ కలిసి పనిచేస్తున్నామన్నారు. తెలంగాణా కోసం తను జలగం వెంగళరావు కాలం నుండి వైయస్ కాలం వరకు పోరాటాలు చేసానని అన్నారు.

 

తన ట్యాలంట్ చూసే తనకు ఈ పదవి ఇచ్చారని డి.శ్రీనివాస్ చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఆయనలో నిజంగా అంత ట్యాలెంట్ ఉండి ఉంటే పూర్తి స్వేచ్చా స్వాతంత్ర్యాలున్న పార్టీగా పేరుమోసిన కాంగ్రెస్ పార్టీలోనే రాణించగలిగేవారు. కానీ ఆయనకి ఎన్నిసార్లు పార్టీ టికెట్ ఇచ్చినా గెలవలేకపోయారు. చివరికి ఎమ్మెల్యేల కోటాలో రెండవసారి ఎమ్మెల్సీ అవ్వాలనుకొని భంగపడటంతో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలని ప్రయత్నిస్తున్న కేసీఆర్ అదే అదునుగా ఆయనకు ఈ ఆఫర్ ఇచ్చి తనవైపు త్రిప్పుకొన్నారు.

 

డీ.యస్. తను కూడా చిరకాలంగా తెలంగాణా కోసం పోరాడానని చెప్పుకొన్నారు. కానీ తెరాస ప్రభుత్వంలో కాబినెట్ హోదా పదవి పొందేందుకు అది అర్హత కాబోదు. అటువంటి అర్హత ఉన్నవాళ్ళు తెరాసలో కొన్ని వేల మంది ఉన్నారు. అయినా వైయస్ హయం వరకే తాను తెలంగాణా కోసం పోరాడానని చెప్పుకోవడం చూస్తే ఆ తరువాత నుండి తెలంగాణా కోసం ఆలోచన కూడా చేయలేదని ఆయనే ఒప్పుకొన్నట్లుంది.

 

అలాగే తన ట్యాలెంట్ చూసి కేసీఆర్ ఆయనకి ఆ పదవి ఇచ్చారనుకోవడానికి లేదు. ఒకవేళ ట్యాలెంట్ ఉన్నవాళ్లకే ఆ పదవిని ఇవ్వాలనుకొంటే తెరాసలోనే అంతకంటే గొప్ప ట్యాలెంటు ఉన్నవాళ్ళు అనేకమంది ఉన్నారు. వారందరినీ కాదని ఆయనకు ఆ పదవి ఎందుకు ఇచ్చారంటే కాంగ్రెస్ పార్టీని త్యజించి తెరాసలో చేరినందుకేనని భావించాల్సి ఉంటుంది. పదవులు రావాలంటే రాసిపెట్టి ఉండాలని చెప్పిన మాట అక్షరాల తెరాస నేతలకు సరిపోతుంది. ఆయనకి కాదు. పదేళ్ళపాటు కేసీఆర్ తో కలిసి తెలంగాణా కోసం పోరాడిన వాళ్ళలో చాలా మందికి పదవులే దక్కలేదు. ఎందుకంటే వారికి రాసి పెట్టిలేదనుకోవాలి. కానీ నిన్నగాక మొన్న తెరాసలో చేరిన డి.శ్రీనివాస్ కి నెల తిరక్క ముందే క్యాబినెట్ హోదా గల పదవి దక్కింది.

 

అయితే ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చేరు కదా అని ఆయన తన ట్యాలెంట్ అంతా ముఖ్యమంత్రి కేసీఆర్ కి చూపిద్దామని ప్రయత్నిస్తే మళ్ళీ భంగపాటు తప్పకపోవచ్చును. నిజానికి కేసీఆర్ కి ఎవరి సలహాలు అవసరం లేదు. ఆయన తీసుకొనే నిర్ణయాలని చూస్తే ఆ సంగతి అర్ధం అవుతుంది. ఆయనకు మాట ఇచ్చినందున ఏదో రాజకీయ ఉపాది కల్పించాలి గాబట్టి ఆ పదవి ఇచ్చారనుకోవలసి ఉంటుంది. కనుక డి.శ్రీనివాస్ తనకు దక్కిన ఆ హోదాని హాయిగా అనుభవిస్తూ కాలక్షేపం చేసుకోవడమే అన్ని విధాల మంచిది.