తెరాసను ప్రత్యర్ధ పార్టీగానే భావిస్తాము: బీజేపీ

 

ప్రధాని మోడీ ఆహ్వానిస్తే కేంద్రమంత్రిగా చేరేందుకు సిద్దమని తెరాస యంపీ కవిత ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇంతకు ముందు ప్రతిపక్షాలు విమర్శించినప్పుడు అటువంటి ఆలోచనలేవీ లేవని ఆమె వాదించినప్పటికీ మెల్లగా తన మనసులో మాట బయటపెట్టారు. ఆమె తన మనసులో మాట బయటపెట్టిన తరువాత బీజేపీ సానుకూలంగా స్పందించి ఉండి ఉంటే ప్రతిపక్షాలు ఎన్ని ఏడ్పులు ఏడ్చినా బాధ ఉండేది కాదు. కానీ బీజేపీ నేత మురళీధరరావు ఆమెను కేంద్రమంత్రిగా చేర్చుకొనే ఉద్దేశ్యమేమీ తమకు లేదని చెప్పడంతో ఆమె అనవసరంగా తన మనసులో మాటను బయటపెట్టుకొని ప్రతిపక్షాలు వాదనకు బలం చేకూర్చినట్లయింది. తెలంగాణాలో తమ పార్టీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలనుకొంటునప్పుడు, తెరాసను ప్రత్యర్ధ పార్టీగానే పరిగణిస్తామని ఆయన చెప్పినట్లు సమాచారం.

 

రాష్ట్ర విభజన చేసి తెలంగాణా ఇచ్చినట్లయితే తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్, ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ ఎంత కాళ్ళావేళ్ళా పడినా ఆయన ఆ పార్టీతో కనీసం పొత్తులు పెట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు, కానీ తెదేపాతో పొత్తులు పెట్టుకొన్న బీజేపీతో పొత్తులకి ప్రయత్నించి భంగపడ్డారు. బహుశః ఆ అక్రోశంతోనే కొంతకాలం ఎన్డీయే ప్రభుత్వంపై కత్తులు దూసి ఉండవచ్చును. కానీ కేంద్రంతో కత్తులు దూయడం వలన రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం ఉండదనే జ్ఞానోదయం కలిగినందునో లేక ప్రతిపక్షాల విమర్శల వల్లనో మళ్ళీ కేంద్రానికి చేరువయ్యారు. మోడీ ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా స్పందించడంతో బహుశః ఆయన తెరాస ఎన్డీయే కూటమిలో చేరే అవకాశం, తద్వారా తన కుమార్తె కవితకు కేంద్రమంత్రి పదవి వస్తుందని ఆశించారేమో? కానీ తెరాసను ఎన్డీయే కూటమిలో చేర్చుకొనే ఆలోచన ఉన్నట్లు బీజేపీ అధిష్టానం ఏనాడు సూచనప్రాయంగా కూడా చెప్పలేదు. మరి అటువంటప్పుడు తెరాసకు ఇటువంటి ఆలోచన ఎందుకు కలిగిందో తెలియదు.

 

అయితే రాజకీయాలలో శాశ్విత మిత్రులు కానీ శాశ్విత శత్రువులు గానీ ఉండరు కనుక తెరాస తొందరపడి బీజేపీ, ఎన్డీయే ప్రభుత్వాల మీద యుద్ధం ప్రకటించకుండా ఉంటేనే మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.