తెలంగాణలో ముందస్తు ఎన్నికలు? బీజేపీ నేతలకు సిగ్నల్స్..

2018లో తెలంగాణ ముందస్తు ఎన్నికలు వచ్చాయి. మొదటి టర్మ్ లో అసెంబ్లీలో ముందుగానే రద్దు చేశారు కేసీఆర్. 2019 జూన్ వరకు గడువున్నా .. దాదాపు 10 నెలల ముందుగానే 2018 ఆగస్టులో అసెంబ్లీని డిసాల్వ్ చేశారు. దీంతో తెలంగాణలో ఆరు నెలల ముందుగా అంటే 2018 డిసెంబర్ తొలి వారంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇక రెండో టర్మ్ లోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారం కొన్ని రోజులుగా సాగుతోంది. ఇటీవల కాలంలో కేసీఆర్ దూకుడు పెంచడం, వరుస సమావేశాలు నిర్వహించడం, జిల్లాల పర్యటనలకు సిద్ధమవడంతో .. ముందస్తు ఎన్నికల ప్రచారానికి బలం చేకూరింది. తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలోనూ సిట్టింగులపై టికెట్లు ఇస్తానని చెప్పారు కేసీఆర్. త్వరలో ఎన్నికలు రాబోతున్నందు వల్లే గులాబీ బాస్ ఆ ప్రకటన చేశారనే చర్చ సాగుతోంది.

కేసీఆర్ తీరు ముందస్తు ఎన్నికలకు అవకాశం ఉందన్న సంకేతాలు ఇస్తుండగా.. తాజాగా కేంద్రం పెద్దల నుంచి అలాంచి సిగ్నలే వచ్చింది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది.  తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమైన అమిత్ షా.. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని వ్యాఖ్యానించారని సమాచారం. కేసీఆర్ ముందస్తు ఎన్నికలు వెళ్లొచ్చని  అమిత్ షా చెప్పినట్లు తెలుస్తోంది. తనకున్న ఇన్‌పుట్స్ ఆధారంగానే అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని తెలంగాణ బీజేపీ నేతలు భావిస్తున్నారు. 

త్వరలోనే  తాను తెలంగాణకు వస్తానని, రెండు రోజుల పర్యటిస్తానని కూడా రాష్ట్ర బీజేపీ నేతలకు చెప్పారు అమిత్ షా. కేసీఆర్ సర్కార్ పై గట్టిగా పోరాడాలని కూడా పార్టీ నేతలకు దిశానిర్దేశనం చేశారు. కేసీఆర్ అసత్యప్రచారాలను తిప్పికొట్టాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకు టీఆర్‌ఎస్ చేస్తున్న ప్రయత్నాలపై అమిత్ షా సీరియస్‌ అయ్యారనే తెలుస్తోంది. రాష్ట్ర మంత్రుల చావు డప్పు కొట్టడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించినట్టుగా సమాచారం. మొత్తంగా రాష్ట్ర బీజేపీ నేతలతో అమిత్ షా చేసిన కామెంట్ల ప్రకారం తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై కేంద్రానికి స్పష్టమైన సమాచారం ఉందని తెలుస్తోంది. అందుకే కమలం నేతలు కూడా దూకుడు పెంచారని అంటున్నారు.