ఈ పాపం ఎవరిది? అసెంబ్లీ సాక్షిగా అన్నదాత ప్రశ్న
posted on Sep 29, 2015 6:33PM

అన్నదాతల ఆత్మహత్యలకు మీరంటే మీరే కారణమంటూ తెలంగాణ అసెంబ్లీలో అధికార, విపక్షాలు తిట్టుకుంటుంటే, అదే అసెంబ్లీ సాక్షిగా ఓ రైతు...అన్నదాతల దుస్థితిని కళ్లకు కట్టేలా చేశాడు, రైతుల ఆత్మహత్యలపై ఒకపక్క తెలంగాణ అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరుగుతూ ఉంటే, ఓ రైతు ఏకంగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న సెల్ టవర్ పైకెక్కి ఆత్మహత్యా ప్రయత్నంచేసి కలకలం సష్టించాడు. తీవ్ర సంచలనం కలిగించిన ఈ ఘటన... పోలీసులను ఉక్కిరిబిక్కిరి చేయగా, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరింత కష్టాల్లోకి నెట్టేసింది
రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే సెకండ్ ప్లేస్ లో ఉందంటే సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సుమారు 1500మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, అధికారికంగా 700 నమోదయ్యాయి, ముగ్గురు రైతులు ఏకంగా రాజధాని హైదరాబాద్ లోనే సూసైడ్ చేసుకోవడం సంచలనం కలిగించగా, ప్రతిరోజూ ముగ్గురు నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. అయితే తెలంగాణ వచ్చాక జరిగిన రైతు ఆత్మహత్యల్లో 312 మాత్రమే రియల్ సూసైడ్స్ అని ప్రభుత్వం లెక్క తేల్చడం మరో వివాదానికి కారణమైంది.
రైతు ఆత్మహత్యలపై ఒకవైపు రాజకీయ దుమారం రేగుతుంటే, తాజాగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ ను ఇరకాటంలో పెట్టాయి, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకోకుండా కారణాలు ఆన్వేషించి నివారణకు చర్యలు చేపట్టాలని సూచించింది. చనిపోయాక పరిహారం ఇస్తే ఏం లాభం, బతికున్నప్పుడే రైతును కాపాడుకోవాలంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. అంతేకాదు రైతుల ఆత్మహత్యల నివారణకు ఏం చర్యలు తీసుకున్నారో నివేదికలు ఇవ్వాలంటూ కేసీఆర్ సర్కార్ ను ఆదేశించింది.
మరి ఇప్పటికైనా అన్నదాతల ఆవేదనను ప్రభుత్వం అర్థంచేసుకుంటుందా? లేక ఆ పాపం తమది కాదు, గత ప్రభుత్వాలది అంటూ తప్పించుకుంటుందా?