కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ సోదరులకు దక్కని ఊరట
posted on Dec 18, 2025 2:13PM

ఏపీ నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్ సోదరులకు విజయవాడ ఎక్సైజ్ కోర్టులో ఊరట దక్కలేదు. ఏ2 జగన్‌మోహన్‌రావు, ఏ18 జోగి రమేశ్, ఏ19 జోగి రాము బెయిల్ పిటిషన్లను విజయవాడలోని ఎక్సైజ్ కోర్టు తిరస్కరించింది. కొంతమంది నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. నేటితో రిమాండ్ ముగియనుండటంతో జోగి రమేశ్, జోగి రాము సహా 13 మంది నిందితులను అధికారులు న్యాయస్థానంలో హాజరు పర్చారు.
ఈనెల 31 వరకు నిందితులకు న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. నకిలీ మద్యం కేసులో తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జ్ జయచంద్రారెడ్డి, ఆయన పీఏ, అలాగే అదే నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకుడు సురేంద్రనాయుడి ప్రమేయాన్ని ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. దీంతో తంబళ్లపల్లె ఇన్‌చార్జ్‌గా జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడిని టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన జగన్మోహన్‌రావుతో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు.