రైలుపై జారిపడిన క్రేన్.. 22 మంది మృతి
posted on Jan 14, 2026 11:11AM

థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బ్యాంకాక్‌కు 230 కి.మీ దూరంలో ఉన్న సిఖియో జిల్లాలో కదలుతున్న రైలు మీద క్రేన్ పడింది. దీంతో రైలు పట్టాలు తప్పి బోగీల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందగా 79 మందికి పైగా గాయపడ్డారు. ఘటన జరిగిన సమయంలో రైలులో 195 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ కోసం నిర్మాణ పనులు జరుగుతుండగా ప్రమాదం జరిగినట్లు స్ధానిక అధికారులు తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే రైలులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను వెలికితీసేందుకు స్థానిక పోలీసులు, రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మృతుల సంఖ్యను నఖోన్ రాట్చసిమా పోలీస్ చీఫ్ ధృవీకరించారు. ఈ ఘోర ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని థాయ్‌లాండ్ రవాణా మంత్రి ఆదేశాలు జారీ చేశారు.