మహిళలను కించపరచడం అమానుషం : సీపీ సజ్జనార్
posted on Jan 14, 2026 4:03PM

ప్రజా జీవితంలో మహిళలను కించపరచడం అమానుషమని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. మహిళలపై వ్యక్తిగత దాడులు, చరిత్ర హననం, అసభ్య వ్యాఖ్యలు సమాజ పురోగతికి గొడ్డలిపెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగి అయినా, ప్రైవేట్ ఉద్యోగి అయినా, గృహిణి అయినా మహిళ గౌరవం అపరిమితం అని ఎక్స్ వేదికగా సీపీ పేర్కొన్నారు.
టీవీ చర్చలు, సోషల్ మీడియా పోస్టులు, వార్త కథనాల పేరుతో మహిళలపై దూషణలు ఖండించాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగతంగా దెబ్బతీయడం, ప్రతిష్ఠను నాశనం చేయడం ఏమాత్రం ఆమోద యోగ్యం కాదని తెలిపారు. మహిళలను గౌరవించని సమాజం భవిష్యత్తును కోల్పోతుందని పేర్కొన్నారు. మహిళలపై అవమానం, వివక్ష, చరిత్ర హననం ఇక సహించమని సజ్జనార్ హెచ్చరించారు.
మన పురాతన ధర్మం "యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః" (ఎక్కడ మహిళలు పూజించబడతారో, అక్కడ దేవతలు కొలువై ఉంటారు) అని చెబుతోంది. కానీ నేటి కాలంలో మహిళా అధికారులపై ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న వ్యక్తిత్వ హననం మన నాగరికతనే ప్రశ్నిస్తోందన్నారు. ది ఫ్యూచర్ ఈజ్ ఫీమేల్ అని భవిష్యత్ అంతా మహిళలదే అని సీపీ సజ్జనార్ తెలిపారు. ఐఏఎస్ అధికారిణిపై అవాస్తవాలను ప్రచారం చేసిన కేసులో తెలంగాణలో వరుస అరెస్టులు జరగడం సంచలనంగా మారింది.