కమ్మేసిన పొగమంచు.. ఢిల్లీలో విమాన రాకపోకలకు అంతరాయం
posted on Dec 18, 2025 2:26PM

దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు ఉదయం పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 40 విమానాల రాకపోకలు జాప్యమయ్యాయి. పది విమాన సర్వీసులు రద్దయ్యాయి.
అలాగే రైళ్ల రాకపోకలలో కూడా తీవ్ర జాప్యం జరిగింది. ఢిల్లీకి రావలసిన, ఢిల్లీ నుంచి బయలు దేరాల్సిన 22 రైళ్ల రాకపోకల్లో గంటల తరబడి జాప్యం జరిగింది. అదే విధంగా దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ పడిపోవడంతో దేశ రాజధాని నగరంలో ట్రాఫిక్ కు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగమంచుతో పాటు, ఢిల్లీలో వాయు కాలుష్యం కూడా తీవ్రస్థాయికి చేరుకుంది. వాయు నాణ్యత సూచిక 400 కంటే ఎక్కువగా నమోదైంది. మరి కొన్ని రోజుల పాటు పొగమంచు బెడద కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.