ఈటల వర్సెస్ మర్రి.. తెలంగాణలోనూ క్రెడిట్ వార్
posted on Jan 14, 2026 8:43AM

ఆంధ్రప్రదేశ్ లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్యం విషయంలో తెలుగుదేశం, వైసీపీల మధ్య ఒక పక్క క్రెడిట్ వార్ కొనసాగుతుండగానే.. తెలంగాణలో కూడా మరో క్రెడిట్ వార్ మొదలైంది. పొలిటికల్ గా క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకోవడానికి నేతల ఆరాటమే ఇందుకు కారణం. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అయితే అడ్డగోలుగా తాను అవసరం లేదంటూ వాదించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో ఆ ఎయిర్ పోర్టు ఘనతను తన ఖాతాలో వేసుకోవడానికి పడుతున్న తాపతయం నవ్వుల పాలౌతోంది. అది పక్కన పెడితే.. తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి.
ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది. సదరు బ్రిడ్జి శంకుస్థాపన కార్యక్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య వాగ్వాదం తీవ్ర రూపం దాల్చి బాహాబాహీదాకా వెళ్లింది. ఇదే విషయంలో ఈటల, మర్రి రాజశేఖరరెడ్డిల మధ్య వాగ్వాదం కూడా ముదిరింది. పోలీసులు సకాలంలో జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందనుకోండి అది వేరే సంగతి.
విషయమేంటంటే మేడ్చల్ జిల్లా మచ్చబొల్లారంలో రైల్వే అండర్ బ్రిడ్జి పనుల కు శంకుస్థాపన కార్యక్రమంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తన ఘనత అంటే తన ఘనత అంటూ ఈటల, మర్రి వాదనకు దిగారు. దీంతో శంకుస్థాపన సందర్భంగా బీజీపీ, బీఆర్ఎస్ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగినా.. మాటల యుద్ధం మాత్రం ఇంకా కొనసాగుతోంది. చూడాలి మరి ఈ క్రెడిట్ వార్ లో విజయం ఎవరిదో?