ప్రేమించలేదని నిఖిత గొంతు కోసిన ప్రేమోన్మాది
posted on Dec 13, 2012 10:04AM

ఇబ్రహీంపట్నంలో ఓ యువకుడు తనను ప్రేమించడం లేదని ఓ విద్యార్ధిని గొంతు కోసి చంపేశాడు. ఇబ్రహీంపట్నం కు చెందిన బాలరాజ్, భాగ్యలతల మొదటి కుమార్తె నిఖిత బికాం చదువుతూ, సిఏ కోచింగ్ తీసుకొంటోంది. బుధవారం సాయంత్రం రాఘవేందర్ ఆమె ఇంట్లోకి వచ్చి గొంతు కోసి చంపాడు.
రాఘవేందర్ రెడ్డిది కందుకూరు మండలం దాసరపల్లి. నిఖిత కుటుంబ సభ్యులు సైదాబాదు ప్రాంతంలో ఉన్నప్పుడు వీరి ఇంటి పక్కనే రాఘవేందర్ రెడ్డి కుటుంబం ఉండేది. అప్పట్లో అతను ప్రేమ పేరుతో నిఖిలను వేధించాడు. మూడేళ్ల క్రితం నిఖిత కుటుంబ సభ్యులు ఇబ్రహీంపట్నంలో సొంత ఇల్లు కట్టుకొని అక్కడకు మారిపోయాడు. దీంతో రాఘవేందర్ రెడ్డి అక్కడకు కూడా వెళ్లి ఆమెను వెంటాడేవాడు.
బుధవారం సాయంత్రం నిఖిత తన ఇంట్లో చదువుకుంటుండగా తల్లి భాగ్యలత కూరగాయల కోసం బయటకు వెళ్లారు. తండ్రి బాలరాజ్ దుకాణంలో ఉన్నాడు. ఆ సమయంలో రాఘవేందర్ రెడ్డి ఇంట్లోకి చొరబడి బెడ్ రూమ్ లో చదువుకుంటున్న నిఖితను కత్తితో గొంతుకోసి చంపాడు. ఇంటికి వచ్చిన తల్లి తన కూతురు ఎంతకూ తలుపు తీయక పోవడంతో బలవంతంగా తీశారు. నిఖితను తాను హత్య చేయలేదని అరుస్తూ రాఘవేందర్ రెడ్డి ఆమె తల్లిని నెట్టేసి బయటకు వచ్చాడు. తన వద్ద ఉన్న కత్తితో తాను కూడా గొంతు కోసుకున్నాడు. స్థానికులు అతనిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిని ఇబ్రహీంపట్నంలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.