ఎంఎల్ఏ బెయిల్ కు పోలీసుల గండి
posted on Jan 1, 2013 2:40PM

ఓ హత్య కేసులో నిందితునిగా ఉన్న గుంటూరు జిల్లా గురజాల శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు బెయిల్ ప్రయత్నాలకు పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గండి కొట్టారు. కాంగ్రెస్ నాయకుడు ఉన్నం నరేంద్ర హత్య కేసులో యరపతినేని మూడవ నిందితునిగా ఉన్న విషయం తెలిసిందే. దీనితో ఆయన ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నరసరావుపేట 13 వ అదనపు జిల్లా న్యాయమూర్తి రామారావు ఎదుట నిన్న ఈ పిటీషన్ ఫై విచారణ జరిగింది.
ఆ ఎంఎల్ఏ తరపున వాదించిన న్యాయవాది తన వాదనను వినిపిస్తూ, అధికార పార్టీకి చెందిన ఎంఎల్సీ కృష్ణా రెడ్డి తన క్లెయింట్ ఫై కక్ష సాధించడానికే ఈ కేసులో ఇరికించారనీ, అసలు పోలీసుల ఎఫ్ఐఆర్ లో ఎంఎల్ఏ పేరు లేదని అన్నారు. ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న నిందితులకు, తన క్లెయింట్ కు ఎలాంటి సంబంధం లేదని వాదించారు.
అయితే, యరపతినేని చేసిన ఈ బెయిల్ ప్రయత్నాలకు పోలీసులు, ప్రాసిక్యూషన్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గండి కొట్టారు. యరపతినేని నిర్వహించిన ఓ బహిరంగసభలో రాళ్ళు రువ్విన నరేంద్రను ఉద్దేశించి ‘రాళ్ళు రువ్విన వారిని స్మశానానికి పంపే వరకూ నిద్రపోను’ అన్న వీడియో క్లిప్పింగ్ ను స్థానిక సిఐ తన లాప్ టాప్ ద్వారా న్యాయమూర్తికి చూపించారు. అలాగే, ఈ హత్య జరిగిన తర్వాత ఈ కేసులోని నిందితులతో ఎంఎల్ఏ ఫోన్లో మాట్లాడిన విషయాన్ని దానికి రుజువుగా ఆయన కాల్ లిస్టు ను న్యాయమూర్తికి చూపించారు. దీనితో, ఆ ఎంఎల్ఏ కు బెయిల్ నిరాకరిస్తూ, న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.