వారసత్వం..నాలుగు స్తంభాలాట..!

సహజంగా ఇంటిపెద్ద మరణిస్తే..అప్పటి వరకు ఆయన నిర్వర్తించిన బాధ్యతలు, అనుభవించిన ఆస్తులు అన్ని ఆయన వారసులకే చెందుతాయి. కానీ దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత విషయంలో మాత్రం ఇది పెద్ద పజిల్ అయిపోయింది. జయకు వారసులు లేకపోవడంతో ఆమె ఆస్తులను, పార్టీని, ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తారా అనే దానిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఆస్తులను, రాజకీయాలను వేరు వేరు చేసినప్పుడు ఆస్తులకు వారసులుగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో జయ స్నేహితురాలు శశికళ ఒకరు కాగా..ఆమె మేనకోడలు దీప మరోకరు. ఇక రాజకీయం సంగతి చూస్తే..అమ్మకు అత్యంత నమ్మకస్తుడిగా పేరు పొందిన ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, హీరో అజిత్ పేరు కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో నలుగురి గురించి ఒకసారి చూస్తే..

 

 

శశికళ: జయ మరణించిన నాటి నుంచి మీడియాలో మారుమోగిపోతున్న పేరు శశికళదే. ఇప్పటికే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఆమెకు అప్పగించాలని పార్టీ నిర్ణయించింది. అలాగే జయ మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టి తద్వారా జయ తర్వాత తానేనని చిన్నమ్మ చెప్పకనే చెబుతున్నారు. ఈ మేరకు పోయెస్ గార్డెన్స్‌లో పార్టీ ముఖ్యనేతలతో ఆమె సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో కీలకంకానున్న చిన్మమ్మ కరుణా కటాక్షాల కోసం ఇప్పుడు పోయేస్ గార్డెన్స్‌‌కు క్యూకడుతున్నారు.వారిలో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా ఉన్నారు.

 

 

జయమేనకోడలు దీప: జయ మరణం తర్వాత అనూహ్యంగా తెరమీదకు వచ్చిన పేరు దీప. శశికళను జయ వారసురాలిగా అభివర్ణించడం ఏమాత్రం నచ్చని దీప..అమ్మ అంత్యక్రియల రోజే శశికళపై విరుచుకుపడ్డారు. జయలలితకు అసలైన వారసురాలిని నేనేని ఆమె బాహాటంగానే ప్రకటించారు. అయితే అన్నాడీఎంకే నేతలు కానీ..జయ అభిమానుల నుంచి కానీ ఈమెకు మద్ధతు లభించడం లేదు..కానీ జయ రక్తసంబంధీకురాలు కావడం దీపకు మేజర్ అడ్వాంటేజ్.

 

 

పన్నీర్ సెల్వం: ప్రస్తుత రాజకీయాల్లో విశ్వాసానికి..నమ్మకానికి మారుపేరు ఎవరంటే ఖచ్చితంగా చెప్పాల్సిన పేరు పన్నీర్ సెల్వం. సామాన్య కుటుంబంలో జన్మించిన ఈయన చిన్న టీ కొట్టుతో తన జీవిత ప్రయాణాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఎంజీఆర్‌కు వీరాభిమాని, 1972లో డీఎంకేలో తలెత్తిన విభేదాల కారణంగా ఎంజీఆర్‌తో పాటు బయటకు వచ్చేశారు. ఎంజీఆర్ మరణించాకా ఆయన సతీమణి జానకీ రామచంద్రన్ అనుచరుల్లో ఒకరిగా కొన్నాళ్లు ఉన్నారు.. ఆ తర్వాత జయలలిత పంచన చేరారు..2001లో టాన్సీ భూముల కుంభకోణంలో జయను న్యాయస్థానం దోషిగా నిర్థారించినప్పుడు..తన స్థానంలో పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రిగా ఎంపికచేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్పప్పటికీ కీలక డాక్యుమెంట్లపైన సంతకాలు చేయాలంటే అమ్మ ఇంటి నుంచి ఆదేశాలు వచ్చే దాకా నిరీక్షించేవారు. తాజాగా అక్రమాస్తుల కేసులో జయలలిత జైలుకు వెళ్లినప్పుడు పన్నీర్ రెండోసారి సీఎం అయ్యారు. ఇప్పుడు జయ ఆకస్మిక మరణంతో తప్పనిసరి పరిస్థితుల్లో మూడోసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతానికి అంతా బాగానే ఉన్నా ఈయన పూర్తికాలం సీఎంగా ఉండకపోవచ్చు. దానికి శశికళ ఆశీర్వాదాలు తప్పనిసరి.

 

 

అజిత్: నాట్ బట్ నాట్ ద లిస్ట్ హీరో అజిత్..తమిళ రాజకీయాలతో కానీ..జయలలిత సన్నిహిత వర్గంతో కానీ ఏమాత్రం సంబంధాలు లేని బయటివ్యక్తి అజిత్. అనారోగ్యంతో అమ్మ ఆస్పత్రిలో ఉన్నపుడు మొదటిసారిగా అజిత్ పేరు తెరమీదకు వచ్చింది. అజిత్ తన కొడుకు లాంటి వాడని జయ, అమ్మ నిజంగా తన అమ్మే అని అజిత్ ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తపరిచారు. అజిత్ పేరు తెరమీదకు రావడం వెనుక మరో కారణం కూడా ఉంది..తమిళనాట రాజకీయాలను శాసించే సత్తా సినిమాకు ఉంది. ఇప్పటి వరకు చాలా సార్లు ఇది రుజువుచేయబడింది కూడా. అమ్మకు ఉన్న సినీ గ్లామర్ ఆమె రాజకీయంగా ఎదగడానికి చాలా తోడ్పడింది..ఇప్పుడు అజిత్‌కు కూడా అలాగే ఉపయోగపడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం అజిత్ సినిమాల్లో చాలా బిజీగా ఉన్నారు..ఈ నేపథ్యంలో ఆయన సినిమాలను వదిలి రాజకీయాలవైపు మొగ్గుతాడా అనేది తెలియాలి.

 

 

ఈ నాలుగు స్తంభాలాటలో అంతిమంగా ఎవరు మిగులుతారో..భవిష్యత్‌లో తమిళనాడు రాజకీయాలను శాసించగల సత్తా ఉండి...అన్నాడీఎంకే‌ను ఒంటిచేత్తో నడిపించగలగిన నేత ఎవరో ఇంకా తేలాల్సి ఉంది.