2వేల నోట్లు... పా(లి)చిపోతాయట!


నోట్ల రద్దు తరువాత ఎవరి నోట్లో విన్నా నోట్ల మాటే! నవంబర్ 8 నుంచీ నెల గడిచిపోతున్నా పెద్ద నోట్ల ఎఫెక్ట్ ఇంకా తగ్గటం లేదు. అయితే, సామాన్యులు 2వేల నోట్లు దొరక్క బాధపడుతుంటే నల్ల త్రాచులు మాత్రం భారీగా కూడబెట్టిన 2వేల నోట్లని ఎలా దాచిపెట్టాలో అర్థం కాక సతమతం అవుతున్నారు. రాత్రికి రాత్రి ఐటీ అధికారులు కలుగుల్లో దాచుకున్న నల్ల కట్టల్ని అమాంతం బయటకు లాగేస్తున్నారు. అయితే, మోదీని సమర్థించే వర్గం మాత్రం... పిక్చర్ అభీ బాకీ హై మేరే దోస్త్ అంటోంది! ఎందుకో తెలుసా?

 

కొత్త రెండు వేల నోటు రంగు పోతోంది అని ఆ మధ్య కొందరు గగ్గోలు పెట్టారు. ఇంత దారుణంగా కరెన్సీ తయారు చేస్తే ఎలా అంటూ విమర్శించారు. కాని, తాజాగా చక్కర్లు కొడుతోన్న రూమర్ ప్రకారం రంగు పోయేలాగే, కావాలనీ, ఆర్బీఐ 2వేల నోటు తయారు చేసిందట! దాని వల్ల లాభం ఏంటో తెలుసా? నల్లధనం నియంత్రణ! అవును, పింక్ కలర్ తో బ్లాక్ ని కంట్రోల్ చేయటమే లేటెస్ట్ టెక్నిక్ అంటున్నారు!

 

కొత్తగా వచ్చిన 2వేల నోటు ఇంటాగ్లియో ఇంక్ తో ముద్రించారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది నిర్ణీత కాలం తరువాత పాలిపోతుంది! ఆ విధంగా ఇప్పుడు వచ్చిన 2వేల నోటు మూడేళ్ల తరువాత ఎక్కడ వున్నా కలర్ పోతుందట! ఒకవేళ బ్లాక్ మనీగా మార్చి ఎవరన్నా పెద్ద ఎత్తున్న దాచేసినా... మూడేళ్ల తరువాత అదంతా వైట్ మనీ అయిపోతుంది! అదేనండీ, పింక్ రంగు పోయి వైట్ పేపర్ గా మారిపోతుంది! అప్పుడిక కోట్లాది రూపాయలు చిత్తు కాగితల కిందే లెక్కా! ఇదంతా నిజమంటారా అని మాత్రం ప్రశ్నించకండి! ఎందుకంటే ఈ మధ్య కాలంలో బోలెడన్ని గాసిప్స్ వచ్చాయి 2వేల నోటు గురించే! ఓసారి నానో చిప్ అమర్చారు అన్నారు. తరువాత రేడియోధార్మిక పదార్థం వుందీ అన్నారు. ఇప్పుడు ఇంటాగ్లియో ఇంక్ అంటున్నారు. ఇంతకు ముందటి గాసిప్స్ లాగే ఇది కూడా కేవలం పుకారు అయి వుండవచ్చు. లేదా నిజమూ కావొచ్చు. సామాన్యుడికి మూడేళ్ల దాకా 2వేల నోట్లు వాడకుండా కలుగుల్లో దాచాల్సిన అవసరం ఎలాగూ వుండదు. సో... ఇంటాగ్లియో ఇంక్ అయితే గియితే అంటుకునేది... నల్ల దొరల తెల్ల కాలర్లకే!