ఐటి దాడుల వెనుక లింక్... ఇంకేనా?
posted on Dec 13, 2016 3:46PM
.jpg)
2వేల నోటు అంటే ఇప్పుడు అందరికీ మిక్స్ డ్ ఫీలింగ్స్ కలుగుతున్నాయి. అది దొరకాలంటే బ్యాంకుల్లో గంటలు గంటలు క్యూలో నిల్చోవాలి. తీరా చేతికొచ్చాక చిల్లర గొడవ. 2వేల నోటుకి వందలో, అయిదు వందల నోట్లో ఎవరు ఇవ్వాలి? ఇది మరో పెద్ద టెన్షన్! అయితే, కొత్త 2వేల నోటు పేద, మధ్యతరగతి వారికే కాదు గొప్పోళ్లకి కూడా నానా హింస రుచి చూపిస్తోంది. ఎలాగో తమ పాత నల్ల డబ్బు కొత్తగా మార్చుకుని పింకు నోట్లు దాచేసుకున్నాం అంటే కుదరటం లేదు! అమాంతం ఐటీ అధికారులొచ్చి మీద పడిపోతున్నారు. కోట్లకు కోట్లు ఎత్తుకెళ్లిపోతున్నారు. పైగా అరెస్టులు కూడా చేసి చుక్కలు చూపిస్తున్నారు. ఇంతకీ పెద్ద మొత్తంలో 2వేల నోట్లు ఎక్కడ వున్నా ప్రభుత్వ అధికారులకి ఎలా తెలిసిపోతోంది? దేశంలో ఏ మూల నల్ల సొమ్ము పోగేసిన వాళ్లు ఎలా పసిగట్టేస్తున్నారు? దీని గురించి ఇప్పుడు మరో కొత్త ప్రచారం జోరందుకుంది!
2వేల నోటు వచ్చీ రాగానే కొందరు ఏం చెప్పారో గుర్తిందిగా? యెస్... అందులో చిప్ వుందని, అది ఉపగ్రహానికి సంకేతాలు పంపుతుందని, ఆ సిగ్నల్స్ ద్వారా నల్ల త్రాచులు బుట్టలో పడిపోతాయని అన్నారు. కాని, చివరకు అదంతా తూచ్ అని తేలిపోయింది! ఇప్పుడు 2వేల నోటుకే మరో అత్యాధునిక టెక్నాలజీ అటాచ్ చేసేశారు గాసిప్ గాళ్లు! ఈ సారి చిప్ నుంచి కాస్త ముందుకు పోయి అణు ధార్మిక పదార్థం చర్చలోకి తీసుకొచ్చారు!
2 వేల రూపాయల నోట్లలో రేడియోధార్మిక పదార్థమైన పీ32 మెటీరియల్ వుందని చాలా మంది చెప్పుకుంటున్నారు. ప్రింటింగ్ కు వాడిన ఇంక్ లో కూడా రేడియో ధార్మికత వుండేలా ఆర్బీఐ ప్లాన్ చేసిందట. దాని వల్ల 2వేలు భారీగా ఎక్కడ వున్నా అది ఉప్రగహానికి చేరిపోతుందట! అంతే, ఆ అడ్రస్ పట్టుకుని ఐటీ వారు వచ్చేస్తున్నారట! 2వేల నోటుకి సంబంధించిన ఈ వదంతి నిజం అయ్యే అవకాశం 2వేల రెట్లు లేదు. ఎందుకంటే, రేడియో ధార్మికత చాలా ప్రమాదకరమైంది. పీ32 వల్ల ఆరోగ్య సమస్యలు వుండవని ఎవరు ఎంత చెప్పినా అణు ధార్మికత అణు ధార్మికతే కదా! ప్రభుత్వం అలాంటి రిస్క్ ఎందుకు తీసుకుంటుంది?
కొత్త నోట్లు పోగేసిన బ్లాక్ డాగ్స్ ను ఐటీ తేలిగ్గా పట్టుకోటానికి కారణం... అవన్నీ బ్యాంకుల ద్వారా తప్ప మరే మార్గంలోనూ బయటకి రాలేదు. కాబట్టి బ్యాంకుల్ని, బ్యాంకు మ్యానేజర్లని ఓ కంట కనిపెట్టడం ద్వారా పెద్ద చేపల్ని ఈజీగా గుర్తిస్తున్నారు. దీనికి నానో చిప్స్, రేడియో ధార్మిక ఇంకు ఏమీ అక్కర్లేదు. నిజానికి అధికారికంగా అర్బీఐ చెబుతోంది కూడా అదే! 2వేల రూపాయల నోట్లో ఎలాంటి ప్రత్యేకతా లేదు... కేవలం దొరికిన వాడికి భారీగా దొరకటం, దొరకనోడికి అస్సలు దొరక్కపోవటం తప్పా!