సమస్య కధ
వసుంధర

నాగేశ్వరరావుకు ఫోటో స్టూడియో లేదు కానీ ఫోటోగ్రపీ అతడి హాబీ. అతడు ఫోటోలు చాలా బాగా తీస్తాడని పేరు. అందుకే ఫారిన్ వెళ్ళి వచ్చిన అతడి మిత్రుడు తన యాషికా కెమెరాని నాగేశ్వరరావుకి అమ్మేసి తను అగ్ఫా ఐసోలీ కొనుక్కుని అది చాలు ననుకున్నాడు.
ఒకరోజు నాగేశ్వరావుకు బజార్లో రామచంద్రం అనే స్నేహితుడు కనబడ్డాడు. రామచంద్రం చెల్లెలు భారతికి డిల్లీ నుంచి పెళ్ళి సంబంధం వచ్చిందిట. వరుడోక్కడే డిల్లీలో ఉన్నది. మిగతా వారంతా ఇక్కడే ఉన్నారు. వరుడి తల్లితండ్రులు పిల్లను చూసి తృప్తి పడ్డారు. కట్నం మాటలు విని ఆనందించారు. ఇంక కొడుకు ఊ అంటే చాలునట. కొడుక్కు తమ మాట వేదవాక్కు కాబట్టి పిల్ల ఫోటో ఒకటి పంపితే చాలు నన్నారు. ఎందుకంటె ఇప్పట్లో అతను డిల్లీ నుంచి రాడు.
రామచంద్రం చెల్లెలికి ఫోటో తీయిచాడు. అది బాగా రాలేదు.
"నా చెల్లెలు పెద్ద అందగత్తె ఏమీ కాదు. కానీ ఫోటోలో మరీ అసహ్యంగా పడింది. ఆ ఫోటో చూసి పెళ్ళికొడుకు మరోవిధంగా అనుకునే అవకాశముంది. మరో స్టుడియోలో తీయించాలనుకుంటున్నాను" అన్నాడు రామచంద్రం.
నాగేశ్వరరావు వెంటనే , "ఓ సారి నీ చెల్లెల్ని మా యింటికి తీసుకుని రాకూడదూ , నేనో ఫోటో తీస్తాను." అన్నాడు.
అతనీమాట అంటాడనే రామచంద్రం తన విషయం చెప్పాడు. నాగేశ్వరావు కున్నా ఫోటో గ్రఫీ పిచ్చి అలాంటిది.
ఆ సాయంత్రమే రామచంద్రం తన చెల్లెల్ని తీసుకుని నాగేశ్వరారావు ఇంటికి వెళ్ళాడు. భారతికి అంతకు ముందు తీసిన ఫోటో కూడా చూపించాడు. "ఫోటో మరీ ఘోరంగా ఉంది. కానీ భారతి కూడా ఘోరంగా ఉన్నట్లే లెక్క." అనుకున్నాడు నాగేశ్వరరావు. అతను తన సరంజామా సిద్దం చేసుకుని భారతికి ఓ ఫోటో తీశాడు. అదృష్టవశాత్తు అతడి రీలు చివర్లో ఉన్నది. అందువల్ల ఆ రాత్రికి రాత్రే అతను నెగెటివ్ ను డెవలప్ చేసి నాలుగు ప్రింట్లు తీశాడు. ఈసారి ఫోటోలో భారతి ఉన్నదున్నట్లుగా పడింది. పూర్వం ఫోటో కన్నా చాలా మెరుగు.
నాగేశ్వరరావు మనసులో భారతి మీద జాలిపడ్డాడు. లేని అందాన్ని ఫోటో తీసుకురాలేదు కదా!
మర్నాడు కాఫీలూ, నెగటివ్ రామచంద్రానికిచ్చి , "వీలుంటే నీ ఫోటో స్టూడియో లోనైనా కాస్త దిద్దించు. ఇంకాస్త బాగుంటుంది. నేను సీనరీసు తీసినట్లుగా మనుషుల్ని తియ్యలేను" అన్నాడు నాగేశ్వరరావు.
రామచంద్రం ఆ తర్వాత పది రోజులకు కనిపించాడు.
"చాలా థాంక్స్ గురూ! పెళ్ళి కొడుకు తను పిల్లను చూడనక్కర లేదనీ, ముహూర్తాలు పెట్టించవచ్చుననీ రాసేశాడు" అన్నాడు రామచంద్రం.
నాగేశ్వరరావు ఆశ్చర్యపడ్డాడు. భారతికి తనే ఫోటో తీశాడు. ఆ ఫోటోలో ఆమె పెద్దగా బాగోలేదు. అయితే ఉన్నదున్నట్లుగా పడింది. అయితే వరుడి కామె అంతలా నచ్చిందా?
'రకరకాల అభిరుచులు " అని మనసులో అనుకుని, "అయితే కంగ్రాట్యూలేషన్స్ ! నేను తీసిన ఆ ఫోటోని నేనోసారి చూడొచ్చా" అనడిగాడు నాగేశ్వరరావు. ఒక వరుడికి నచ్చాక ఆ ఫోటో ఎలా గుందో చూడాలని పించిందతనికి.
రామచంద్రం నాగేశ్వరరావుని ఇంటికి తీసుకుని వెళ్ళి ఫోటో చూపించాడు. అది చూసి నాగేశ్వరరావు వులిక్కిపడి , "మైగాడ్! నేను తీసిన ఫోటో గ్రాపు ఇలా లేదే " అన్నాడు.
"నీ సలహా ప్రకారమే ఓ ఫోటో స్టూడియో కి తీసుకెళ్ళి దిద్దించాను. అతను అంతకు పూర్వం తీసిన ఫోటోని చూసి నిన్నెంత గానో మెచ్చుకున్నాడు. పూర్వం ఫోటోలో దిద్దడానికి స్కోపు లేదు. ఈ ఫోటో సాయంతో బొమ్మను అందాల రాణిగా తీర్చిదిద్దవచ్చునన్నాడు. దిద్దాడు కూడా" అన్నాడు రామచంద్రం.
నాగేశ్వరరావు ఆ ఫొటోనే పరిశీలించి చూస్తున్నాడు. పెదిమల దగ్గర, కను కొలకుల దగ్గర, ముక్కు దగ్గర, చెవుల దగ్గర, జుత్తు దగ్గర ఇలా అన్నిచోట్లా చిన్న చిన్న టచప్ ఇచ్చాడు. అవే టచప్ భగవంతుడు ఇచ్చి వుంటే భారతి చాలా అందంగా వుండి వుండేది. అయితే రోజులో ఏదో సమయంలో భారతి ఒక్కసారైనా అలా కనిపించక పోదు.
ఫోటోలో మనిషి భారతి అనడంలో సందేహం లేదు. కానీ.....
నాగేశ్వరారావు ఫోటో అక్కడ వదిలి ఇంటికి పరుగెత్తాడు. అతడి కలవరపాటుకు కారణం రామచంద్రానికి తెలియలేదు.
నాగేశ్వరావు తల్లి దగ్గరకు వెళ్ళి , "అమ్మా! అబ్బాయి ఫోటోను చూశాడు. పిల్లను చూడక్కర్లేదు, ముహోర్తాలు పెట్టుకొండని ఉత్తరం రాశారు గదా మీరు పెళ్ళి వారికి ! కానీ ఒక్కసారి నేను పిల్లను చూడాలి. ఎలాగో అలా ఈ ఏర్పాటు చెయ్యాలి. పిల్లను చూడందే నేనీ పెళ్ళికి ఒప్పుకోలేను " అన్నాడు .
కొడుకలాగేందు కంటున్నాడో తెలియక ఆశ్చర్యంగా భర్త దగ్గరకు పరుగెత్తింది నాగేశ్వరరావు తల్లి.
***
