Previous Page Next Page 
భార్య వేశ్య కాదు పేజి 7


                                                                 భార్య వేశ్య కాదు
                                                                          వసుంధర

                                 
         
    
    నా పుట్టిన రోజింక సరిగ్గా నాలుగు రోజులుంది. అయన ఇంత వరకూ కొత్త చీర కొనలేదు. జాకెట్ గురించి నా కిబ్బంది లేదు. ఇంట్లో మిషన్ వుంది. రాత్రికి రాత్రి కుట్టేయగలను.
    వారం రోజుల్నుంచి ప్రయత్నిస్తున్నాను ఆయనకు గుర్తు చేద్దామని; వారం రోజుల్నుంచి అయన ఆఫీసు నుంచి ఇంటికి లేటుగా వస్తున్నారు. ఈరోజూ అలాగే చేశారు.
    ఉదయమప్పుడు అడిగితే సరే అంటున్నారు. అదీకాక అప్పుడు హడావుడి. టిఫిన్ చేయాలి. కాఫీ కలపాలి. వంట చేయాలి. ఆయనకు క్యారియర్ సర్దాలి. పిల్లల్ని తెమిల్చి స్కూలు కు పంపాలి. సాయంత్రం అడుగుదామంటే అయన ఆలస్యంగా రావడం వల్ల కుదరడం లేదు. అన్నీ సర్దుకుని పడుకునేసరికి అలసట వల్ల వెంటనే నిద్ర పట్టేస్తోంది. ఏ రాత్రో మెలకువ లో దరిజేరినాప్పుడీ ధ్యాసే ఉండడం లేదు.
    అయినా మరీ ఇంత పీకెల మీదకు వస్తుందనుకోలేదు. చూస్తుండగా రోజులు గడిచి పోతున్నాయి. ఆయనలో చలనం ఉండడం లేదు.
    నేనెప్పుడూ తిధుల ప్రకారమే నా పుట్టిన రోజు జరుపుకుంటాను. ఈసారి అది నేలాఖర్లోకి వచ్చింది. ఈ నెల ఆరంభంలో అనుకోకుండా వారు ఇంటికి కాస్త ఎక్కువ డబ్బు పంపాల్సి వచ్చింది. పిల్లల స్కూళ్ళలో ఏదో డొనేషన్ అంటూ ఇద్దరికీ కలిపి యాభై రూపాయలు వదిల్చేశారు. గత మాసం కరెంట్ బిల్లు ఏ కారణం వల్లనో రాలేదు. రెండు నెలలదీ కలిసి ఈ నెల వసూలయింది. ఇందులో ఓ ప్రాణ మిత్రుడికి డెబ్బై రూపాయల అప్పు కూడా ఇచ్చాడాయన. వీటన్నింటికీ తోడు మా ఎదురింటావిడ తన పుట్టిన రోజుకో చీర కొనుక్కుంది. దాని ఖరీదు రెండొందల అయిదు. అందువల్ల నేను అంతకంటే కాస్త ఎక్కువే పెట్టాలి. ఇంతవరకూ నా చీర ఏదీ ఆవిడ చీర ఖరీదుకు తక్కువ కాదు. అయినా ఆవిడ సాధారణంగా వందలోపు చీరలే కడుతుంది. నా దురదృష్టం కొద్దీ ఈసారి కాస్త ఖరీదైన చీర కొంది.
    ఇంట్లో నా దగ్గర ఎనబై రూపాయలున్నాయి. ఆయన దగ్గరున్నది కూడా వందకు మించదు. అందువల్లే చీర గురించి ఇంత ఆలోచించాల్సి వచ్చింది. అయన ఎవరి దగ్గరైనా అప్పు పుట్టించాలి. ఈరోజు అయన ఇంటికి రాగానే అన్ని విషయాలు పక్కకు నెట్టి చీర విషయమే మాట్లాడాలనుకున్నాను. అందుకే అయన ఇంకా బూట్లు విప్పాకుండానే - "ఏమండీ౧ నా పుట్టిన రోజు సంగతి తేల్చడం లేదు మీరు?" ఆనేశాను.
    "ఇంటికి రాగానే వేరే టాపిక్ దొరకదా నీకు ?" అన్నారాయన. విసుగ్గా నావైపు చూస్తూ.
    "టాపిక్ మార్చాలని నాకూ సరదాగానే ఉంది. మీరే తీర్చడం లేదు" అన్నాను.
    "బియ్యే ప్యాసయ్యావు గదా , తెలివి తేటలుంటాయనుకుని మోసపోయాను. చీరల పేరుతొ మొగుణ్ణి వేధించడం లో రెండో క్లాసు చదివిన మా అమ్మా, బియ్యే ప్యాసైన నువ్వూ ఒక్కలాగే ఉన్నారు.' అన్నారాయన ఇంకా చిరాగ్గానే.
    నా మనసు చివుక్కుమంది. "చీరల కోసం ఆయన్ను నేను వేదిస్తున్నానా? పుట్టినరోజు నాడు భర్త చేతా కొత్త చీర కొనిపించుకోవాలనుకోవడం వేదించడమవుతుందా?
"చీర కావాలంటే వేధించడమని నాకు తెలియదు. ఇప్పుడు చెప్పారు కాబట్టి ఇంకెప్పుడూ మిమ్మాల్ని చీర కావాలని అడగను" అన్నాను.
    ఆయనేమీ మాట్లాడలేదు. ఆ మౌనం నా బాధను పెంచింది. నా బాధ కోపంగా కూడా మారింది. ముభావంగా పనులన్నీ ముగించుకున్నాను. పిల్లల్ని పడుకో బెడుతూ వాళ్ళ పక్కనే పడుండిపోయాను.
    ఓ రాత్రి వేళ అయన నన్ను లేపారు. ఉలిక్కి పడి లేచాను. ఆయన్ను చూడగానే త్వరగానే  నాకోపం సంగతి గుర్తు కొచ్చింది.
    "నాకు నిద్ర వస్తోంది. పడుకోనివ్వండి " అన్నాను విసుగ్గా.
    "గట్టిగా అరవకు . పిల్లలు లేస్తారు." అన్నారాయన భయంగా.
    కుంభకార్ణున్నయినా మధ్యలో లేపవచ్చునెమో గానీ మా పిల్లల్ని మాత్రం మధ్యలో లేపలేము. ఆ సంగతి నాకు బాగా తెలుసు. అందుకే - "మీరు వెళ్ళి పడుకోండి" అన్నాను మళ్ళీ.
    "నీతో మాట్లాడాలి?" ఆన్నారాయన.
    "పొద్దున్న మాట్లాడుకుందాం లెండి" ఆన్నాను.
    "రమా! ప్లీజ్ - నాకు నిద్ర పట్టటం లేదు. నీతో అర్జంటుగా మాట్లాడాలి."
        అయన ఏం మాట్లాడాలో నాకు తెలుసు. విననట్లుగా నటించి పడుకోబోయాను.
    అయన నా చేతులు పట్టుకుని, "ఇవి చేతులు కావు, కాళ్ళు" అన్నారు.
    "ఇప్పుడలాగే అంటారు. చీరాల పేరు చెప్పి మిమ్మల్ని వేధించే దాన్ని, చదువున్నా సంస్కారం లేని దాన్ని - నాతో మీకెందుకు? నామానాన నన్ను పడుకోనివ్వండి" అన్నాను.
    "ఓహో ! నువ్వింకా ఆ మాటలు మర్చిపోలేదా ? రమా! నేను మూర్ఖుణ్ణి . నీలాంటి దేవతను అలాంటి మాటలెలా అనగలిగానో నాకు తెలియదు. చీరల కోసం నువ్వు వేదించడమేమిటి? నీకు చీరలు కొనేది నా సంతోషం కోసం. ఆ విషయమై నీతో కొన్ని మాటలు మాట్లాడాలి. ప్లీజ్! వస్తావు కదూ?" అన్నారాయన.
    నేను లేచి ఆయనతో మా గదికి వెళ్ళాను.
    అయన తన్ను తాను తిట్టుకున్నారు. నన్ను ఆకాశానికేత్తారు. రేపు ఆఫీసు మానేసి చీర కోసం అప్పు వేటకు బయల్దేరుతారుట. డబ్బు దొరకగానే ఇద్దరూ షాపింగ్ కు తిరగడమెనట!
    సమయం అనుకూలంగా ఉండడంతో అయన ప్రవర్తనకు నా మనసెలా గాయపడిందో వివరించి చెప్పాను. అప్పటికప్పుడు ఎన్నో షరతులు విధించాను.
    అయన తన తప్పులన్నీ  ఒప్పేసుకున్నారు. నా షరతులాన్నింటికీ అంగీకారించారు. నా మనస్సుకు ఎంతో సంతోషమైంది. అయన దగ్గరగా తీసుకుంటుంటే మనసు పరవశించింది. తనువు పులకరించింది.
    మర్నాడాయన ఆఫీసుకు వెళ్ళేటప్పుడు , "రమా ! ఆఫీసుకు వెళ్ళి నా నేను డబ్బు కోసమే ప్రయత్నిస్తాను. డబ్బు దొరగ్గానే సెలవు పేటి ఇంటికి వచ్చేస్తాను." అన్నారు.
    నాకు ఎంతో సంతోషమైంది. అయన చీర విషయం ఇంకా మరిచిపోలేదు.
        మధ్యాహ్నం తీరుబడి సమయంలో ఒక నవల చదువు తున్నాను. అది ఒక వేశ్య కధ. కాధానాయకుడికి భార్య ఉన్నా వేశ్య వలలో పడతాడు. ఒకసారి వేశ్య ముత్యాలహారం కొనుక్కోవాలనుకుంటుంది. కధానాయకుడు డబ్బు లేదంటాడు. వేశ్య అతనితో మాట్లాడడం మానేస్తుంది. దరిదాపుల క్కూడా రానివ్వదు. కదానాయకుడు తనకున్న ముఖ్యమైన పనులన్నీ వదిలిపెట్టి ఆ విషయమై ప్రయత్నించి ముత్యాలహారం కొని, వేశ్య అభిమతాన్ని, ప్రాపకాన్నీ మళ్ళీ సంపాదిస్తాడు.
    ఇది చదవగానే హటాత్తుగా నాకూ, ఆ వేశ్యకూ సామ్యముందని స్పురించింది నాకు.
    "రాత్రి నేను చేసిందేమిటి? అయన బలాహీన క్షణాన్ని కనిపెట్టి నాకవసరమైనది చేయడానికి ఒప్పించాను. అంటే ఆయనకూ నాకూ ఉన్న సంబంధం ఏమిటి? పవిత్ర దంపత్యపుటను బంధం ఇంతేనా? తన అవసరం కోసమే అయన నా కోరికలు తీరుస్తున్నారా ? భార్య అన్న ప్రేమాభిమానాలతో అయన నా గురించి ఏమీ చేయలేరా?'
    నా శరీరం అవమానంతో కుంచించుకు పోయింది. పుట్టిన రోజుకు ఖరీదయిన చీర కొనిపించుకోవాలనే కోర్కె తో నన్ను నేను ఆయనకు సమర్పించుకున్నాను తప్పితే ఒక భార్య భర్తను చేరినట్లుగా చేరలేదు. నా చదువు , సంస్కారం ఆఖరికి నన్నోక వేశ్యగా తీర్చిదిద్దుతున్నయా?
    'ఆయనకు నాపై ఎలాంటి అభిప్రాయం కలిగి ఉంటుంది? కట్టుకున్న భార్య కాబట్టి పైకి ఏమీ అనకపోయినా లోపల్లో పలే నేనంటే చాలా తేలిక భావం కలిగి ఉంటుంది.'
        తర్వాత ఇంక నవల చదవలేక పోయాను. మనసు కూడా పాడయింది.
    ఐతే ఆరోజు కూడా అయన ఇంటికి రోజులాగే లేటుగా వచ్చారు.
    "నన్ను క్షమించమని అడగడానికి కూడా సిగ్గుగా ఉంది రమా! ఆఫీసులో అర్జ్జంటూ పని ఉంది. బాధ్యత గల ఆఫీసరుగా నీ చీర అప్పు చేయడం కోసం సెలవు తీసుకోలేక పోయాను. అన్న ప్రకారం కనీసం పెందరాళే నైనా ఇంటికి రాలేకపోయాను" ఆన్నారాయన.
        ఆయన ఇలా అన్నప్పటికీ రానున్న తుఫాన్ ఎలా తట్టుకోవాలా అన్న కలవరం అయన ముఖంలో ప్రతి ఫలిస్తోంది. ఆయన్ను చూస్తె జాలి వేస్తోంది.
    "ఎంత మంచి వారండీ మీరు !" అన్నాను అప్రయత్నంగా .  ఆ మాటలు నేను మనస్పూర్తిగానే అన్నాను. నన్ను వేశ్యగా గుర్తించి భయపడక, భార్యగా గుర్తించి నిర్లక్ష్యం చేసిన అయన మంచితనం ఒక్కసారిగా నా మనసును ఎంతో తేలిక చేసింది.
    ఆయన నావంక ఆశ్చర్యంగా చూశారు. నేను వ్యంగ్యంగా మాట్లాడేనని అయన అనుమానం.  అయితే నా ముఖంలో భావాలలా లేవు. తర్వాతి నా ప్రవర్తన కూడా అలా లేదు.
    రాత్రి అయన పిలవకుండానే గదిలోకి వెళ్ళాను. నా ప్రవర్తనకు అర్ధం తెలియక సతమమవుతున్న అయన మారోసారి నన్ను క్షమార్పణ అడిగాను.
    "ఎందుకండీ మాటిమాటికి క్షమార్పణ  అడిగారు? మీ ఇబ్బందులు నాకు తెలియవా? నేను మీ అర్ధాంగిని. మీ కష్ట సుఖాలు రెండింటిలోనూ నాకు భాగముంది.  ఏ ఆమాత్రం వీలున్నా మీరే చూస్తారు. నేను మిమ్మల్నీ విషయంలో విసిగించి ఉంటే నన్ను క్షమించండి. ఈ పుట్టిన రోజుకు మీరు చీర కొనకపోయినా నేనేమీ అనుకోను. ఇది మనస్పూర్తిగా చెబుతున్న మాట" అన్నాను. అయితే నా లోని మార్పుకు కారణమైన ఆ వేశ్య కధ గురించి మాత్రం ఆయనకు చెప్పలేదు.
    అయన నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు. ఒక వేశ్యలా కాక భార్యకు వలెనె అయన కౌగిలో కరిగాను నేను.
    ఆ మర్నాడు సాయంత్రం అయన డబ్బు సాధించువచ్చారు. మేము షాపింగు కు వెళ్ళాం. పుట్టిన రోజుకు నాకు చీర, జాకెట్టు రెండూ కూడా అమరాయి.
    ఇప్పుడు నేను గ్రహించినదేమిటంటే - పురుషుడికి సంబంధించినంత వరకూ వేశ్యకూ, భార్యకూ చాలా తేడా ఉంది. వేశ్య అందకుండా దూరంగా ఉంటానని బెదిరించి తనక్కావలసినవి సాధిస్తుంది. భార్య తన కేమీ వద్దని త్యాగాన్ని ప్రకటించి కోరినవి సాధిస్తుంది. పద్దతుల్లో తేడా ఉన్నా వేశ్య బెదిరింపు కయ్యే ఖర్చుకు భార్య త్యాగం చేసే ఖర్చు తీసిపోదు.

                                          ***


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS