"ఎవరావచ్చేది?" అన్నది మంజరి దూరంనుండే దణ్ణం బెడుతున్న ఓ బట్టతల మనిషిని చూపిస్తూ. "నేను లోపలికెళ్ళానా?"
"అవసరంలేదు కూర్చో" అన్నాడు చలపతి మంజరితో" నమస్కారం తారకంగారూ! దయచెయ్యండి!" అంటూ తారకాన్ని ఆహ్వానించాడు చలపతి.
"ఇస్సో" అంటూ కుర్చీలో కూచుని బట్టతలమీది చెమటను., వేలితో తీసి ధారగా కిందకు వేస్తూ, మంజరికేసి తిరిగి "నమస్కారం అమ్మాయిగారూ?" అన్నాడు తారకం.
మంజరికూడా సుతారంగా నమస్కరించింది. ఆ పైన ఏం చెయ్యాలో ఆవిడకు తోచలేదు.
"నన్ను మీ రెరుగరు లెండి" అంటూ ప్రారంభించాడు తారకం నేనీ ఇండస్ట్రీకి పాతవాన్ని, మన చలపతిగారి క్కూడా ఆ సంగతి తెలుసు. చలపతిగారంటే నివురుగప్పిన నిప్పులాంటివాడు. రాత బయటపడక వారిలా వున్నారుగానీ, ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ కూడా వీరిముందు పనికిరాదు. మా గొప్ప బుర్ర ఏదయితే నేం గానీ, వారిజాతకం నా జాతకం, వొక్కలాగే ఉన్నాయి. కళారంగాన్ని వదుకోలేక అలా నె తంటాలు పడుతున్నాను. మిమ్మల్ని గురించి చలపతిగారు నాతో కూడా చెప్పారు. మీ దయవల్ల పది కంపెనీల్లో ఇంత పేరున్న వాణ్ని గనక, అన్నిచోట్లా మీ గురించి చెప్పుకొచ్చాను. రెండు మూడు కంపెనీలు, నాకు మాటిచ్చాయి. ఈ నెలాఖరులోగా మీకా కంపెనీల్లో వేషాలు రావడం ఖాయం."
"చాలా సంతోషమండి!" అన్నది మంజరి. అన్నాక చలపతి కేసి చూసింది అతగాడు 'ఇకచాలు' అన్నట్లుగా తలపంకించారు.
"ఇంకో ముఖ్యమైన సంగతి మీ చెవిని వేద్దామని ఇలా పనిమాలా వచ్చాను. నవకళా చిత్రాలయమువారు, సోషల్ తియ్యడం ఆపుచేసి, ఫోక్ లోర్ తియ్యడానికి నిశ్చయించారు, ఉదయంనుండీ వారితో హోరా హోరీగా వాదించాను. రామబ్రహ్మం గారు ససేమిరా వీల్లేదన్నారనుకోండి-"
"వెంకటేశ్వర్లుగారేమన్నారండీ?" అన్నది మంజరి ఆత్రంగా.
"అదే చెప్పుకొస్తున్నా తల్లి! మనిషంటే వారినే చెప్పుకోవాలండీ! ఆయనగారు జానపదంతప్ప మరోటి తీయడానికే వీలుపడదన్నాడండీ! కధ కూడా నన్నే చూడమన్నారు" అన్నాడు తారకం.
అంతవరకూ, మౌనంగా కూచున్న చలపతి వొక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. కుర్చీలో అటూ ఇటూ మసలి, మళ్ళాకూచున్నాడు. సిగరెట్ వెలిగించి గట్టిగా పొగలాగి, చిటికవేసి, సిగరెట్ నుసిని రాల్చేశాడు.
"మరి మీరు కధేమన్నా ఆలోచించారా?" అన్నాడు చలపతి.
"ఇదివరకే నాదగ్గర రెండు కధలున్నాయి. వాటినే ఇద్దామనుకొంటున్నాను" అన్నాడు తారకం.
చలపతి కొద్ది క్షణాలపాటు ఏమీ మాట్లాడలేదు. తరవాత తారకం కేసి తిరిగి, మెల్లిగా "ఓపని చెయ్యండి తారకంగారూ! మంజరి మీపేరు పది కాలాలపాటు చెప్పుకొంటుంది, మనందరం కలిసి, సాయంచేస్తేగానీ, మంజరిలాంటి కొత్త ఆర్టిస్టులు పైకిరారు.....మరేంలేదు. ఆ కధను, ముందుగా నా కొకసారి చూపించండి, లేదా ఓ కారెక్టరుకు మాంచి ప్రామినెన్స్ ఉండేలా చూడండి, వాంప్ టచెస్ ఉండకూడదు. ఆడిటోరియం సింపతీని గెయిన్ చెయ్యాలంటే పాథరిక్ రోల్ ఉండాలసిందే! వాంప్ మీద సానుభూతి రాదు. రాకూడదు." అన్నాడు చలపతి.
"చూద్దాం" అన్నాడు తారకం.
ఈలోగా చలపతి మంజరికి సౌంజ్ఞ చేశాడు. మంజరి ప్రారంభించింది -
"మరేం లేదు తారకంగారూ! మా వారన్నట్లుగా, వాంప్ కారెక్టర్ ప్రజల్నించి మెప్పుల్ని పొందలేదు. నేను అన్నిరకాల వేషాలూ వేసిందాన్ని గనక చెబుతున్నాను. ముందస్తుగానే నాలుగు మంచి వేషాలు దొరికితే పదిమందికి తెలిసివస్తుందని నా ఆశ. ఇప్పుడప్పుడే హీరోయిన్ వేషం నా కివ్వరనుకోండి. మరీ అంత హీనంగా ఉండే వేషాన్ని కూడా నే వెయ్యదలుచుకోలేదు." అన్నది మంజరి.
"అలాగే నమ్మాయిగారూ! మీరిన్నిసార్లు చెప్పాలా?" అంటూ తారకం లేచి నాలుగడుగులు వేసినవాడల్లా గిరుక్కున వెనక్కు తిరిగొచ్చి "ఇన్నిటికీ అసలు విషయం అడగటమే మరిచిపోయాను. నాకో పాతిక రూపాయలుంటే సర్దండి, రేపో ఎల్లుండో కంపెనీలో అడిగి ఇచ్చేస్తాను" అన్నాడు.
మంజరి చలపతి కేసి చూసింది.
"అలాగేనండీ! తప్పకుండా పట్టుకెళ్ళండి. ఇది తిరిగి మీ రివ్వనవసరం లేదు.....మీరు ఇంకోలా అనుకోకండి.....చూడు మంజరీ! నా జేబులో ఉండాలి చూసి, కవిగారి కొ పాతిక రూపాయలత ఇవ్వు, అన్నాడు చలపతి.
మంజరి గదిలో కొచ్చి చలపతి జేబులు వెదికింది. అందులో సిగరెట్లు నుండి రాలిన పొగాకుపొడి ఆరణాలన్నర చిల్లరా తప్ప మరేమీ లేవు.
"ఓరి నీబడాయి బండలుకానూ! వందలేవో జేబులో ఉన్నట్టే మాట్లాడావే" అనుకొన్నది మంజరి.
తరువాత తన పెట్టెలోంచి పాతిక రూపాయలూ ఎంచి తారకంగారి చేతికిచ్చి నమస్కరించింది.
"శుభం అమ్మాయిగారూ! నేను వస్తాను. నాలుగైదు రోజుల్లో కధను మార్చి తీసుకొస్తాన్లెండి. ణా చేతిలో ఉన్నంతవరకూ ఫర్వాలేదు. ఆ పైన భగవంతుడిదయ" అన్నాడు తారకం.
అతను వీధిలో కెళ్ళిపోయాక మంజరి సన్నగా నిట్టూర్చింది.
చలపతి ఓసారి మెటికలు విరుచుకొని తనలో తనే నవ్వుకొన్నాడు.
"ఏమిటి!" అన్నట్లు చూసింది మంజరి.
"ఏం లేదు నేనోసారి రావుగారి దగ్గర కెళ్ళొస్తాను. నిన్నాయనకు పరిచయం చేయడం అవసరం, వారే నీ ప్రసక్తి తీసుకొచ్చారు. ఈ మధ్యనేనలా వెళ్ళొస్తాను....వెడుతూ వెడుతూ వోసారి వెంకటేశ్వర్లుగారికి కనిపించి మరీ పోతాను" అన్నాడు చలపతి.
మంజరి పలకలేదు.
చలపతి పదినిమిషాల్లో తయారయ్యాడు. మెట్లుదిగి నాలుగడుగులు వేసిన వాడలా ఆగి వెనక్కు తిరిగాడు.
"మొన్నా మధ్య ఫర్నీచర్ కోసమని కొంత డబ్బు తీసుకొన్నాను. తీరా కొనబోయేసరికి నాకో అనుమానమొచ్చింది. ఉన్న డబ్బంతా కుర్చీలకూ బల్లలకూ తగలేస్తే మనం తరవాత అవస్థపడాలి, పోనీ ఫర్నీచర్ కొందామని నువ్వంటే కోనేస్తాను. నన్నేం చెయ్యమంటావోయ్?" అన్నాడు చలపతి.
"ఇలాంటి విషయాలూ నన్నడగాలా? మీ కేది మంచిదని తోస్తే అదే చేయండి. ణా కిదంతా గొడవ గొడవగా ఉంది" అన్నది మంజరి పొడి పొడిగా
"దట్సాల్" అన్నాడు చలపతి.
అతను వెళ్ళాక కళ్ళు రెండూ గట్టిగా నులుముకొంది. తలలో సన్ననినొప్పి, లోపల గుబులు గుబులుగా వుంది.
"రాను రాను చలపతి నాకు మరీ అర్ధం కాకుండా పోతున్నాడు" అనుకొంది మంజరి.
ఇలా అనుకొందుకు తగిన కారణాలు కూడా ఆవిడ దగ్గర సిద్దంగా వున్నాయి.
తను మద్రాసులో అడుగు పెట్టడానికి ముందు చలపతి తనతో అన్నవాటికి తనిక్కడ చూస్తున్నవాటికీ ఎక్కడా పొంతనలేదు., తనో పిక్చర్ తీస్తున్నాననీ, సరైన హీరోయిన్ లేక బాధపడుతున్నాననీ చలపతి చెప్పి తీసుకొచ్చాడు. ఎరిగినవాడవటం వల్లా తనకిష్టం లేక పోయినా రాజమణి ప్రోత్సహించడంవల్లా మద్రాసు వచ్చింది. నిజానికి తనురాగానే చలపతి షూటింగ్ ప్రారంభించవలసింది. అతనా ప్రసక్తే తీసుకురావడంలేదు. తను అడగనూలేదు. సినిమా కంపెనీ శుద్ద అబద్దమన్నమాట!
అయితే చలపతి ఉద్దేశమేమిటి?
అతనికి తననుండి కావలసిందేమిటి? తనతో సుఖించడమే ఇతే దానికిన్ని అబద్దాలాడవలసిన అవసరం లేదు. ఈ మద్రాసు దాకా పట్టుకురావలసిన అవసరమూలేదు. ఆ కాస్త కక్కుర్తి అక్కడే వెళ్ళి మార్చుకొని రావచ్చు. అలా కాకుండా తను పనిమాలా మద్రాసుకు తీసుకొచ్చాడు. తనకోసం అంతో ఇంతో ఖర్చుచేశాడు. పది కంపెనీలచుట్టూ కాలుకాలిన పిల్లిలాగా తిరిగాడు. ఇంకా తిరుగుతున్నాడు. పత్రికల్లో తనకు చచ్చేంత పబ్లిసిటీ ఇప్పించాడు. నవకళా చిత్రాలయవారిని తనకు పరిచయం చేసిందీ ఆయనే! ఇదంతా కేవలం నిస్వార్ధంతోనే జరిగిందని తను అనుకోలేదు. తన ఆలోచనలకు అందనంత దూరములో, చలపతి ప్రయోజనంవున్నది, అదేమిటో తెలిసిపోతే తనకింత ఆందోళన వుండదనుకొన్నది మంజరి.
పోతూ పోతూ చలపతి అన్న మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి. ఫర్నీచర్ కోసం డబ్బంతా ఖర్చుచేస్తే అవతల యిబ్బంది పడాల్సి ఒస్తుందట. "మరి కొనమంటావా?" అని అడగటం దేనికట డబ్బయిపోతే మళ్ళా వెంకటేశ్వర్లు నుండి పుచ్చుకోమని సూచిస్తున్నాడా? బహుశా అదే అయి ఉంటుంది. వెడుతూ వెడుతూ నవకళా చిత్రాలయ ఆఫీసుకు కూడా ఓసారి పోతానన్నాడు. తనిట్లా రావు గారి దగ్గర కెడుతున్నానని, తను రావడానికి చాలా ఆలస్యం పట్టవచ్చుననీ వెంకటేశ్వర్లుకు మాటల సందర్భంలో చెబుతాడు అంటే లైన్ క్లియరన్న సంగతి ఆ అడవిదున్నకు తెలియజేయడమన్న మాటే ! వాడినడిగి తను మళ్లీ డబ్బుపిండాలి. ఆ డబ్బును మళ్లీ ఖర్చు చేయాలి. అదయిపోయాక, ఇంకోసారి అడవిదున్న నుండి కొంత కొట్టెయ్యాలి. ఇలా ఎంతకాలం తను జరిపేటట్టు?
అదృష్టవశాత్తూ తనకు భగవంతుడు అందమిచ్చాడని మంజరి భావించింది. నాగమణి ధర్మమా అంటూ అందాన్ని రూపాయల్లోకి మార్చుకోవడం తనకు చాలాకాలం కిందటనే తెలుసు... మనిషిని చూడంగానే, వాడి తరహా తనకు ఇట్టే తెలిసిపోతుంది. వెంకటేశ్వర్లును తను అర్ధంచేసుకొంది. వాడికి పిచ్చెత్తించాలంటే నిమిషాలమీద పని! కానీ తన తెలివితేటలేవి చలపతి దగ్గర పనికిరావడం లేదు. అంటే - తనకన్నా చలపతి -ఈ సినిమా మనిషి అసాధ్యుడనేగదా అర్ధం!
వెంకటేశ్వర్లును చూస్తే తనకెంత అసహ్యమో, తనకూ, ఆ పరమేశ్వరునికి మాత్రమే తెలుసు. తన అవసరాలు ఆ అడివి దున్నకు తెలీకపోవచ్చు గానీ, వాడి అవసరాలు తనకు క్షుణ్ణంగా తెలుసు. వాడికి తన అందం కావాలి. తన శరీరమిచ్చే సుఖం కావాలి. డబ్బుంది గనక వెధవదగ్గర, పారేసి కొనుక్కోమను తను అభ్యంతరం చెప్పదు. లోగడ ఎందరో తనదగ్గరా సుఖాన్ని కొనుక్కొన్నారు. అలాంటి బోడి వెధవల్లో వీడొకడూ!
కానీ వెంకటేశ్వర్లు అంతటితో పోదు. "నిన్ను ప్రేమించానంటాడు. నువ్వు లేందే బ్రతకలేనంటాడు. "నీకోసం ఏం కావాలన్నా చేస్తానంటాడు. ఈ మాటలు వినీ వినీ తనకు రోతేసిపోయింది. పది రూపాయలిచ్చే ప్రతి చవట సన్యాసీ ప్రేమిస్తున్నానంటుంటే, ఆ మొఖం మీద లాగి తన్నాలనిపిస్తుంది! ఒకసారి, నాగమణి దగ్గర ఉన్నప్పుడేమో - దాదాపు అంతపనీ జరిగింది. వాడెవడో ఇటువంటి చెత్తా కానీ వాగుడు వాగుతున్నాడు. మంచంమీంచి కిందికి దొల్లించి తను బయటికొచ్చేసింది. వాడు లబ్బుమంటుంటే అందరూ మూగారు, నాగమణి తనను చచ్చేట్లు కొట్టాను కూడా కొట్టింది. ప్రాణంతీసినా తనిక గదిలో కెళ్ళనంది. అపుడు మణిమాలను గావును -తనకు బదులుగా నాగమణి వాడికి అప్పచెప్పింది!
ఆలోచిస్తుంటే, వాడికీ ఈ వెంకటేశ్వర్లుకూ బేదమేమీ, మంజరికి కనుపించలేదు, వాణ్ని తను మంచంమీది నుండి దొళ్ళించేస్తే ఈ అడవి దున్నను మంచంమీదికి ఆహ్వానిస్తోంది. అంతేబేదం.!
మంజరికి చిరుచెమటలు పోశాయి, సరిగ్గా కూచోలేకపోయింది. లోపలా బైటా అసంతృప్తి నక నక లాడిపోతూ వుంది. కాస్సేపు నిద్రన్నాపోదామని లేచేసరికి, తాయారు ఓ ఉత్తరం పట్టుకొని వస్తూ కనిపించింది.
"ఎక్కణ్ణించే?" అన్నది మంజరి.
"నా కెట్టా తెలుద్దమ్మాయి గారూ!"
కవరుమీద తనపేరే వుంది! చించి చూసింది! అది రాజమణి రాయించిన ఉత్తరం!
"కాబొయ్యే సినిమా స్టార్ కు, రాజమణి నమస్కారాలు!" అంటూ ఉత్తరం ప్రారంభమయింది.
"నీ ఉత్తరం అందింది. నిన్ను గురించి పత్రికల్లో వచ్చే సంగతులు కూడా వసంత చదివి చెప్పింది. ఆ పిల్ల పేరు 'వాసంతి' కాదు. 'వసంత' నువ్వేదో అసంతృప్తితో ఉన్నానని రాశావు. మళ్ళా గుంటూరు వచ్చేస్తాననీ రాశావు. మేమిక్కడ సుఖంగా ఉన్నామని నీ భ్రమ. "వ్యాపారం" మందగించి పోయింది. ఎక్కువ మందికి జీవనం గడవటమే కష్టంగా ఉంది. కనుక నువ్వు రాకు. వసంత నిన్ను తల్చుకోని రోజులేదు. దానిపాట నువ్వు వినలేదుగానీ, అధ్బుతంగా పాడ్తుంది. నీకన్నా అందగత్తెకూడానూ. అదిక్కడ ద్వంసమైపోతూ ఉంది. దాన్ని నీ దగ్గరకు పంపుతాను, డబ్బుకూ ఆడదానికీ లొంగని శక్తి లేనేలేదని నా నమ్మకం. నీ దగ్గర డబ్బు లేకపోవచ్చుగానీ, అందం వయస్సు ఉంది. ఈ రెండింటితోనూ, నువ్వు జయించుకు రావచ్చు. ఆపని నువ్వు చేయలేకపోతే, నువ్వెందుకూ పనికిరాని చవట పెద్దమ్మవన్నమాట! నీకు చేదోడు వాదోడుగా ఉంటుంది. వసంతను పంపనా? అది నీకన్నా తెలివిగలది. నీకు సాయపడుతుంది. ఇక నా ఆరోగ్యం సంగతి, మందులు తింటున్నాను. వ్యాధి పెరగడం లేదు కాని, కనీసం తగ్గను కూడా తగ్గడం లేదు. నీకేమన్నా కావలిస్తే నాకురాయి. నీదగ్గరుంటే పంపించు. నీ బొమ్మను తెరమీద చూడాలని మనస్సు ఆరాట పడిపోతూ ఉంది. మొట్ట మొదటిసారిగా, నువ్వు కాళ్ళూ చేతులు ఆడిస్తూ తెరమీద కదులుతుంటే మాట్లాడుతుంటే; చూడాలని చూసి చచ్చిపోదామనీ ఉంది. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి, సినిమా వేషాలకోసం ప్రయత్నించు, ఏవో పనికిరాని ఆలోచనలు పెట్టుకొని బతుకును పాడుచేసుకోకు, నా హితబోధ నీకు ముందు ముందుగానీ అర్ధంగాదు. వసంత నీ బొమ్మలు పడిన పత్రికలన్నీ కొని దాచుకొంది. డాని బొమ్మ కూడా పత్రికలో చూసుకోవాలని దాని ఆరాటం! చలపతి గారు కులాసాగా వున్నారా? అన్నట్లు చెప్పడం మరచాను. వారంరోజుల కిందట రామచంద్రం గారు వచ్చారు, నీ సంగతి చెప్పాను, మాధవరావుగారు, కొంత పొలం అమ్మేసి నాటకాలకైన బాకీని తీర్చేసారట! రామచంద్రం గారు అవకాశం చూచుకొని మద్రాసు వస్తారట. మన 'అమ్మ' నాగమణి క్షేమం. ఆ దొంగముండ నానా బాధలూ పడుతోంది. అదింకా అవస్థలుపడి చావాలని నా కోరిక, జవాబురాయి-"
ఈ ఉత్తరం చదవడానికి మంజరికి చాలాసేపు పట్టింది. ఒక్కచోట, చదవడం ఆపి, ఆలోచిస్తూ కూచునేది.,, నాగమణి, వసంత రామచంద్రరావు పేర్లు వచ్చినచోట, వారితోడి సంఘటనలు జ్ఞప్తికివచ్చి, కళ్ళు నీటితో నిండిపోయాయి.
"ఇంతమంది ఆప్తులను వదులుకొని నేనెందుకు మద్రాసువచ్చినట్లు. వచ్చి నేను సాధించిందేమిటి?" అని వాపోయింది మంజరి.
"ఏటుందండమ్మాయి గారూ ఆ ఉత్తరంలో?" అన్నది తాయారు.
మంజరి ధోరణి చూస్తుంటే, ఆ జాబులో ఏదో చెడ్డవార్తలున్నాయని తయారుకు అనుమానం వేసింది.
"ఏమీ లేదు తాయారూ! గుంటూర్లో మా అక్కయ్య ఉందిలే! అది రాసింది..."
"అంతా కులాసాగా ఉన్నారా అమ్మాయిగారూ!" అన్నది తాయారు.
'ఆఁ'అని మాత్రమే అన్నది మంజరి.
తాయారు అక్కడో క్షణంకూడా ఉండలేదు. మంజరి మూడ్స్ బావులేవని తాయారు ఇట్టే తెలుసుకొంది. అందుకని పనివంక బెట్టుకొని అవతలికి వెళ్ళిపోయింది.
ఆ రాత్రి చలపతి రాలేదు. అదృష్టవశాత్తూ వెంకటేశ్వర్లు కూడా రాలేదు. రాకుండాఉంటే బావుండునని మంజరి వేయిమంది దేవుళ్ళకు మొక్కుకొంది. పనంతా అయ్యాక తాయారు పోతానంటే మంజరి పడుకోమన్నది. కానీ తాయారు వినలేదు. తనకవతల చాలా పనులున్నాయన్నది. అవసరమైతే పొద్దుటే వస్తానన్నది. ఎంత గుచ్చి గుచ్చి అడిగినా, ఆ పనులేమిటో తాయారు నుండి చెప్పించనే లేకపోయింది మంజరి.
ఆ రాత్రి చాలాసేపటిదాకా ఆవిడకు నిద్రపట్టలేదు. రకరకాల ఆలోచనలతో మనస్సంతా ఇసుళ్ళ పుట్టలా అయిపోయింది.
"సులభంగా నిద్రపడితే బావుండును" అని చాలాసార్లు అనుకొంది.
తీరా నిద్రపట్టబెయేసరికి తెల్లవారడానికిక ఎంతో టైం లేదు.
* * * *
చలపతి ఉదయం ఎనిమిది గంటలకు ఇంటికొచ్చాడు. వస్తూనే మంజరిణి చూసి హాయిగా నవ్వాడు. ఎంతో ఉత్సాహంగా కనిపించాడు.
మంజరిని చూస్తూనే చలపతి సగం తగ్గాడు. ఆవిడింకా నిద్ర మత్తునుండి పూర్తిగా కోలుకోలేదు. కళ్ళు ఎర్రగా వాచిపోయి ఉన్నాయి. జుట్టంతా చిందరవందరగా ఉంది.
"అలా ఉన్నావేం మంజూ?" అన్నాడు చలపతి. "రాత్రి నిద్ర పోనట్లుందేం? వెంకటేశ్వర్లుగారు కూడా నాతోనే ఉన్నారు ఇప్పటిదాకా నాకోసం ఇంకెవరన్నా వచ్చారా?"
మంజరి ప్రాణం చివుక్కుమంది!
అసలు విషయం చెప్పడం ఇష్టంలేక, మాటను తప్పించేసింది. వొదిలి రాత్రులకు రాత్రులు మీరు మాయమయిపోతుంటే, నేనేంగావాలని మీ ఉద్దేశం? పగలల్లా ఎక్కడ తిరిగినా - కనీసం రాత్రి పూటనన్నా మీరింట్లో లేకపోతే ఎలా? కనీసం ఆ తాయారన్నా పడుకొంటుందంటే -అదీ వీలుకాదన్నది" అన్నది మంజరి.
