Previous Page Next Page 
పాకుడురాళ్ళు పేజి 19

కాటేజ్ లో మంచానికీ, దీనికీ తావిళ్ళు వేసి చూసింది. ఆమంచం తనెటు దొర్లితే, అటే వొంగింది. ఈ దిక్కుమాలిన మంచం పక్కలన్నీ వొరుసుకు పోతుంది. తనదగ్గర డబ్బు చేరగానే, ముందా మంచం కొనాలి. తరువాత అటువంటి గది నొకదాన్ని ఎప్పుడూ చల్లగా ఉండే గదిని ఏర్పాటు చేసుకోవాలి. దానికెంత డబ్బవుతుందో ఏమిటో....
గది జ్ఞాపకం రాగానే, ఇందాక ఆ గదిలో జరిగిన సంగతులు కూడా జ్ఞాపకం వచ్చి చలించిపోయింది మంజరి. వాటిని మరిచి పోవాలనీ, పక్కకు నెట్టాలనీ చూసిన కుందుకీ, మనసు ఆ సంఘటనల చుట్టూనే తిరగసాగింది.
"తాయారూ!"
"అమ్మా!"
"నీకేమీ భయంగాలేదూ?" అన్నది మంజరి.
"ఎందుకమ్మా భయం?"
మంజరి మరి మాట్లాడలేదు. పక్కమీద సరిగ్గా పడుకోలేక పోయింది. వంటినిండా చిరిచెమాట పోసింది. కడుపులో మంధర పర్వత తిరుగుతున్నట్టుగా వుంది పుల్లటినీళ్ళు గుండెలదాకా పొంగుకొస్తున్నాయి. దవడలకింద నీరు వూరి నోరంతా నిండుతోంది. కాళ్ళూ, చేతులూ, నములుతున్నాయి. కళ్ళు, మూసుకుపోతున్నాయి. చేపలాగా విల విలలాడి పోతూవుంది.
"ఏదండి అమ్మాయిగారూ! అంటూ తాయారు మంచంమీదకూచుని మంజరి వొళ్ళు తాకిచూసింది. జరంకూడా లేదండీ!"
"జరంకాదే!" అన్నది మంజరి.
తను చేసిన "పాడుపని" చెప్పడానికి మంజరి సిగ్గుపడింది. అలానే మరో పావుగంట గిజగిజలాడాక, భోళ్ళుమని వాంతి చేసుకున్నది. పేగులన్నీ ముక్కలు ముక్కలయి పడిపోతున్నాయేమో ననిపించింది కాసిని చల్లనినీరు పుక్కిలించి, మరికాసిని తాగి నిండా దుప్పటి కప్పుకొని పడుకొంది మంజరి.
"అదంతా బాగుచేసి నువ్వు నాదగ్గరే పడుకో తాయారు." అన్నది మంజరి.
"ఎందుకు లేండమ్మాయిగారూ!"
"నువ్వలా కాదనకు, చెప్పినట్టల్లా విను."
తాయారింకేమీ అనలేదు. మంచంచుట్టూ శుభ్రంచేసి, తడి చేతులు పమిటచెంగుకు తుడుచుకొంటూ, మంచం దగ్గరే తారట్లాడుతోంది. తాయారు మంజరి మేలుకొంటే మంచంమీద పడుకొందామని, నిద్రపోతే కింద పడుకొందామనీ తాయారు ఉద్దేశం. మంజరి ఓ పక్కగా జరిగి, "ఊఁ ఇలావచ్చి పడుకో!" అన్నది.
తాయారు భయపడుతూ భయపడుతూనే, వద్దువద్దంటూనే మంచంమీద కూచుంది. తాయారు చెయ్యి పుచ్చుకొని తన సరసనే పడుకోబెట్టుకొంది మంజరి. దాన్ని గాఢంగా కావలించుకొని కన్ను మూసింది. దాని గుండెల్లో తలదాచుకొని నిశ్శబ్దంగా రోదించింది.
యధార్ధమైన సానుభూతికోసం మానవాత్మ ఎంతగా క్షోభించిపోతుందో అప్పుడుగానీ మంజరికీ అవగాహన కాలేదు.
    
                                            *    *    *    *
ఇది జరిగిన రెండు రోజులకల్లా నవకళా చిత్రాలయావారి కార్యాలయంలో పెద్ద గొడవ జరిగింది. ఆఫీసులోని సిబ్బంది యేటూ చెప్పటానికి లేక ఉడడుగుడిచి చచ్చిపోయారు.
వెంకటేశ్వర్లుగారు మంజరికిచ్చిన వాగ్దానం ప్రకారం జానపద చిత్రం తియ్యవలసిందేనని పట్టుపట్టారు రామబ్రహ్మంగారు దీనికి ససేమిరా వొప్పుకోమన్నారు.
"ఎందుకనిట ఫోప్ లోర్ చేసిన పాపమేమిటి? సోషల్ చేసుకొన్న పుణ్యమేమిటి?" అని నిగ్గాతీశాడు వెంకటేశ్వర్లు.
"ఇందులో పాపపుణ్యాల సంగతి కాదుగా నేనంటూంట. చేతి చమురు వొదిలించుకోవడానికి ఏపిక్చరైనా వొకటే? నేననేదేమిటంటే -సోషలయితే కొద్దిలో తేలిపోతుందని. అదే ఫోన్ పిక్చరయితే రెండు సెట్లకుకూడా మన డబ్బుచాలదు. మన సంగతి కూడా చూడాలిగా అన్నాడు రామబ్రహ్మంగారు."
ఈ వాదన వెంకటేశ్వర్లుగారి కేమాత్రం రుచించలేదు. రామబ్రహ్మంగారిని నిలువునా చీల్చేసి, అడ్డంగా పాతేశాడు వెంకటేశ్వర్లు.
రామబ్రహ్మంగారేమీ మాట్లాడకపోవడం చూసి ఆఫీసులోని సిబ్బందికి గాలి ఎటుమళ్ళుతుందో బోధపడిపోయింది. అనేక సినిమా కంపెనీల్లో పనిచేసి అపారమైన అనుభావాన్ని సంపాదించిన తారకంగారు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకొన్నవారయినారు.
"చిన్నయ్యగారు చెప్పిన మాటకూడా మనం ఆలోచించవలసిందే! మనకు సిసిల్ బి.డి. మిల్లీ ఆదర్శం గానీ ఆకాయపోకాయ వెధవలు మనఛాయలకు రావడానికే లేదు" అన్నాడు తారకం.
"ఈ మిల్లీగా డెవడయ్యా! మనకాడ ఉద్యోగంగానీ కావాలిట్నా? ప్రస్తుతం ఖాళీలేమీ లేవని చెప్పు. ఏరా వెంకటేశ్వర్లూ అవసరమయితే. ఈ మిల్లీగాడి యవారం మనం తరవాత చూసుకొందాం సరేనా?" అన్నాడు రామబ్రహ్మం.
"అల్లాగేనండీ! సిసిల్ బి.డి.మల్లీకి కూడా మనం ఓ జాబ్ పారెయ్యగల మనుకోండి., మీరన్నట్టుగా అంతగా అవసరపడ్డప్పుడే చూసుకొందాం....మీకు తెలియంది లేదనుకోండి ఆ మధ్య నేను అమెరికా వెళ్లినప్పుడో ఫ్రెండ్ ను కలుసుకున్నాను, వాడు మిల్లీని కలుసుకొని మాట్లాడాడంట అతని ధ్యేయం ఏమిటంటే "కోటి డాలర్లు ఖర్చుచెయ్యి -పదికోట్ల డాలర్లు సంపాదించు" అని అంటే మరేం లేదు. రూపాయి పారేసి పది రూపాయలు తీసుకురావడమన్నమాట. ఈ ప్రపంచం మొత్తం మీద -ఏ దేశంలోనైనా సరే - అతని పిక్టర్ని కాదన్న మొనగాడు లేడు. మరో రెండేళ్ళకుడి మిల్లీ పిక్టరొస్తోందంటే ఇప్పట్నించే ధియేటర్ల దగ్గర జనం క్యూలలో నిలబడతారు. ఎందుకని? అతని ప్రొడక్షన్ వాల్యూ అటువంటిది? కళ్ళు చెదిరిపోయే సెట్టింగ్సూ, టెర్రిబుల్ ఫైటింగ్స్, హార్స్ రేసేస్, ట్రిక్ ఫోటోగ్రఫీ, డ్రీమ్ సీక్వెన్సెస్ -ఓహ్ రక్తాన్ని అలా- అలా గడ్డకట్టించేస్తాడు. కాబట్టే ఫ్రమాన్ టు క్లాస్, అతని సినిమాలంటే గంగవెర్రులెత్తడం -ఆఁహ. ఈ సనగాతులన్నీ మీకు తెలుసుననుకోండి ఏదో సమయానికి జ్ఞాపకం వస్తేను చెప్పా" అన్నాడు తారకం.
"నాకు తెలియకడుగుతాను తారకంగారూ! ఇవన్నీ ఉంటే డబ్బులొస్తాయంటారా?" అన్నాడు రామబ్రహ్మం.
"ఇంకా మెల్లిగా అంటారేమిటి బ్రహ్మంగారూ! అసలా తరహా పిక్చర్ సక్సెస్ కావడానికి ఈ మసాలా ఉండటమే కారణం! లేకపోతే ఏమున్నదని జనం విరగబడుతున్నారంటాడు?" అన్నాడు తారకం.
"ఏం చచ్చారో నాకు తెలియదు. మనక్కావలసినదల్లా లాభాలు. ఏమేం పెడితే డబ్బొస్తుందో అవన్నీ పెట్టండి. ఇప్పుడు మీరు -మిల్లీగాడి ఆటల్లో ఉంటుంటాయన్నారు చూడండి. అయిదారు గమ్మత్తులేమిటో -అవన్నీ మనదాంట్లోనూ ఉంచండి. ఏమిటంట వాడి ఘనం! అతని మొఖాన పొద్దుపొడిచిందా ఏమిటి?" అన్నాడు రామబ్రహ్మంగారు.
ఆయనగారికి కోపం రగిలిపోయింది. ఈ మాటలంటున్నప్పుడు కనీసం పదిసార్లయినా బల్లమీద బాదిఉంటాడు.
"బ్రేవో, బ్రేవో" అన్నాడు వెంకటేశ్వర్లు.
"అయితే మనం సోషల్ ఐడియా మార్చుకోవాల్సిందేనండి ఎంచాతంటే బ్రహ్మంగారూ! సాంఘిక చిత్రంలో, సెట్టింగ్స్ కి అట్టే ప్రాముఖ్యం లేదు. మహావేస్తే రెండు మూడు మేడలేస్తాం. రైలు ప్రయాణం, ఆసుపత్రి సీను, కాలేజీ, బృందావన్ గార్డెన్స్, ఓచిన్న డాన్సు, ఫినిష్ ఇంతకన్నా మనం చెయ్యడానికేమీ ఉండదు. ఈ సరంజామా అంతా ప్రతిసోషల్ పిక్చర్ లోనూ ఉంటూనే ఉంది గనక దీన్ని చూసి జనం మెచ్చుకొంటారనుకోవడం అబద్దం...ఏం వెంకటేశ్వర్లుగారూ! మీ అభిప్రాయమేమిటి?" ఆన్నాడు తారకం.
వెంకటేశ్వర్లుగారి ఉద్దేశం పూర్తిగా తెలుసుకోందే. తను సోషల్ పిక్చరు గురించి మరీ అంత తీసికట్టుగా మాట్లాడ్డం ప్రమాదమని తారకం గారికి తోచింది.
క్వైట్ రైట్. ప్రొసీడ్ అన్నాడు వెంకటేశ్వర్లుగారు సిగరెట్ అంటించి. తారకంగారు గొంతు సవరించుకొని మళ్ళా ప్రారంభించారు. ఈ లోగా బాయ్ ని పిలిచి, అందరికీ కాఫీలు తెమ్మన్నాడు.
"ఫోక్ లోర్ సంగతి అలాకాదు" అంటూ ప్రారంభించాడు తారకం గారు.
"అందులో -మామూలు మనిషి ఊహించడానిగ్గూడా లేని చిత్ర విచిత్రాలు ఎన్నో పెడతాం. బోలెడంత ట్రిక్ ఫోటోగ్రఫీ పెడతాం. పది సీక్వెన్సులో పదిరకాల డాన్సులు పెడతాం. ఇందులో అవసరమనుకుంటే -అనుకోవటమేమిటిలెండి - హీరోకూ హీరోయిన్ కూ, చెరో డ్రీమ్ సీనూ పెడతాం. విలన్ ఉన్నాడు చూడండి వాడి దగ్గర "జగదేక సుందరి" నొకదాన్ని చెరలో ఉంచి, దాన్ని, మనం హీరోచేత విడిపించేస్తాం. కామిడియన్ కు వల్లమాలిన స్కోప్ అట్టేపెడతాం. అధమ పక్షం అరడజను కత్తియుద్దాలయినా మనం ఉంచుకోవచ్చు. పాములచేత, సింహాలచేత, ఏనుగులచేత., బోలెడంత పనితీసుకోవచ్చు. ఇన్ని పనులు మనం చేసుకోవడానికి ఫోక్ పిక్టర్లో తప్ప స్కోప్ ఉండదు. ఆ తరువాత మీయిష్టం" అన్నాడు తారకం.
"మీరు చెప్పినదాంట్లో దేవకన్యలు ఎక్కడా రాలేదే!" అన్నాడు వెంకటేశ్వర్లు.
తారకంగారూ ఓక్షణం పెదవి కొరుక్కుని, కళ్ళు చికిలించి ఆలోచించి, చిన్న చితికవేసి సుతారంగా నవ్వేశాడు.
"అయ్ బాబోయ్! మీతో మాట్టాడ్డం చాలా కష్టమండోయ్ మీరింతకీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారని నేననుకోలేదు సుమా!" అన్నాడు తారకంగారు, బట్టతలను అరచేత్తో రుద్దుకుంటూ.
వెంకటేశ్వర్లుగారు హుందాగా నవ్వి, 'చూశావా' అన్నట్లు, రామబ్రహ్మంగారికేసి చూశాడు, "చూశాను" అన్నట్టుగా ఆయన తల తాటించాడు.
"చిన్నయ్యగారన్నట్లుగా మన పిక్చర్ లొ దేవకన్యలు ఉండి తీరవలసిందే! ఇందువల్ల మనకో సౌలభ్యం ఉంది. దేవలోకం సెట్టు మీద, మాంచి పకడ్భందీగా ఉన్న గ్రూపు డాన్సులు రెండు తగిలించొచ్చు. అదీగాక-డ్రెసెస్ - దేవకన్యల డ్రెసెస్ అప్ టు డేట్ గా తయారు చేయించి సెక్సప్పీల్ ఎక్స్ పోజ్ చేయించొచ్చు వరసగా ఓ యాభైమంది అమ్మాయిలకు పమిటలుతీసేసి, ఇంతిత బ్రేషియర్స్ తగిలించి, తొడలుకనిపించే పావడాలు కట్టించి, రాక్ ఎన్ రోల్ డాన్సులు పెట్టామనుకోండి. హాలు గుమ్మయిపోతుంది. అవసరమనుకొంటే, దేవలోకం సీన్లన్నీ కలర్ లొ తీసేద్దాం, ఇంగ్లాండ్ లొ మన శిష్యుడొకడున్నాళ్ళెండి -వాడికి ఫిలిం పంపించేసి, అబ్బిగా, దీన్ని కలర్ లోకి ట్రాన్స్ఫర్ చేయించి వెంటనే పంపించవోయ్" అని ఓకార్డు రాసి పారేద్దాం అలాగే-
ఈలోగా బాయ్. కాఫీలు, వక్కపొడిపొట్లాలు, సిగరెట్ పెట్టెలు, తెచ్చి పడేశాడు. తారకంగారు "అలాగే" అన్న వాఖ్యాన్ని పూర్తిచెయ్యడానికే అవకాశం లేకపోయింది.
రామబ్రహ్మంగారు కాఫీకప్పు బల్లమీద ఉంచి, చేబ్రోలు పొగాక్కాడ పాయతీస్తూ "అయితే మనం ఫోక్ లోర్ తియ్యడానికి రెడీయేగా?" అన్నాడు అందరికేసి చూస్తూ.
"ఇంకా రెడీ ఏమిట్రా నా తలకాయ. మనం అదే తీస్తాం అది తప్ప ఇంకోటి తియ్యం. ఫోక్ లోర్ మనం తియ్యలేకపోతే తట్టాబుట్టా చంకనేసుకుని "జైపరమేశ్వరా అందాం పద" అన్నాడు వెంకటేశ్వర్లు.
"మన మొచ్చింది సినిమా తియ్యడానికేగానీ, ఓ పదివేలు తగలేసుకొని పోవడానిగ్గాదు" అని ఉద్ఘాటించారు రామబ్రహ్మంగారు." అయితే సరేనండీ! ఇదే ఖాయం. ముందోకధ చూడండి. ఎవరెవర్ని బుక్ చెయ్యాలో కూడా ఇప్పుడే అనుకొంటే, తీరిపోలా?"
"తీరిపోతుందనుకోండి. కానీ, చేత కధలేందే మనం ఎంత మందినని బుక్ చేసుకోవడం. ముందీ విషయం పూర్తి కానివ్వండి. నా దగ్గర రెండు మూడు కధలున్నాయి. వాటిని వినిపిస్తాను. నచ్చితే సరేసరి. లేదా., ఇద్దరు ముగ్గురు కవులకు కబురు పెడతాను. ఇందులో బాక్సా ఫీస్ రైటర్స్ ఉన్నారు. వాళ్ళతో కాస్త పేచీ, కాలికేస్తే మెడకు మెడకేస్తే కాలికీ తగులుకొంటారు. డబ్బంతా ముందుగానే పిండేసుకొని, కధను కాస్తా మరో కంపెనీకి ఇచ్చేస్తుంటారు. వారికి పేరయితే ఉందిమరి! మనకు పేరే ముఖ్యమనుకొంటే ఈ అవస్థలన్నీ పడాలి. కాదయ్యా పేరులో ఏముంది గనక, ముష్టిపేరు కధేమంచిది కావాలనుకొంటే నాదగ్గరే ఉన్నాయి. వీటిని మించిన కధలు, ఇండియా మొత్తంమీద మీరు సంపాదించలేరని, నేను పూచీ ఇస్తాను" అన్నాడు తారకం.
"అలాగే నండీ! ఎవరయినా మనం డబ్బిచ్చి తీసుకొంటున్నాం గానీ, మహాదానం అడగటంలేదుగదా! ఇంకెవరికో పారేసే చెక్కు మీకే ఇస్తాం. మీరే కధను రాసుకురండి. రెండుమూడు రోజుల్లో స్టోరీ మీద కూచుందాం." అన్నాడు వెంకటేశ్వర్లు.
"అలాగేనండీ! ఓ నెలరోజుల్లో మనం స్టోరీ డిస్కషన్ పూర్తి చేసుకుంటే, ఆ తరువాత స్క్రీన్ ప్లే రాయడానికి ఇంకో మూడు సార్లయినా కావలిసొస్తుంది. ఈలోగా మనం కాస్టింగ్, స్టూడియో, డైరెక్టర్, మ్యూజిక్,డాన్స్ డైరెక్టర్, కెమెరామెన్, పబ్లిసిటీ చాలా చూసుకోవాలి. మనం మీనమేషాలు లెక్కిస్తూ కూచుంటే లాభంలేదు. యూనిట్ మొత్తం పాదరసంలా పనిచేసినప్పుడే ఇది సాధ్యమవుతుంది" అన్నాడు తారకం.
"అలాగే చేద్దాం. అసలలాగే చెయ్యాలికూడాను." అన్నాడు వెంకటేశ్వర్లు.
ఎవ్వరూ ఏమి అనలేదు.
తారకం గారు గొంతు సవరించుకొని, ఒకటి రెండు సార్లు ఏదో మాట్లాడబోయి, మానేశాడు.
"ఏమిటండీ?" అన్నాడు రామబ్రహ్మం.
"అబ్బే! మరేం లేదనుకోండి. నేనేమో, రెండుమూడు మాసాలనుండి, మన కంపెనీలోనే ఉంటున్నాను. ఏదో ఖర్చులకోసం అడపా దడపా తీసుకోవడం తప్ప 'ఇంత' అని ఓ ఏర్పాటేమీ లేదు. నాకైనా ఉత్సాహంగా పనిచెయ్యడానికి ఓ అంకె అంటూ తెలిస్తే బావుంటుంది. మురబ్బీగా నేను మాత్రం ఎంతకాలమని ఉండగలను చెప్పండి?" అన్నాడు తారకం.
"మీరేదో వాడుకొంటూనే ఉన్నారుగా!" అన్నాడు రామబ్రహ్మం.
"పిట్ట బెదిరినట్లుగా, పదీ పరకా తీసుకొంటున్నానని నేనేచెప్పాను గదండీ!" అన్నాడు తారకం.
"అంటే  - ఇప్పుడది చాలదన్నమాట? అవునా?" అన్నాడు వెంకటేశ్వర్లు.
"చిన్నయ్యగారు, నామనస్సును ఇట్టే కనిపెట్టేశారు. చిత్తం చిత్తం నా అభిప్రాయం అదేనండీ!" అన్నాడు తారకం.
"ఏమివ్వమంటారో చెప్పండి? పోనీ నెలకో వంద చాల్తాయా?" అన్నాడు రామబ్రహ్మం.
తారకం పకపక నవ్వాడు.
ఇహ మన మీ సంగతిని గురించి మాట్టాడ్డం మానేద్దాం మానేద్దాం నాకు సెలవిప్పించండి.
అవతల మూడునాలుగు కంపెనీలవాళ్ళు నా ప్రాణాలు తోడేస్తున్నారు, వాళ్ళందర్నీ కాదని ముష్టి వంద రూపాయలకోసం ఇక్కడ పని చెయ్యడంలో అర్ధంలేదు. మరి నేను వెళ్ళిరానా?" అంటూ తారకం లేచి నిలబడ్డాడు.
రామబ్రహ్మం నీళ్ళు నములుతూ వెంకటేశ్వర్లు కూచోమని తారకంగారికి ఆదేశించి, వెళ్ళమన్నట్లుగా రామబ్రహ్మంగారికి సైగచేసి ఈ రెండు పనులూ జరిగాక గొంతు తగ్గించి అసలు విషయం బయటపెట్టాడు.
"మీరలా కోప్పడుతుంటే లాభం తారకంగారూ! మాకు మీ సర్వీస్ కావాలి. మీకు మా డబ్బు కావాలి. ఇలాంటి కంపెనీలు మీకు బోలెడున్నాయి. మీలాంటివారు, మాకూ దొరుకుతారు....మరో చిన్న సంగతి. మిమ్మల్ని బొట్లూ కాటుకాపెట్టి పిలిచి, మా కంపెనీలో పనిచెయ్యమని మేమడగలేదు. మీ అంతట మీరే వచ్చారు. కూచుని పోతున్నారు. మీరింతవరకూ మాకు చేసిందేమీ లేదు. ఏమన్నా పనంటూ ఉంటే -ఈ రోజునుండే మొదలవుతున్నది మీరు వెడతానంటే వెళ్ళండి. ఉండదల్చుకుంటే ఉండండి. వందగదూ మా బ్రహ్మం ఇస్తానన్నది? మరో యాభై తీసుకోండి కాదూ, చాలదంటారా? ప్రొడక్షన్ బిగినయ్యాక ఇంకో యాభై కలిపి తీసుకోండి. మళ్ళా నాతో ఈ సంగతి చెప్పనవసరం లేదు. మీరే సంగతీ సాయంత్రంలోగా నాకు తెలియచేస్తే సంతోషం" అన్నాడు వెంకటేశ్వర్లు.
వ్యవహారం ఏదశ కొచ్చిందీ తారకంగారు, క్షణంలో గ్రహించారు. ఆయన విశాలంగా నవ్వుతూ "మీరన్నిసార్లు చెప్పాలా బాబూ! మీ మాట నెప్పుడన్నా కాదన్నానా? మీరలా సెలవిచ్చాక, ఆరు నూరయినా, నూరు ఆరయినా అల్లాగా జరిగిపోవలసిందే తప్ప మాట తిరగడానికే లేదు. మీ ఇష్టంవచ్చినట్లే కానివ్వండి, రేపు మన పిక్చర్ సక్సెస్ అయి, భగవంతుడి దయవల్ల, పదిలక్షలు రావాలేగానీ, మిమ్మల్ని డిమాండ్ చేసయినా, పదివేలు నజరానాగా పుచ్చుకోకుండా మానతానా?" అన్నాడు.
"గుడ్ గుడ్ తప్పకుండాను. నన్నడిగితే లాభంలో, పది పర్సెంట్ తిరుపతి వెంకన్నకూ, మరో పది పర్సెంట్ మనస్టాఫ్ కూ ఎలాట్ చెయ్యాలంటాను. స్టార్సులో ముఖ్యులైనవారికి, కార్లు కూడా ప్రెజెంట్ చేద్దామని ఉంది. ...సరే లెండి. మనదగ్గర బోలెడన్ని ప్లాన్స్ ఉన్నాయి. మెల్లిగా చూద్దాం.....మరి మీరు - అలాగే వెళ్ళిరండి" అన్నాడు వెంకటేశ్వర్లు.
తారకం గడపదాటుతుండగానే ప్రక్క గదిలోంచి రామబ్రహ్మంగారొచ్చారు.
"ఏమన్నాడ్రా?" అన్నాడు రామబ్రహ్మం.
"ఆఁ వాడిమొఖం. వాడనేదేమిటి గానీ, మరీ మీకింత మతి లేకుండా పోయిందేమిటా అని? తారకంగాడు అసాధ్యుడు.. అన్ని విషయాలూ, అంతో ఇంతో తెలిసినవాడు. ఈ ఇండస్ట్రీలో బాగా నలిగినవాడు, మనకనేక విధాలుగా పనికొస్తాడు. వంద రూపాయలిస్తానంతే ఎలా? ప్రొడక్షన్ టైం లో అరవచాకిరీ ఎంతుంటుందో నీకో ఐడియా లేదనుకుంటాను. అదంతా ఈ తారకంగాడే చూసుకొంటాడు. నీకెందుకురా, నువ్విలా చూస్తూ ఉండు. ఈ ఇండస్ట్రీ మొత్తాన్నే అలా చిటికెన వేలిమీద తిప్పేస్తాను. నాక్కావలసిందల్లా మధ్య మధ్య నువ్వు అడ్డుపుల్లలు వెయ్యకుండా ఉండటం" అన్నాడు వెంకటేశ్వర్లు.
"సరే ఏదోటి ఏడుద్దాంలేపద" అన్నాడు రామబ్రహ్మం విసుగ్గా..
"ఇంతగాడంత విసుగు పడటానికి కారణమేమిటా? అనుకొన్నాడు వెంకటేశ్వర్లు."
ఆయన కేకారణమూ తగల్లేదు.
"ఆఁ, పోనిస్తూ ఈ బ్రహ్మంగాడు లేకపోయినా నేను పిక్చర్ తియ్యడం ఖాయం. ఏదో తోడల్లుడు గదాని వస్తాయిస్తున్నాను గానీ వీడు లేనంత మాత్రాన ఆడిదిపోయేదేమీ వుండదు." అనికూడా అనుకొన్నాడు వెంకటేశ్వర్లు.
ఆ తరువాత అతనికి మంజరి జ్ఞాపకం వచ్చింది. ఆ రాత్రి యింటి దగ్గర దిగివిడచి వచ్చాక, మళ్ళా అటుకేసి పోవడ్డానికిగ్గూడా వీలు చిక్కలేదు. ఇవ్వాళో రేపో మంజరిని కలుసుకోవాలి.
మంజరిని గురించిన ఆలోచనలు రాగానే వెంకటేశ్వర్లు తన్మయుడయిపోయాడు. మంజరి గొప్ప అందగత్తేకాదు. మగవాణ్ణి సుఖపెట్టడంలో బ్రహ్మాండమైన నేర్పుకూడా ఉంది. తను మంజరి అంటే అలలది పోవడానిక్కారణం ఆనేర్పే! అందుకోసమే ఆవిడ మీద తను వందలు ఖర్చు చేశాడు. మరిన్ని వందలు ఖర్చు చెయ్యడానిక్కూడా తను సిద్దంగా ఉన్నాడు. రేపో మాపో మంజరి గొప్ప స్టార్ కావడం ఖాయం. ఆరోజున, పాతిక్కూ పరక్కూ యాక్ట్ చెయ్యమంటే వొప్పుకొంటుందా మరి? తనేమో, తన శేషజీవితాన్ని, చిత్ర కళామతల్లి అర్చనలో గడిపేందుకు నిశ్చయించు కొన్నాడాయే. ఇప్పుడే ఆవిడతో మంచిగా ఉంటే - ఇది రేపు అక్కరకొస్తుంది. తనింత డబ్బు మంజరిమీద ఖర్చు చేయడానిక్కారణం కూడా ఇదే! ఈ సంగతి - డబ్బు ఖర్చు సంగతి, రామబ్రహ్మానికి తెలుసునో లేదో, తనకు తెలీదు. తెలిసినా, తెలీకపోయినా తను మంజరిని వదలడం కల్లోనిమాట.
సరిగ్గా ఆ సమయంలోనే, మంజరి, చలపతీ, వసారాలో కూచుని, నవకళా చిత్రాలయను గురించి మాట్లాడుకొంటున్నారు.
"వేంకటేశ్వర్లూగారింకేమన్నా అన్నారా?" అన్నాడు చలపతి.
"లేదు పర్స్ ఇంటిదగ్గర మరిచిపోయి వచ్చానన్నాను. ఫర్వాలేదన్నాడు. ఏమన్నా అరుస్తాడేమోనని, బయటపడ్డాను గానీ, ఏమీ అనలేదు" అన్నది మంజరి.
చలపతి తృప్తిగా నిట్టూర్చాడు.
"ఏమీ అనడులే! అతనిధోరణే వేరు. అన్నట్లు చెప్పడం మరిచాను. శర్మ గారు నీ బొమ్మను కవరు పేజీమీద ట్రయ్ కలర్లో వేస్తున్నారు. అయిదువందలూ చేతులో పడ్డాకనే, స్ట్రెయిక్ ఆర్డర్ వేశాడు. లోపలకూడా, నాలుగైదుచోట్ల నీ బాక్సు వేశాడు. దగ్గర కూచుని, లోగడ మనం విన్న వ్యాసాన్ని మళ్ళా రికాస్ట్ చేయించాను, సెంట్రల్ పేజీలో, నీ ఫుల్ పిక్చర్ వేయించాను. చుట్టూ సెకండ్ కలర్లో బాక్స్ ఉంటుంది. మొత్తానికీ, తింటే తిన్నాడుగానీ -బ్యూటిఫుల్ గా వేస్తున్నాడోయ్!" అన్నాడు చలపతి.

 

 

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS