Previous Page Next Page 
తెల్ల గులాబి  పేజి 9

    మర్నాడు శిరీష మాములుగానే ఆరింటికి లేచి, బ్రష్ చేసుకుని వివేక్ కి కాఫీ కలిపిచ్చింది. వివేక్ కాఫీ తాగి వెళ్ళిపోయాడు. శిరీష తన రొటీన్ లో పడింది. ఆమె స్నానం, పూజ అయిపోయి, వంటగదిలోకి వెళ్ళింది.
    కిచెన్ ప్లాట్ ఫామ్ మీద అలారం టైం పీస్ ఉంటుంది. అది చూడగానే ఆమె కనుబొమలు ముడి పడ్డాయి. ఎనిమిదవుతోంది. ఆదిత్య లేవలేదేంటి? కాలేజ్ టైం అవుతోంది. బెండకాయలు కట్ చేయబోతున్నదల్లా ఆగి చాకు  పక్కన పడేసి ఆదిత్య గది వైపు వెళ్ళింది.
    "ఆదిత్యా!"
    సమాధానం రాలేదు.
    "అదీ.... టైం అవుతోంది లేవవా?" తలుపు దబదబా బాదింది.
    సమాధానం రాలేదు.
    శిరీష ఖంగారుగా మళ్ళీ తలుపు బాదింది. కొన్ని క్షణాల్లో తలుపు తెరచుకుంది. ఆదిత్య తూలిపోతూ వచ్చి తలుపు తీశాడు.
    "ఎంట్రా....! టైం ఎంతయిందో తెలుసా....? కోపంగా అనబోయిన శిరీష ఆదిత్య వాలకం చూసి, కంగారుగా లోపలికి నడిచి పడబోతున్న ఆదిత్య ను పట్టుకుంది. ఒళ్ళు మసిలి పోతోంది.
    "అయ్యో....! అదీ....! ఏమైందిరా....? సడన్ గా జ్వరం వచ్చిందేంటి? రాత్రంతా ఏ.సి వేసుకున్నావా? గాభరాగా అడుగుతూ ఏ.సి. వైపు చూసింది. ఆఫ్ లోనే ఉంది. గది కూడా పెద్ద చల్లగా లేదు. మరి వీడికి ఇంత హటాత్తుగా ఇంత జ్వరం వచ్చిందేంటి?"
    ఆలోచిస్తూనే ఆదిత్య ను పొదివి పెట్టుకుని మంచం దగ్గరగా నడిపించి మంచం మీద పడుకో బెట్టింది. తనూ మంచం చివర కూర్చుని ఆదిత్య నుదుటి మీద పడిన జుట్టు పైకి తోసి నుదురూ, మెడా చేయి వేసి చూసింది. ఆమె మనసు ద్రవించిపోయింది. ఆదిత్య కళ్ళ పక్క నుంచి నీళ్ళు కారుతున్నాయి. శిరీష తనని ముట్టుకుంటే ఒంటి మీద యేవో పురుగులు పాకుతున్నట్టుగా అనిపిస్తోంది. కానీ, ఏం మాట్లాడే ఓపిక లేదు. నడిచే ఓపిక అసలే లేదు. ఇంతకాలం ఎంతో హాయిగా అనిపించినా ఆవిడ స్పర్శ ఇప్పుడు భరించ లేనిదిగా అనిపిస్తోంది. కానీ ఆమెని దూరంగా పొమ్మని అనలేకపోతున్నాడు. అమ్మ... నా అమ్మ... ఇంకోసారి వివేక్ అమ్మని ముట్టుకుంటే , ముట్టుకుంటే చేయి కోసేస్తాను.... పళ్ళు పటపట కొరికాడు.
    ఆ శబ్దానికి ఖంగారు పడింది. "అయ్యో నా తండ్రీ! ఇంత జ్వరం వచ్చిందేంటిరా? అసలే పరీక్షలు కూడాను. చలిగా ఉందా? బ్లాంకెట్ కప్పనా? వనికిపోతున్నావు" అంటూ బ్లాంకెట్ కప్పింది. "ఉండు టాబ్లెట్ తెస్తాను." అంటూ లేవబోతున్న శిరీష చేయి గట్టిగా పట్టుకున్నాడు ఆదిత్య.
    "ఎంటిరా? ఏమైంది నాన్నా!" ఆప్యాయత, అనురాగం కురిపిస్తూ అడిగింది.
    "అమ్మా! నాకు...నాకు భయంగా ఉంది. మాటలు కూడదీసుకుంటూ అన్నాడు.
    ఎందుకురా? ఏవన్నా పీడకలలు వచ్చాయా? ఎందుకు భయం? వాత్సల్యంతో చెంపలు నిమిరింది.
    లేదన్నట్టు తల ఊపాడు. "రాత్రి నిద్ర పట్టలేదు."
    "నిద్రపట్టలేదా? మరి నేను పడుకునేటప్పుడు పిలిస్తే లేవలేదెం...?" అదిరిపడుతూ అడిగింది శిరీష.
    ఆదిత్యకి భయం వేసింది. అంటే తను నటించినట్టు అమ్మకి తెలిసి పోతుందేమో? సవరించుకుంటూ అన్నాడు." పడుకోగానే నిద్రోచ్చింది. కానీ, మధ్యలో మంచినీళ్ళ కోసం లేచాను. నిద్ర పట్టలేదు."
    శిరీష తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ అంది "అందుకే చెప్పాను. రాత్రి మరీ తొమ్మిదింటికే పడుకోవద్దు అని. పడుకునేటప్పుడు వాటర్ తాగి పడుకోవాలి కదా! సర్లే ముందు ఒక టాబ్లెట్ వేసుకొని, పాలు తాగు ... నేను ఆఫీస్ కి ఫోన్ చేసి లేట్ గా వస్తానని చెప్తాను. డాక్టర్ దగ్గరకు వెడదాం సరేనా?" మృదువుగా అంటూ లేచి తన గదిలోకి వెళ్ళబోతూ ఆగి వెనక్కి తిరిగి స్థాన భ్రంశం చెందిన టేబిల్ వైపు చూసింది.
    "ఇదేంటి టేబిల్ ఎందుకు జరిపావు?" అడిగింది. అలా అడగడం లో టేబిల్ వెంటిలేటర్ దగ్గరగా ఉందన్న విషయం గమనించలేదు. కేవలం ఉండాల్సిన చోట కాకుండా అక్కడెందుకుంది? అన్న కోపమే కనిపించింది. ఆదిత్య గాభరా పడ్డాడు కానీ, మాట్లాడలేదు.
    తనే సర్దుకుని బైటికి వెళ్తూ సణిగింది. "ఏంటో ఏదో చేస్తుంటాడు వెధవ పనులు." అంటూనే హాల్లోకి వెళ్ళి కొన్ని క్షణాల్లోనే టాబ్లెట్ మంచినీళ్ళ గ్లాసుతో వచ్చింది.
    "లే! లేచి కూర్చుని ఈ టాబ్లెట్ వేసుకో..." ఒంగి ఆదిత్య మెడ కింద చేయి వేసి నెమ్మదిగా లేపింది.
    ఆదిత్య టాబ్లెట్ వేసుకున్నాడు.
    "పడుకో పాలు తీసుకొస్తాను..."
    "ఒద్దు డొకోస్తుంది.... కాఫీ తాగుతాను."
    "కాఫీనా?' ఆశ్చర్యంగా చూసింది. కాఫీ మాట ఎత్తితేనే చిరాకు పడే ఆదిత్య కాఫీ తాగుతా అనగానే ఆమెకి ఆశ్చర్యం వేసింది.
    "అవునమ్మా...! జ్వరం వచ్చినప్పుడు కాఫీనే తాగాలి."
    "ఎవరు చెప్పారు?"
    ఆదిత్య ఒక్క క్షణం ఏం మాట్లాడలేదు.. నెమ్మదిగా అన్నాడు "ప్రఖ్య."
    "ఓ...!" నవ్వేసింది. "అదో పెద్ద ఆరిందా. నువ్వు వినేవాడివి. సర్లే కాఫీనే తెస్తాను." లేచి వెళ్ళింది.
    ఆదిత్య ఆమె వెళ్ళే వైపు చూస్తూ ఉండిపోయాడు.
    అమ్మ... తన అమ్మ... తనకి అమ్మ , అమ్మకి తను... ఊహు ...కాదు ... అమ్మకి వివేక్ అంకుల్. కానీ అమ్మకి తనంటే ఇష్టం. వివేక్ అంకుల్ అన్నా ఇష్టమే. తనంటే ప్రేమ , ఆప్యాయత, వాత్సల్యం . అంకుల్ అంటే ప్రేమ, ఇంకా కోరిక, ఇంకా ఏదో... లవ్ ....వాళ్ళిద్దరూ లవర్స్. లవర్స్ కి వాళ్ళిద్దరే కావాలి. అమ్మకి తనక్కరలేదా? తనూ, ప్రఖ్యా లవర్స్ కదా...! కాదు, కాదు , ఫ్రెండ్స్, తామిద్దరి మధ్యా లవ్ ఉందా? తను ప్రఖ్యని లవ్ చేస్తున్నాడా? ఏమో తెలియదు. అసలు లవ్ అంటేనే తెలియదు. లవ్ అంటే అదేనా? ఒకరినొకరు కౌగలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం, ఇంకా...ఇంకా ...ఆదిత్యకి ఒళ్ళంతా వణుకు మొదలైంది. ఇంకా ఏదో ఉంది. అది తనకి కావాలి. ప్రఖ్యకి కావాలి. కానీ, కానీ , అమ్మ, వివేక్ అంకుల్ అలా చేయడం బాగాలేదు. తనకి నచ్చలేదు.
    శిరీష గదిలోకి వచ్చింది. కూర్చో అంది కాఫీ గ్లాసు పట్టుకుని.
    ఆదిత్య కూర్చున్నాడు. మంచి కాఫీ పరిమళం.... పొగలు వస్తున్నాయి గ్లాసులోంచి. 
    నెమ్మదిగా సిప్ చేశాడు.
    "కాఫీ బాగుందమ్మా....! నేను రోజూ కాఫీనే తాగుతాను."
    శిరీష నవ్వింది. "సరే...! దానికేం. నీకేది కావాలంటే అదే తాగు. అవునూ ఇంతకు ముందేప్పుడన్నా తాగావా?" తానెప్పుడు ఆదిత్యకి కాఫీ ఇచ్చిన గుర్తు లేని శిరీష అనుమానంగా అడిగింది.
    "తాగాను. ప్రఖ్యా వాళ్ళింట్లో, తను కాఫీనే తాగుతుంది."
    "ఎందుకో....?"
    "ఏమో....! పెద్దవాళ్ళం అవుతున్నాంగా కాఫీ తాగాలి అంది..."
    "ఓ....! శిరీష కనుబొమలేగరేసి , పెదవి విరిచింది.
    "సరే....!" అంటూ ఆదిత్య ఖాళీ గ్లాసు ఇస్తుంటే అందుకుని మళ్ళీ ఒకసారి నుదురు చేయి పట్టుకుని చూస్తూ టెంపరేచర్ తగ్గిందిరా. రాత్రి దేనికో భయపదినట్లున్నావు. అవునా! లేక నిద్రలేక అలా టెంపరేచర్ వచ్చినట్లుంది. ఇవాళ రెస్టు తీసుకో. రేపటికి ఫ్రెష్ అవుతావు. నేను వంట చేసిపెట్టి ఆఫీస్ కి వెళ్ళనా?" ప్రఖ్యని నీకు తోడుగా రమ్మని చెప్తాను." అంటూ లేచింది.
    అడిరిపడాడు ఆదిత్య. ఇప్పుడు ప్రఖ్య ని కలవాలని లేదు. మనసంతా గందరగోళంగా ఉంది. ప్రఖ్యని అసలు కలవాలని లేదు. కలిస్తే ఏం జరుగుతుందో తనకి తెలుసు. ఆ సమయంలో మళ్ళీ వివేక్ అమ్మని ముట్టుకోడం, ముద్దు పెట్టుకోడం గుర్తొచ్చిందంటే అమ్మో....! ఒద్దొద్దు అందుకే ఖంగారుగా అన్నాడు. "ఒద్దమ్మా....! ఇవాళ ఒక్కరోజు నువ్వు నా కోసం లీవు పెట్టచ్చు కదా...!"
    "నేనా? చిత్రంగా చూస్తూ అంది. "ఎందుకురా? నాకు ఆఫీస్ లో చాలా పని ఉంది. నాన్నా, కొంచెం లేటుగా వెళ్తాలే . ఏం? మీ ఇద్దరూ హాయిగా చదువుకోవచ్చు కదా...!"
    "లేదమ్మా.... తనివాళ వాళ్ళ కజిన్ వాళ్ళింటి కి వెళ్తానంది...." అబద్దం చెప్పేశాడు.
    'అలాగా....! పోనీ నీ ఫ్రెండ్ రాకేష్ కి ఫోన్ చేస్తావా?" రమ్మని...."
    "రాకేష్ ...." ఆదిత్య ఆలోచించాడు.
    రాకేష్ వస్తే బానే ఉంటుంది... రాకేష్ మెరిట్ స్టూడెంట్ ... వాడు చదువు తప్ప మరేం ఆలోచించడు.... వాడుంటే తనకి పిచ్చి పిచ్చి ఆలోచనలు రావు. అందుకే అన్నాడు. అవును రాకేష్ కి ఫోన్ చేస్తాను..."
    "గుడ్ ఫోన్ నీ దగ్గరే ఉండాలిగా....! రాత్రి తీసుకుని నాకివ్వలేదు నువ్వు..."
    "అవును' దిండు కింద నుంచి మొబైల్ తీశాడు.
    శిరీష అక్కడి నుంచి వెళ్ళిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS