Previous Page Next Page 
ఒప్పందం పేజి 6

    "ఇంట్లో లేరు" అని టక్కున పెట్టేసింది. 
    రమ్య ఓ గంటాగి మళ్ళీ చేసింది. అదే సమాధానం. అలా ఆ రోజంతా ఎన్ని సార్లు ఫోన్ చేసినా సురేష్ కలవలేదు.
    రమ్యకి నిద్రపట్టలేదు ఆరాత్రి. తెల్లవారి లేస్తూనే హడావుడిగా తయారై సురేష్ ఇంటికి బయల్దేరింది. అడ్రస్ వెతుక్కుంటూ. ఆమె వెళ్ళేటప్పటికి హాయిగా కూర్చుని కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు. రమ్యని చూసి చాలా కంగారు పడ్డాడు.
    "నువ్వేంటి ఇలా" అన్నాడు గొంతు తగ్గించి.
    "లీవ్ పెద్తున్నట్టు నాకు చెప్పలేదేం!" కోపంగా అంది.
    అతని భార్య వచ్చి అనుమానంగా రమ్యని చూస్తూ.
    "ఎవరూ" అంది.
    "తను నా కొలీగ్....ఆ శోభా కాఫీ ఇవ్వు తన క్కూడా తడబడ్డాడు సురేష్.
    సురేష్ ఆ ఇంట్లో అతని భార్య సమక్షంలో తనతో ప్రవర్తించిన తీరుకి రమ్యకి చిరాకేసింది. ఎందుకంత భయం! ఇంత భయం ఉన్నవాడు తనతో సంబంధానికి ఎందుకు ఒప్పుకోవాలి? అందుకేనా సీక్రేసీ ఉండాలి అంటూ తనని నోరు మూయించాడు. రమ్యని బస్ ఎక్కించడానికి వచ్చిన సురేష్ మండిపడ్డాడు.
    "ఏం కొంప లంటుకు పోయాయని ఇంటి కొచ్చావు?" రమ్య నిర్ఘాంత పోయింది అతని ధోరణికి.
    "అదేమిటి సురేష్! పదిరోజులైంది నువ్వు కలిసి. కనీసం ఫోన్ చేయలేదు. పైగా లీవ్ పెట్టి ఇంట్లో ఉన్నావు. నాకేం తెలుసు? నీకు ఒంట్లో బాగాలేదో ఏమో! అని ఖంగారు పడ్డాను. ఏం మీ ఇంటికి రాకూడదా?"
    "చూడు రమ్యా! నీకిది వరకే చెప్పాను. మాంసం తింటున్నాం కదా అని ఎముకలు మెళ్ళో వేసుకు తిరగలెం. నాకేవో పనులున్నాయి. లీవ్ పెట్టాను. అందుకు నీకు సంజాయిషీ ఇవ్వాలా? నువ్వు ఫోన్ చేస్తున్నావనే రోజూ గొడవ. ఇంక ఇలా ఇంటికొచ్చేస్తే నాకు న్యూసెన్స్ అవదా?"
    రమ్య మండిపడుతూ అంది, "నేనూ నీకు చెప్పాను సురేష్! నా జీవితంలో సీక్రేసీ ఉండటం నాకిష్టం లేదని. నాకు నచ్చిన జీవన విధానాన్ని బహిరంగంగానే అనుసరిస్తానని."
    "నువ్వు తెగించావు. నీకసలు భయం లేదు. నాకో గౌరవం ఉంది. అది పాడు చేయొద్దు రమ్యా"
    రమ్య స్థాణువు లా చూసింది.
    'అంటే అంటే గౌరవం, శాంతి ఇలాంటి వన్నీ నీకే కానీ, నాకక్కర్లేదు. అంతేనా! నేను చేస్తున్నది అంత గౌరవ హీనమైన పని అని నువ్వు భావిస్తున్నావా?" నన్ను చూడకుండా ఉండలేక రోజూ ఓసారి కన్పించి వెళ్ళాలను కునే సురేషే నా నువ్వు? రోజుకు నాలుగుసార్లు ఫోన్ చేసే సురేషేనా? ఎంత మారిపోయావు!"
    రమ్య నవ్వింది. ఆ నవ్వులో ఎన్నో భావాలు. భాష కందనివి, నిర్వచనం లేనివి.
    జీవితాంతం తోడుగా నడుస్తావనుకున్నాను. ఇలా మధ్యలో వదిలేస్తావా? ఈ ప్రపంచాన్ని ఎదిరించి కలిసి బతకాలనుకున్నాం. నీ భార్యనే కన్విన్స్ చేయలేవా?
    అటో వచ్చింది. రమ్య నిశ్శబ్దంగా అటో ఎక్కింది.
    మర్నాడు సురేష్ వచ్చాడు. రమ్య ఎప్పట్లా మనసారా ఆహ్వానించలేక పోయింది. రాగానే ఆరాటంగా దగ్గరకు తీసుకుని అల్లరి చేసే సురేష్ కూడా కొంచెం ముభావంగా ఉన్నారు.
    రమ్య కాఫీ ఇచ్చింది. తాగుతూ అన్నాడు. "రమ్యా! ప్రతి శుక్రవారం ఎక్కడికి వెళ్తున్నావని తను రోజూ గొడవ. నేను వారం వారం ఇక్కడికి రావడం కష్టం అవుతోంది. నాకు వీలైనప్పుడు వస్తుంటాను."
    రమ్య నిశ్చలంగా కూర్చుని వింటోంది తన జీవనయానం లో ఆటంకాలు మొదలయ్యాయా?
    "ఇంట్లో మనశ్శాంతి ఉండటం లేదు. చూస్తూ చూస్తూ గొడవలు పెట్టుకోవడం నాకిష్టం లేదు."
    "ఈ విషయం ఆలోచించేగా సురేష్, ఆవిడతో మన విషయం చెప్పమన్నాను. కానీ నువ్వేగా సీక్రెట్ అంటూ దాటేశావు. ఇలాగే అయితే మన బంధం చిరకాలం నిలిచి ఉంటుందా?'
    సురేష్ మాట్లాడలేదు.
    రమ్య మళ్ళీ అంది "సురేష్! ఇప్పటికైనా మించి పోయింది లేదు . నన్ను నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పు"
    "మతిపోయిందా? భార్య కేవరైనా అలా చెప్తారా?"
    "చెప్పకుండా మోసం చేయచ్చా?"
    "మోసం ఎలా అవుతుంది? తనకి నేనేం అన్యాయం చేస్తున్నాను?"
    "అదే ప్రశ్న ఆవిడనే అడగచ్చుగా"
    "రమ్యా ప్లీజ్! నన్ను విసిగించకు. నావల్ల కాని పనులు చేయమని నన్ను వేదించవద్దు. నేనేం నిన్ను శాశ్వతంగా వదిలేస్తున్నానా? అర్ధం చేసుకొని కోపరేట్ చేయచ్చుగా?" విసుగ్గా లేచాడు సురేష్.
    రమ్యకి కోపం వచ్చింది. "నేనే కోపరేట్ చేయాలా? ఆమాట అక్కడ అడగలేవా?"
    "ఎలా అడుగుతాను?" తను నా భార్య."
    "ఓ! రమ్య గుండె కలుక్కుమంది. "భార్య"తనేవరు? సురేష్ భార్యేనా? భార్య ఎలా? తాళి కట్టలేదే! ఓవేళ కట్టినా ఇలాగే ప్రవర్తిస్తాడుగా.
    "నేను వెళ్తున్నాను" రమ్యని ఆలోచనల సుడిగుండంలో వదిలేసి, వెళ్ళి పోయాడు.
    రమ్య విగ్రహం లా చాలాసేపు అలాగే కూర్చుంది.
    నాలుగు రోజుల దాకా రమ్య సురేష్ కి ఫోన్ చేయలేదు. అతను రెండు మూడు సార్లు చేసినా ఆమె కలవలేదు. ఐదో రోజు సురేష్ రమ్య ఆఫీస్ దగ్గరికి వచ్చాడు. ఆఫీసు లో అందరి కళ్ళూ సురేష్ నే చూస్తున్నాయి. రమ్య వెంటనే బయల్దేరి బైటికి వచ్చింది. రమ్య వెనకాల కూర్చోగానే స్కూటర్ స్టార్ట్ చేసి అబిడ్స్ వైపు పోనిచ్చాడు సురేష్.
    "ఇటేక్కడికి?" అడిగింది.
    సురేష్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు.
    "చీర కొంటానికి" అన్నాడు.
    "ఎవరికి?"
    "నీకే....మర్చిపోయావా? ఆరో తేదీన నీ బర్త్ డే"
    నిజంగానే రమ్య మర్చిపోయింది. ఈమధ్య ఏమీ గుర్తుండటం లేదు.
    "నీకు అంత బాగా గుర్తుందా?" అడిగింది.
    "రమ్యా నీమీద నాకు ప్రేమ లేదా? ఎందుకు గుర్తుండదు. పరిస్థితులవలన కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తాయి. అంతమాత్రాన నాకు నీమీద ప్రేమ లేదనుకుంటే ఎలా?' మృదువుగా అన్నాడు.
    రమ్య మీద సురేష్ మాటలు మత్తు మందు చల్లినట్టుగా పనిచెయ సాగాయి. పాపం! తను రెండు చోట్లా నలిగిపోతున్నాడు. తనే అర్ధం చేసుకోవాలి. చదువు, సంస్కారం ఉన్న తను కూడా అతనితో దెబ్బలాడితే ఎలా?
    స్కూటర్ చందన బ్రదర్స్ ముందు ఆగింది.
    పార్క్ చేసి వచ్చిన సురేష్ తో కలిసి షాప్ లోపలికి అడుగు పెడుతున్న రమ్య ఆగిపోయింది.
    షూస్ షాపు లోంచి బైటికి వస్తోన్న ప్రమోద్ పక్కనే శ్రీధర్ . ప్రమోద్ చేతిలో రెండు క్యారీ బ్యాగ్స్.
    "ప్రమోద్" సంతోషంతో గట్టిగా అంటూ ముందుకు పరుగెత్తింది రమ్య.
    ప్రమోద్ తల తిప్పిచూశాడు. ఆశ్చర్యంతో విచ్చుకున్న అతని కళ్ళలో ఓ క్షణం కాలం ఆనందం మెరిసి మాయమైంది. గబగబా ముందు కెళ్ళి పోయాడు. ఆగిపోయి రమ్యనే ఆశ్చర్యంగా,ఆనందంగా చూస్తోన్న శ్రీధర్ ప్రమోద్ ముందు కెళ్ళడంతో అతణ్ణి అనుసరించాడు.
    రమ్య మొహం లో నవ్వు ఎగిరిపోయింది. అవమానంతో మొహం ఎర్రబడింది. కింది పెదవిని పంటితో బిగపట్టిన రమ్య మొహంలో విషాదచ్చాయలు చూసి అడిగాడు సురేష్.
    "ఎవరు వాళ్ళు?" రమ్య కొన్ని క్షణాలు మాట్లాడలేదు. తరువాత అంది.
    "మా తమ్ముడు ప్రమోద్, మేనత్త కొడుకు శ్రీధర్"
    సురేష్ మాట్లాడలేదు. ఆమె భుజం మీద చేయెసి "టేకిట్ ఈజీ" అన్నాడు. రమ్య నిశ్శబ్దంగా అలాగే నిలబడిపోయింది.
    "పద రమ్యా! ఈ సంఘటన ఇంతటితో మర్చిపో. చీర తీసుకుందాం రా,"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS