"సరేలే శనివారం వస్తాను. ఇద్దరూ ఇంట్లో వుంటారుగా మాట్లాడతాను. నువ్వింక రెస్టు తీసుకో. నైట్ డ్యూటీ చేసి వచ్చావు. మళ్ళీ సాయంత్రం ఆఫీసు కి వెళ్ళాలిగా...' అంటూ సంధ్య వెళ్ళిపోయింది.
లాలిత్య ఆలోచిస్తూ అక్కడే సోఫా లోనే వాలిపోయి కాసేపట్లో నిద్రలోకి జారిపోయింది.
వేదవ్యాస్ లాలిత్య కూడా ఒక పెద్ద కార్పోరేట్ కంపెనీ లో పనిచేస్తున్నారు. లాలిత్యది అమెరికన్ బెస్ట్ కంపెనీ . ఆమె పనివేళలు రాత్రి ఎనిమిది నుంచి తెల్లవారిందాకా వుంటాయి. వ్యాస్ ది సింగపూర్ కంపెనీ. ఉదయం పదకొండు నుంచీ ఆరింటి దాకా , అతను ఇంటికి వచ్చే టైం, ఆమె ఆఫీసు కి వెళ్ళే టైం . పెళ్ళయి కాపురం పెట్టిన ఈ రెండేళ్ళ లో వాళ్ళు సరదాగా గడిపింది ఒక వారం రోజులు. అది కూడా లాలిత్య అక్క వారిజ వాళ్ళ పెళ్ళికి గిప్ట్ గా హనీమూన్ టికెట్స్ కొనివ్వడంతో తప్పలేదు. ఊటీ, మైసూర్, వగైరా తిరిగి వచ్చారు. ఆ తరవాత లీవులు అయిపోయి ఆఫీసుల్లో రిపోర్టు చేశారు. సోమవారం నుంచీ శుక్రవారం దాకా ఇద్దరూ బిజీ. కేవలం శని, అడివారాలే వాళ్ళకి మిగిలేది. ఈమధ్య ఇద్దరికీ పని ఒత్తిడి పెరిగింది. చిరాకులు, పరాకులు కూడా ఎక్కువైనాయి. ఒకళ్ళు సర్దుకుపోవడానికి ప్రయత్నించినా , మరొకళ్ళ పంతాలతో గొడవలు వస్తున్నాయి. ఇది నాలుగోసారో, ఐదో సారో వాళ్ళు గొడవ పడడం . అందుకే లాలిత్య ఇద్దరికీ కుదరదని నిర్ణయించుకుంది. దానికి తోడూ వ్యాస్ కూడా మనకి కుదరదు విడాకులు తీసుకుందాం అనడంతో ఆమె కచ్చితమైన నిర్ణయానికి వచ్చి సంధ్యతో ప్రస్తావించింది" ఆ మర్నాటి నుంచీ వ్యాస్ తో పూర్తిగా మాటలు మానేసింది.
ఇది జరిగిన నాలుగో రోజు ఉదయాన్నే వ్యాస్ తల్లి పవిత్ర విజయవాడ నుంచి సూట్ కేస్ తో దిగింది.
ముందుగా ఏమాత్రం తెలియజేయకుండా వచ్చిన తల్లిని చూసి ముందు ఆశ్చర్యపోయినా వెంటనే అమ్మ వచ్చింది కడుపు నిండా తిండి తినవచ్చు అని మురిసి పోయాడు వ్యాస్.
"అదేంటత్తయ్యా ముందు కబురు చేస్తే రిసీవ్ చేసుకునే వాళ్ళం కదా" అంది లాలిత్యా.
"అనుకోకుండా వచ్చానమ్మా. నా స్నేహితురాలి కూతురు పెళ్ళి కూకట్ పల్లి లో అందుకని వాళ్ళతో వచ్చాను" అంది పవిత్ర.
ఆ తరవాత ఆవిడ వంటగది హ్యండో వర్ చేసుకుంది. వ్యాస్ కీ, ఇడ్లీ, వడ, ఉప్మా లాంటి రకరకాల బ్రేక్ ఫాస్ట్ లు, మంచి వంటలతో క్యారేజీ లు ఆవిడ వచ్చాక హాయిగా వుంది. అలాగే కోడలికి కూడా వద్దన్నా వినకుండా రాత్రికి డిన్నర్ ఏం తింటావు వద్దంటే ఎలా అంటూ పుల్కాలు, కూర చేసి ఇస్తోంది పవిత్ర. తల్లి వచ్చాక వ్యాస్ కొంచెం త్వరగా రావడం మొదలు పెట్టాడు ఆఫీసు నుంచి. లాలిత్య కూయా అత్తగారు వున్న ఈ నాలుగు రోజులూ త్వరగా వెళ్ళిపోతానని పర్మిషన్ తీసుకుంది ఆఫీసు లో. ఆవిడ సడన్ గా రావడంతో వాళ్ళ విడాకుల చర్చ కొద్ది రోజులు వాయిదా పడింది. సంధ్య కి ఫోన్ చేసి విషయం వివరించి ఆవిడ వెళ్ళాక ఫోన్ చేస్తాను అని చెప్పింది లాలిత్య.
లాలిత్య సాధారణంగా ఉదయం ఐదింటికి వస్తుండేది. ఇప్పుడు మూడింటికల్లా క్యాబ్ దింపేస్తోంది. అంచేత మూడు నుంచి ఉదయం ఏడింటి దాకా నిద్రపోయి లేచేయడంతో లాలిత్య కి అనుకోకుండానే తెలియని ఉల్లాసం కలగసాగింది. ఉదయం వ్యాస్ ఆఫీసు కి వెళ్ళే లోగా అత్తగారితో కబుర్లు చెబుతూ వంటలో సాయం చేయడం, మధ్య మధ్య అనుకోకుండానే వ్యాస్ తో మాటలు కలపడం జరిగింది. వ్యాస్ లో కూడా నిర్లిప్తత, చికాకు పోయి అటు తల్లితో, ఇటు లాలిత్య తో కూడా సరదాగా మాట్లాడుతున్నాడు. తమాషాగా ఆ ఇంట్లో స్తబ్ధత పోయి ఏదో ఉత్సాహం, చైతన్యం వచ్చినట్టుగా అనిపిస్తోంది. ఇద్దరికీ. నిశ్శబ్దంగా వుండే ఉంట్లో టీవీ మోగుతోంది. ఇంట్లో ఉన్నంతసేపూ పవిత్ర ఏవో తినుబండారాలు సప్లయి చేస్తూనే వుంటుంది.
శనివారం... ఇద్దరికీ సెలవు రోజు.
లాలిత్య కాసేపు అత్తగారికి వంటలో సాయం చేసివచ్చి ల్యాప్ టాప్ పెట్టుకుని కూర్చుంది.
వ్యాస్ టీవి చూస్తూ కూర్చున్నాడు. పవిత్ర వంట పూర్తీ చేసి వచ్చి అంది. "సెలవు పూట కూడా పనేంటమ్మా కాసేపు రెస్టు తీసుకోవచ్చు కదా."
లాలిత్య నవ్వింది. "కార్పోరేట్ వాళ్ళకి సెలవులు, వర్కింగ్ డేస్ అన్నీ ఒకటే అత్తయ్యా. కంపెనీ వాళ్ళు ఈ ల్యాప్ టాప్ ఇచ్చింది ఇరవై నాలుగు గంటలూ పని చేయడానికే, తప్పదు."
"ఏం దిక్కుమాలిన ఉద్యోగమో.... వేరే ఉద్యోగం చేసుకోవచ్చు కదా...."
"మనకి కావల్సినపుడు ఏం ఉద్యోగాలు దొరుకుతాయత్తయ్యా! ఏ కంపెనీ అయినా ఇంతే. టెక్నికల్ జాబ్స్ ఇలాగే వుంటాయి."
అవిడెం మాట్లాడలేదు. కొద్ది క్షణాలు తరువాత అంది" ఎక్కడి కన్నా తీసుకెళ్ళ కూడదూ నాకు విసుగ్గా వుంది."
"సారీ అత్తయ్యా.... మీరూ, మీ అబ్బాయి వెళ్ళి రండి. నాకు చాలా పని ఉంది."
వ్యాస్ చురుగ్గా చూశాడు ఆ మాటలకి. "పదమ్మా మనం వెడదాం " అన్నాడు సోఫా లోంచి లేస్తూ.
ఆవిడ పెదవి విరుస్తూ అంది... "పోనీలేరా ఆ అమ్మాయికి పని ఉందంటుంది గా ఒక్కదాన్ని వదిలేసి ఎక్కడికి వెడతాం?"
లాలిత్య కి బాధనిపించింది. రాక, రాక వచ్చిందావిడ. వచ్చిన దగ్గర్నించి పాపం ఇంటెడు చాకిరీ మీద వేసుకుని చేస్తోంది. ఒక్కరోజు ఆవిడ కోసం వెచ్చించక పోవడం ధర్మం కాదనిపించింది. వెధవపని రోజూ ఉండేదే లే అనుకుంటూ ల్యాప్ టాప్ పక్కన పెట్టి లేస్తూ అంది . "వస్తాలెండి... లంచ్ చేసి వెళ్దాం... గోల్కొండ లైట్ అండ్ మ్యూజిక్ షో కి వెళదాం."
ఆవిడ కళ్ళు మెరిశాయి. చకచకా డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ రెడీ చేసింది. ముగ్గురూ కలిసి భోజనానికి కూర్చుంటే ఆ అనుభవం కొత్తగా , వింతగా అనిపించింది.ఈ డైనింగ్ టేబుల్ వాడిన రోజులు చాలా తక్కువ. వర్కింగ్ డేస్ ఆఫీసులో, మధ్య మధ్య ఇంట్లో తిన్నా ఏదో ఇంత ప్లేటు లో పెట్టుకుని ఏ సోఫా లోనో కూర్చుని స్పూన్ తో తింటూ మధ్య మధ్య ఐపాడ్ లో మెసేజ్ లు చెక్ చేసుకుంటూ భోజనం అయిందని పించడం తప్ప ఇలా పద్దతిగా వేడి అన్నం, వేడి సాంబారు , కూర, పచ్చడి , పెరుగుతో ఇలా తీరుబడిగా కూర్చుని భోజనం చేయడం ఎంత బాగుంది అనిపించింది వ్యాస్ కీ, లాలిత్య కీ కూడా.
ఇలా తినడానికి కూడా అదృష్టం వుండాలి. ఈవిడ ఉన్నారు కాబట్టి కానీ, మళ్ళీ ఈవిడ వెళ్ళాక మాములేగా.... అయినా విడిపోతున్నాం కదా ...ఎలా వుంటే అనుకుంది విరక్తిగా.
ముగ్గురూ టాక్సీ మాట్లాడుకుని బయల్దేరారు. ముందు సీట్లో కూర్చోబోతున్న కొడుకుని "నేను వెనకాల ఎక్కలేనురా మోకాళ్ళ నొప్పి , నువ్వు వెనక కూర్చో " అంటూ తాను ముందు సీట్లోకి వెళ్ళింది పవిత్ర. తప్పనిసరి పరిస్థితుల్లో లాలిత్య పక్కన కూర్చోవాల్సి వచ్చింది వ్యాస్ కి. ఆమెకి ఎడంగా పొరపాటున కూడా తాకకుండా కూర్చున్నాడు. అతనలా కూర్చోడంతో లాలిత్య కి బాధతో పాటు కోపం కూడా వచ్చింది. ఎన్నడూ తనని తాకని వాడిలా దూరంగా కూర్చున్నాడు. అంత పనికి రాకుండా పోయానా అనుకుంది . మళ్ళీ విడిపోయే వాడితో నాకెందుకు ఎక్కడ కూర్చుంటే ఏం? ఈవిడ ఉన్నన్ని రోజులు సరిపెట్టుకోవాలి అనుకుంది.
గోల్కొండ మొత్తం తిరిగి షో మొదలయ్యే టైం కి అక్కడ చేరి లైట్ అండ్ మ్యూజికల్ షో చూశారు. ఆ జనంలో మధ్య మధ్య వ్యాస్ తనకీ, తగలడం, సారీ అంటూ దూరం జరగడం లాలిత్య కి గుండె కొస్తున్నట్టు అనిపించింది. అలాగే వ్యాస్ కి కూడా లాలిత్య అక్కడ కూడా తనతో నవ్వుతూ మాట్లాడక పోవడంతో ఈమెకి నామీద ప్రేమ పోయిందా? ఎందుకిలా దూరమవుతోంది అనిపించింది.
బైట డిన్నర్ చేసి ఇల్లు చేరేసరికి పదకొండు అయింది.
చీర మార్చుకుని నైటీ వేసుకుని వచ్చి లాప్ టాప్ పట్టుకున్న కోడలిని చూసి నొసలు ముడేసింది పవిత్ర. "పడుకోమ్మ పెందలాడే లేపుతాలే అప్పుడు చేసుకో ఆ పని" అంది.
ఆవలిస్తూ "చాలా పనుందత్తయ్య" అంది లాలిత్య.
"ఉంటె వుందిలే రేపు అడివారమేగా చేయొచ్చు పడుకో, ఆరోగ్యం పాడు చేసుకోకు. వేళకి, తిండి , నిద్ర లేని ఉద్యోగం దేనికి? ఆ సంపాదన దేనికి?" చిరాకు పడిందావిడ.
అత్తగారి ఎక్స్ ప్రేషన్స్ చూసి ల్యాప్ టాప్ మూసేస్తూ అనుకుంది లాలిత్య. అవును నిద్రవస్తోంది ఉదయాన్నే చేసుకోవచ్చు లే పని అనుకుంటూ సోఫా లో వాలిపోయింది.
"అదేంటి ఇక్కడ పడుకున్నావు. నడుం పట్టేస్తుంది. లే వెళ్ళి గదిలో పడుకో" మందలించింది పవిత్ర.
లాలిత్య లేచి వెళ్ళక తప్పలేదు. అప్పటికే వ్యాస్ మంచం మీద వాలిపోయాడు.
లాలిత్య లోపలికి వెళ్ళగానే పవిత్ర తనే తలుపు వేసి బైట నుంచి గడియ వేసింది.
లాలిత్య మంచం మీద వాలగానే మంచం కొద్దిగా కదలడంతో కళ్ళు తెరిచాడు వ్యాస్.
"సారీ డిస్టర్బ్ చేశాను. మీ అమ్మగారు గొడవ చేస్తున్నారు. తప్పలేదు ఇక్కడికి రాక" అంది లాలిత్య.
బెడ్ లైట్ వెలుగులో ఆమె మొహంలో భావాలు చదవడానికి ప్రయత్నిస్తూ సూటిగా చూసిన అతని చూపులతో ఆమె చూపులు చిక్కుకు పోయాయి. చాలాకాలం తరవాత అతి సన్నిహితంగా తగిలిన ఆమె ఊపిరి అతనికి గిలిగింతలు పెట్టింది. పక్కకు ఒత్తిగిలి కళ్ళు మూసుకోబోతోంటే అతని విశాలమైన చాతీ విశ్రాంతి తీసుకోమన్నట్టు ఆహ్వానించింది ఆమెని.
ఎవరు ఎవరి దగ్గరకు చేరారో తెలియని ఓ మైకం లో ఇద్దరూ ఒకటయ్యారు.
ఆదివారం.... పెసరట్టు బ్రేక్ ఫాస్ట్ డైనింగ్ టేబుల్ దగ్గర మూడు ప్లేట్లు వుండాల్సిన చోట నాలుగో ప్లేటు కనిపించి "ఇదేవరికత్తయ్యా" అనడిగింది లాలిత్య.
"నాకు" అంటూ వచ్చింది సంధ్య.
"అరె నువ్వెప్పుడు వచ్చావే" ఆశ్చర్యంగా అడిగింది లాలిత్య.
"ఇప్పుడే" అంటూ స్నానం చేసి ప్రేష్ గా వచ్చిన వ్యాస్ కి కరచాలనం చేస్తూ "గుడ్ మార్నింగ్" అంది సంధ్య.
"వెరీ గుడ్ మార్నింగ్ " అంటూ లాలిత్య పక్కన కుర్చీలో కూర్చున్నాడు.
"రా సంధ్యా! పెసరట్లు చల్లారి పోతున్నాయి" అంది పవిత్ర ప్లేట్ల లో వేడి వేడి పెసరట్లు అల్లం చట్నీ వేస్తూ....
చూపుడు వేలితో అల్లం చట్నీ తీసుకుని నాలిక్కి రాసుకుంటూ "చాలా బాగుందాంటీ చట్నీ.... పుల్ల పుల్లగా , తీయగా , కారంగా , అచ్చు వాళ్ళ కాపురం లా' అంది సంధ్య కొంటెగా లాలిత్యని చూస్తూ.
లాలిత్య చెక్కిళ్ళు ఎర్ర బడ్డాయి. కనురెప్పలు బరువుగా వాలిపోయాయి. వ్యాస్ ఆమె వైపు క్రీ గంట చూసి మెత్తగా ఆమె పాదం మీద కాలి వేలితో నొక్కాడు. అతని చర్యకి పులకించి పోతున్న శరీరాన్ని అదుపు చేసుకుంటూ కోపంగా చూస్తున్న లాలిత్య చెవుల్లో మంత్రాల్లా అత్తగారి మాటలు.
"ల్యాప్ టాప్ లు, ఐ పాడ్ లు వచ్చి కాపురాల్ని పాడు చేస్తున్నాయి సంధ్యా! ఈసారి ఎవరన్నా విడాకుల కోసం నీ దగ్గరకు వస్తే ముందు ఎలక్ట్రానిక్స్ గాడ్జేట్స్ బైట పారేయమని చెప్పు..."
"అంతపని చేయనులే అంటీ.... మీ కాలం ఆ కాలమైతే, రాబోయే కాలమంతా ఈ - కాలమ్ 'అంది సంధ్య.
ఏ కాలమైనా భారతీయ వివాహ వ్యవస్థని నాశనం చేసే మాయదారి కాలం కాకపొతే చాలు అంది పవిత్ర పెసరట్టు తుంచి నోట్లో పెట్టుకుంటూ.
వ్యాస్, లాలిత్య ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకుని పక్కున నవ్వుకున్నారు.
--------
