Previous Page Next Page 
వసుంధర కధలు -2 పేజి 9


    ఇప్పుడు తను అర్జంటుగా రంగాను కలుసుకోవాలి.
    విశ్వం కాఫీతగి బట్టలు మార్చుకుని రంగా ఇంటికి బయల్దేరాడు. అతడు వెళ్ళేసరికి రంగా యింటి తలుపులు దగ్గరగా వేసి వున్నాయి. కాలింగ్ బెల్ మ్రోగించి యెంతకీ యెవరూ రాకపోవడంతో అతడే తలుపులు తోసుకుని లోపలకు వెళ్ళాడు.
    "ప్లీజ్-కమిన్!"
    తియ్యని గొంతు....
    ఎదురుగా సోఫాలో కూర్చుని వుంది అనూరాధ.
    "నువ్వా?" అన్నాడు విశ్వం.
    "అవును నువ్వు రంగాకోసంవచ్చావు. నేను నీకోసం ఇక్కడ కూర్చున్నాను. రాంగానే కలుసుకోవాలంటే టూ టౌన్ పోలీసు స్టేషనుకు పరుగెట్టు. రంగా పోలీస్ స్టేషన్లో యెందుకున్నాడో తెలుసుకోవాలంటే-ఇలా వచ్చి నాకెదురుగా చేతులు కట్టుకుని నిలబడు...." అంది అనూరాధ.
    "నీకెంత ధైర్యం....?" అని అతడింకా యేదో అనబోయి ఆగిపోయాడు. అనూరాధ చేతిలో రివాల్వరుంది. అది అతడికే గురిపెట్టబడి వుంది.
    "నా ధైర్యమే నీ బలహీనత. నీ బలహీనతే నా ధైర్యం. నేను చెప్పినట్లు నా ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడు..." అంది అనూరాధ.
    విశ్వం విధిలేక ఆమె చెప్పినట్లే చేశాడు.
    "పాపం-రంగా జైలుపాలయ్యాడు. నువ్వూ జైలుపాలు కావలసినదే-నాటకంలో నైతేనేం-నా మెడలో తాళికట్టావుకదా అన్న జాలికొద్దీ నేనే నిన్ను రక్షించాను...."
    "ఏమిటి-రంగా చేసిన తప్పు...."
    "రంగా గురించి నేను నీకు చెప్పాలా?" అంది మాలతి.
    రంగాదో వింత వ్యాపారం. స్వతంత్ర భావాలు కలిగిన అందమైన యువతుల్నీ, అసహాయులైన అందమైన యువతుల్నీ వివిధ ప్రాంతాలు తిరిగి స్పాట్ చేస్తాడతను. ఆ తర్వాత అతడు కొందరిని తన మిత్రవర్గంలో చేర్చుకుంటాడు. వారికి ప్రేమ పేరు చెప్పొ, మరో విధంగానో వివాహాలు జరిపిస్తాడు. ఏ యువతీకైనా రంగా నిర్ణయించిన ప్రకారం వివాహం కాగానే ఆమె ఫోటోదేశంలో పేరెన్నికగన్న ఎన్నో హోటల్సు కి చేరుకుంటుంది.
    డబ్బు సమాజాన్ని నడిపించే పెడత్రోవల్లో వివాహిత స్త్రీలపై మోజు ఒకటి. రంగా చేతిలోని కీలుబొమ్మలైన అతడి మిత్రులు వ్యభిచారం చేయించడానికే వివాహమాడతారు. వారివద్దకు వచ్చే కస్టమర్సు కూడా బాగా డబ్బున్నవారయుంటారు. వచ్చే డబ్బులో సగం శాతం రంగాది. అయినప్పటికీ యేడాదికి లక్ష రూపాయలకు తక్కువకాకుండా యే భర్తయినా సంపాదించుకోవచ్చు. తమక్కావలసింది సంపాదించుకున్నాక భార్యను యే వ్యభిచార గృహానికో అమ్మేసినా అమ్మేయవచ్చు.
    ప్రేమ మైకంలో పడ్డ యువతులు అయినవాళ్ళకు దూరమవుతారు. అసహాయులైన యువతులకు అయిన వాళ్ళుండరు. తన వివాహ కార్యక్రమాలకు రంగా అటువంటి యువతులనే యెన్నుకుంటాడు. వారికి వివాహాలైనాక వ్యభిచారిణిలుగా మార్చడం పెద్ద కష్టంకాదు. మన సమాజంలో భర్త తలచుకుంటే భార్య చేత ఏమైనా చేయించగలడు. ప్రత్యక్షంగా అతడు చెప్పకపోయినా పరోక్షంగా అతడు సహకరించినా చాలు.
    ఈ విధంగా రంగా బాగా డబ్బు సంపాదించాడు. అతడిపైన యెవ్వరికీ అనుమానంలేదు. ఎందుకంటే బాగా పకడ్బందీగా ఉంటుందతడి పథకం.
    ఏదో నేర పరిశోధనలో డిటెక్టివ్ వెంకన్న ఓ వ్యభిచారిణిని కలుసుకుని-ఆమె నా మురికికూపంలోంచి రక్షించాడు. ఆమె ద్వారా అతడికి రంగా గురించి తెలిసింది. రంగా విషయమై అతడు తన అనుమానాలను బలపర్చుకునేందుకు సీతారామయ్యను సాయం కోరాడు. అయన కుమార్తె అనూరాధగా ఈ ఊరొచ్చింది. ఉద్యోగంలో చేరింది. అన్ని యేర్పాట్లూ డిటెక్టివ్ వెంకన్న ద్వారా జరిగాయి.
    ఈలోగా రంగా విశ్వంను తన మిత్ర బృందంలో చేర్చుకున్నాడు. కొడుకు పెళ్ళికో పదిహేను వేలు కట్నం అడుగుదామనుకుంటున్న నర్సమ్మకు రంగా పథకం బాగా నచ్చింది. ముందుగా ఓ కోడల్ని తెచ్చుకొని లక్షలు సంపాదించి అయిదారేళ్ళుపోయాక - ఇంకో కోడల్ని తెచ్చుకోవాలని ఆమె అనుకుంది.
    ఇలా విశ్వంతో పెళ్ళి జరగ్గానే అలా ఆమె ఫోటో పెద్ద హోటళ్ళలో చేరింది. వెంకన్న రంగానో కంట గమనిస్తూ అతడి గుఇర్న్చి చాలా రుజువులు సంపాదించాడు. విశ్వం, రంగాల సంభాషణలుకూడా కొన్ని రికార్డు చేశాడు.
    వెంకన్న చెప్పిన ప్లాను ప్రకారం అనూరాధ విశ్వాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఆమెకు విశ్వంపై ప్రేమలేదు. తమ పెళ్ళి ఒక నాటకమని కూడా ఆమెకు తెలుసు. వెంకన్న చెప్పిన ప్రకారం ఆమె తన బాధ్యతను నిర్వహించింది.
    ఈలోగా విశ్వం గురించి రంగా మరో సంబంధం చూశాడు. వెంకన్న ద్వారా మాలతి గుఇర్న్చి యెప్పటికప్పుడు తెలుసుకున్న అనూరాధ-"ఆ అమాయకురాలి కన్యాయం జరక్కూడదు...." అని వెంకన్నను వేడుకుంది.
    అందుకే ఫోటోలు పంపి ఆమెను హెచ్చరించడం జరిగింది.
    "అయినప్పటికీ ఆ పెళ్ళిని ఆపలేకపోయావు-" అన్నాడు విశ్వం. తను విన్నదంతా అతడికి అపరిమితాశ్చర్యాన్ని కలిగిస్తోంది.
    "అందుకేగదా - నిన్న నీ భార్యను హెచ్చరించి వచ్చాను...." అంది అనూరాధ నవ్వుతూ.
    "నీ హెచ్చరిక ఫలించలేదు. నా భార్య నాకు నిజం చెప్పేసింది. నువ్వొచ్చి వెళ్ళిన విశేషాలన్నీ చెప్పేసింది..." అన్నాడు విశ్వం.
    "అయినా ఆమెకేం నష్టంలేదు. రంగా అరెస్టయ్యాడు కదా....నువ్వింకా నీ భార్యను ఏలుకోకతప్పదు..." అంది అనూరాధ.
    "నా భార్య-నా యిష్టం..."
    అనూరాధ అదోలా నవ్వి - "నీకా స్వతంత్రం లేకుండా చేయాలనే ఈనాటకమంతా ఆడింది. మాలతి వంటి దురదృష్టవంతురాలికి మంచి సంబంధంచేయాలనే సత్సంకల్పం నాకు కలగడంవల్లనే మీ వివాహం జరిగింది. నీ గురించిన వివరాలు డిటెక్టివ్ వెంకన్నవద్ద వున్నాయి. మాలతి కేప్పుడే ప్రమాదం వచ్చినా అయన కలగజేసుకుంటాడు. అటుపైన ఇంకా పెద్ద ఆయుధం ఉండనే వుంది...." అంది.
    "ఏమిటది?" అన్నాడు విశ్వం కంగారుగా.
    "మన పెళ్ళి ఫోటో! మలతికేమన్యాయం జరిగినా అది బయటకు వస్తుంది. నువ్వెక్కడ మరో పెళ్ళి ప్రయత్నం చేసినా అనూరాధ నిన్ను వెంటాడి వేటాడుతుంది. బుద్దిగా మాలతితో కాపురం చేసుకున్నావూ-నీకు మనోరమే తప్ప అనూరాధ కనపడదు. అర్ధమయిందా?"
    విశ్వం తలూపాడు.
    "అన్నట్లు మరో విషయం. నీ అసలు ఉద్దేశ్యం తెలియకపోవడంవల్ల కానీ కట్నం అడక్కుండా, పైసా ఖర్చులేకుండా తన్ను పెళ్ళి చేసుకున్నందుకు నిన్నారాధిస్తోంది నీ భార్య మాలతి. అర్హత లేకున్నా అది నీ అదృష్టం. నీ భార్యకు నిజం చెప్పకపోవడమొక్కటే ప్రస్తుతానికి నేను చేయగల ఉపకారం...."
    "మరి నేను వెళ్ళొచ్చా?"
    "రంగా దగ్గరకు వెళ్ళకు. ఇంటికే వెళ్ళు..." అంది అనూరాధ.
    విశ్వం వెనక్కు తిరిగాడు.
    "ఒక్క మాట గుర్తుంచుకో. నువ్వు మళ్ళీ అనూరాధను చూడవు. చూస్తే మనోరమనే చూస్తావు..." అంది అనూరాధ.
    "అర్ధమైంది-"అంటూ విశ్వం అక్కణ్ణించి బైట పడ్డాడు.
    ఇప్పుడు తనేం చేయాలి?
    రంగాను కలుసుకోవాలంటే అతడిప్పుడు నేరస్థుడు.
    ఇంటికి వెళ్ళాలంటే-ఇప్పుడొచ్చిన కోడలు శాశ్వతంగా తనకు కోడలు కాబోతోందని-తమ జీవితం యెప్పటికీ ఇదేవిధంగా వుండబోతోందనీ-తెలిస్తే-తల్లి ఇంట్లో సుఖశాంతులు లేకుండా చేస్తుంది.
    అయితే వీటన్నిటి మధ్యా మాలతి అమాయకమైన చిరునగవు అతడికి గుర్తుకొస్తూనే వుంది,-" అర్హత లేకున్నా అది నీ అదృష్టం-" అన్న అనూరాధ హెచ్చరికా అతడి చెవుల్లో గింగురుమంటోంది.

            
                                -:అయిపోయింది:-


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS