స్కెలిటన్ గ్రూప్
---వసుంధర
"ఇవెక్కడి ఎండలు బాబూ?" అన్నాడు గోపాలం.
చాలా కాలం తర్వాత అతను వేసవిలో కాకినాడ వచ్చాడు. అతడు ఉద్యోగరీత్యా ఉత్తరహిందూస్థానంలో వుంటున్నాడు. అతడుండే ప్రాంతంలో ఎండలు మరీ అతి తక్కువ కాకపోయినా-ఇలా వళ్ళంతా జిగురు జిగురుగా అయిపోయేలా చెమటలు పట్టవని అతడు శేఖరంతో అన్నాడు.
శేఖరం ఆరోగ్యంపాడై ప్రాణంమీదకు వచ్చింది. అతడు చచ్చిపోతాడనే అంతా అనుకున్నారు. గోపాలం అతడి ప్రాణస్నేహితుడు. గోపాలాన్ని ఓసారి చూడాలని వున్నదని శేఖరం కబురు పంపించాడు. గోపాలం వున్నవాడున్నట్లు వచ్చి కాకినాడ వాలాడు. అయితే అప్పటికి శేఖరం గండం గడిచి బయటపడ్డాడు.
శేఖరానికీ, గోపాలానికీ మధ్య మరో బంధమేర్పడనున్నది. శేఖరం చెల్లెలు దుర్గ గోపాలాన్ని ఆకర్షించింది. తన ఆకర్షణకు ప్రేమ అని పేరు పెట్టడమేకాక స్నేహితుడికి చెప్పుకున్నాడు గోపాలం.
ఈ ప్రేమను శేఖరం ఆమోదించడంకంటే-ఆ అదృష్టానికి ఆనందపడ్డా డనడం సబబు. ఎందుకంటే గోపాలం రెండుచేతులా సంపాదిస్తున్నాడు. అయినా వాళ్ళింకెవ్వరూ లేరు.
మిత్రుడు మృత్యుగండం నుంచి తప్పించుకోగానే గోపాలం మనసు దుర్గమీదకు లాగింది. అతడామెతో మాట్లాడడంకోసం తహతహలాడుతున్నాడు. అయితే ఆమె అతడికి ఏకాంతంలో దొరకడంలేదు. ఒకేఒక్క సారి దొరికింది. అప్పుడతడేదో అనబోయేలోగా దుర్గ-"అబ్బ-చెమట వాసన-"అని ముఖంలో అదోరకం భావం వ్యక్తంచేసింది.
ఆమె ఆ మాట అన్నప్పుడు ఇద్దరికీ మధ్య మూడుగజాల దూరం ఉన్నది. నిజానికి చెమట వాసన దుర్గవంటినుంచి కూడా వస్తున్నది. అందువల్ల గోపాలం కాస్త ఫీలయ్యాడు. అప్పుడే అన్నాడు-"ఇవెక్కడి ఎండలు బాబూ?" అని.
అలగనడంలో అతడి ఉద్దేశ్యం తనవద్దనుంచి వచ్చే చెమట వాసనకు వాతావరణమే కానీ తన అపరిశుభ్రత కాదని ఆమెకు తెలియజెప్పడమూ-ఆ ఎండలు తననూ, ఆమెనూ ఒకేవిధంగా బాధిస్తున్నాయని సూచించడమూ!
అందుకు దుర్గ ఏమీ అనలేదు. అదోలా నవ్వి అతణ్ణి తప్పించుకుని వెళ్ళిపోయింది. వచ్చిన ఓ మంచి అవకాశం ఇలా పోవడంతో గోపాలం హతాశుడయ్యాడు.
అతడు మొత్తం వారం రోజులు సెలవుపెట్టాడు. అందులో రెండు రోజులు ప్రయాణానికి పోయాయి. మరో రెండు రోజులు ప్రయాణానికి పోతాయి. అనగా మూడు రోజులు మిగిలాయి. వాటిలో రెండవ రోజు నడుస్తున్నదిప్పుడు.
శేఖరం అనారోగ్యం పేరు చెప్పి ఇంటిలో చాలా మంది శేఖరం బంధువులు చేరారు. ఒక్కొక్కరే వెళ్ళి పోతున్నప్పటికీ మిగిలినవారి సంఖ్య గోపాలానికి ఇబ్బంది కలిగించేదిగానే వున్నది.
గోపాలం ఆ సాయంత్రం శుభ్రంగా స్నానంచేశాడు. అదృష్టవశాత్తూ వున్నట్లుండి గాలివీచడం ప్రారంభమయింది.
అతడు మళ్ళీ దుర్గను అన్వేషించి పట్టుకున్నాడు. ఆమె అతణ్ణి చూసి ఇబ్బందిగా నవ్వింది.
"ఇప్పుడు నావద్ద చెమటవాసన లేదు-" అన్నాడతను.
"కానీ నావద్ద వున్నది-" అంటూ ఆమె అక్కణ్ణించి వెళ్ళిపోయింది. గోపాలం ఆమె దారికి అడ్డంగా నిలబడ్డాడు.
ఆమె కదలకుండా అలాగే నిలబడిపోయింది.
"నేను నీతో మాట్లాడాలి-" అన్నాడు గోపాలం.
దుర్గ మాట్లాడలేదు.
"నీకు నేనంటే ఇష్టముందో లేదో చెప్పాలి-"
అప్పుడు దుర్గ సిగ్గుపడింది.
"ఇష్టమే కదూ-" అన్నాడు గోపాలం.
"ఊఁ" అన్నది దుర్గ.
"నువ్వు నన్ను పెళ్ళిచేసుకుంటావా?" అన్నాడు గోపాలం.
"ఛీ-" అన్నది దుర్గ.
"ఛీ అనొద్దు-ఇష్టమోకాదో చెప్పు-" అన్నాడు గోపాలం.
"నేను చెప్పను-" అన్నది దుర్గ.
"ఎందుకని?"
"నాకిష్టంలేదు-"
గోపాలం ఉలిక్కిపడి-"నన్ను పెళ్ళిచేసుకోవడం నీకిష్టంలేదూ?" అన్నాడు.
"అది చెప్పడం నాకిష్టంలేదు-" అని తుర్రున పారిపోయింది దుర్గ.
గోపాలం తెల్లబోయాడు. అయితే తనకు కాస్త దూరంలో ఓ వ్యక్తి తనను గమనిస్తూన్న విషయం అతడికి తెలియదు.
2
"దుర్గా!" అన్నాడతను కాస్త కోపంగా.
"ఏం బావా-అంత కోపంగా వున్నావు-" అంది దుర్గ.
"కోపమంటే కోపమే మరి-వాడికి నీతో అంత చనువేమిటి?"
"వాడంటే-"
"వాడే-ఆ గోపాలంగాడు...
"గోపాలమా?" అంది దుర్గ - "నా అన్నయ్య అతడికే నన్ను ఇచ్చి పెళ్ళిచేయాలనుకుంటున్నాడు...."
"నీ అన్నయ్య అనుకుంటే నీకిష్టమేనా?"
దుర్గ తమాషాగా నవ్వి ఊరుకుంది.
"అలా నవ్వడంకాదు. నువ్వు నన్ను చేసుకుంటావో-వాణ్ణి చేసుకుంటావో ఈ క్షణమే తేలిపోవాలి-" అన్నాడతను.
"అన్నయ్య కట్నమివ్వడు. నేను అన్న మాట కాదనలేదు. మీ నాన్నకు కట్నం కావాలి. నువ్వు తండ్రిమాట కాదనలేవు. మన పెళ్ళి ఎలా జరుగుతుది?"
"ఎలాగో జరుగుతుంది! ముందు నేనంటే నీకిష్టమో కాదో చెప్పు-"
"ఆ మాట పెళ్ళయ్యాక చెబుతాను-" అని దుర్గ అక్కణ్ణించి వెళ్ళిపోయింది. ఆమె వెంట నడువబోయిన ఆమె బావ వెనుకనుంచి తన భుజంమీద ఎవరిదో చేయి పడటంతో వెంటనే ఆగి వెనక్కు తిరిగాడు.
శేఖరం నవ్వుతూ-"దుర్గ నా చెల్లెలు-" అన్నాడు.
అతను-"నాకు తెలుసు-" అన్నాడు.
"నేను నిన్ను ద్వేషిస్తున్నాను-" అన్నాడు శేఖరం.
"నాకు తెలుసు-" అన్నాడతను.
"నీకు తెలియని దొకటుంది-" అన్నాడు శేఖరం.
"ఏమిటది?"
"అది నాకూ తెలియదు-" అని వెళ్ళిపోయాడు శేఖరం.
దుర్గ బావ అక్కడే నిలబడిపోయి శేఖరం మాటల్లోని ఆంతర్యం ఆలోచిస్తున్నాడు.
తను దుర్గ విషయంలో అదుపు దాటితే తనేం చేస్తాడో తనకే తెలియదని శేఖరం తన్ను హెచ్చరించాడా?
3
"నడివీధిలో పడకలేమిట్రా?" అన్నాడు శేఖరం.
"నీకైతే ఇంట్లో పడుకోవడం ఎలాగూ తప్పదు. నాకేం కర్మ-నిన్న రాత్రి వుక్కిపోయాను. ఈ రోజు ఏమైనా సరే వీధిలో పడుకోవలసిందే-" అన్నాడు గోపాలం.
