Previous Page Next Page 
వాస్తవ గాధలు పేజి 4


    "అయన నా దోవకు అడ్డు తగులు తున్నాడు."
    "అలాగా?"
    "ఇవాళ పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు."
    రమణ కు కోపం వచ్చింది.
    "ఏమన్నాడేమిటి?"
    "నాతో సినిమాకి రాకూడదా? రమణ తో మాత్రం స్నేహంగా ఉంటావెందుకు? ఏమిటో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు."
    "ఆదా సంగతి." రమణ కు ఎక్కడ లేని కోపం వచ్చింది.
    "ఈ సంగతి మీతో నేనిన్నాళ్ళు చెప్పలేదు. నన్ను మహా వేధిస్తున్నాడు. వీధిలో నా వెనకాలే వస్తాడు. మరీ పక్కగా వచ్చి నా ముందుకు వెడతాడు. నా వైపు ఉరిమి చూస్తాడు. సైగలు చేస్తాడు. ఇవాళ వ్యవహారం కొంచెం ముదిరింది."
    "ఒక డోషివ్వక పోయావా వాడికి?"
    "ఇవాళ అలాగే బెదిరించాను. అందుకేమన్నాడో తెలుసా?-- 'నీకూ రమణ కూ మధ్య ఉన్న సంబంధాన్ని' ఊరంతా చాటింపు వేస్తాను."
    రమణకు కోపం వచ్చింది. "అంత దూరం వరకూ వచ్చాడన్నమాట" అని పళ్ళు కొరికాడు.
    ఆ సాయంకాలం గదికి రాగానే గోపీని ఒక మూలకు (ఒంటరిగా) తీసుకు వెళ్లాడు రమణ. "ఎందుకిలా చేస్తున్నావ్?' అని కోపంగా అడిగాడు.
    "ఏం చేస్తున్నాను?' అన్నాడు గోపీ.
    జరిగిన విషయమంతా వివరించాడు రమణ. గోపీ మౌనంగా విన్నాడు.
    చివరికి రమణ, "ఆమెతో ఎందుకలా మాట్లాడావ్?' అని అడిగాడు.
    "నాకందుకు హక్కు లేదా ? నీకు దొరుకుతున్నది నాకు మాత్రం దొరక్కూడదా?' అన్నాడు గోపీ.
    "ఎమంతున్నావ్? నిర్మలని భాగం పంచ మంటావా? ఆమె నా ప్రేయసి. ఆమెనే నేను పెళ్లి చేసుకుంటాను!" అరిచాడు రమణ.
    అతని కోపం గ్రహించి ఒక్కసారి గోపీ అతన్ని ఎగాదిగా చూశాడు. ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. కాని, కొంచెం భయపడ్డాడు.
    మళ్లీ ఒకసారి ఇలాంటి సంఘటనే జరిగింది. అప్పుడు రమణ గోపీ తో పోట్లాటకు దిగాడు. గోపీని ఒక మూలకు తీసుకు వెళ్లి, "ఇలా చేశావంటే నాకు చెడ్డ కోపం వస్తుంది. నిర్మలని సమీపించకు" అని గట్టిగా మందలించాడు.
    రమణ బెదిరింపుల కేమీ గోపీ భయపడలేదు. అతనిలో ఒక తీవ్ర వాంచా, దాన్ని సాధించాలనే కోరికా కలిగాయి. నిర్మల రమణ కు వశమవడాన్ని అతను భరించలేక పోయాడు. డాబా మీద నించుని నిర్మల ఒంటరిగా ఎక్కడికైనా వేడుతుందే మో అని గమనించే వాడు. అలా ఆమె వెడితే, ఆమెను అనుసరించేవాడు. కావాలని ఆమెను మాటల్లోకి దింపేవాడు. రమణ తో సంబంధం ఉంచుకున్న కారణాన ఆమె తనను బెదిరించలేదని గోపీకి తెలుసు. ఆమె బలహీనతను వినియోగించు కోవాలను కున్నాడు.
    ఇంకా ఒక నెల గడిచింది. రమణా, గోపీ పైకి మాట్లాడుకునే వారు గాని లోలోపల మాత్రం వాళ్ళల్లో ద్వేష భావం పెరిగింది. ఇది తక్కిన స్నేహితులకు తెలియదు.
    ఒకనాటి సాయంకాలం అయిదున్నర ఆ ప్రాంతాల ఎక్కడెక్కడో తిరిగి బజారు మీదుగా వస్తున్నాడు రమణ. ఎదురుగా నిర్మలా, ఆమె స్నేహితురాలు రావడం చూశాడు. ఆమె అతన్ని చూడలేదు. సినిమాకి వెడుతుంది కాబోలు అనుకున్నాడు.
    మళ్లీ తిరిగి చూశాడు. నిర్మలకు వెనకాల కొంచెం దూరంలో గోపీ ఉండడం గమనించాడు. రమణకు చాలా కోపం వచ్చింది. దారిలోనే అడ్డగిద్దమా అనుకున్నాడు. కాని అలా చెయ్యలేదు.
    అంతలో నిర్మల చెయ్యి చూపించి బస్సు ఆపి, ఎక్కడం చూశాడు రమణ. వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చి గోపీ కూడా బస్సు ఎక్కాడు. రమణ కేమీ పాలు పోలేదు. బస్సు కనిపించేంత వరకూ అక్కడే నిలబడ్డాడు. 'ఆమె వెనకాల వీడూ సినిమాకి బయలుదేరాడు. రాత్రికి రానీ' అనుకుంటూ గదికి బయలుదేరాడు.
    గది చేరుకున్నాడు రమణ. ఏమీ తోచలేదు. పైకీ కిందికీ పచార్లు చేశాడు. ఆశ్చర్యం! ఆరోజు గదిలోని తక్కిన ఇద్దరు స్నేహితులు కూడా సినిమాకి వెళ్ళారు. గది ఖాళీగా ఉంది.
    రాత్రి పదిన్నర . కింద అడుగుల సవ్వడి వినిపించింది. ఆ సవ్వడి ని విన్నాడు రమణ. పైకి ఎవరో వస్తున్నట్లు తెలుసుకున్నాడు. తలుపు తట్టిన చప్పుడయింది. తలుపు తెరిచాడు. గోపీ లోపలికి వచ్చాడు. దీపం వేశాడు రమణ. కోపంగా గోపీ వంక చూశాడు.
    "ఎక్కడికి వెళ్ళావ్?' అడిగాడు కోపంగా.
    "ఆ విషయం నీ కనవసరం " అన్నాడు గోపీ.
    "నా నిర్మల వెనకాలే నువ్వు వెళ్లావు. నాకు తెలుసు. ఎందుకలా వెళ్ళావ్?'  
    "నీ ఇష్టమా " అంటూ రమణ గోపీ చెయ్యి లాగాడు. ఇద్దరి చేతులూ కలిశాయి. వాళ్ళిద్దరి జీవితాలలోనూ ఆరోజు ఒక దుర్దినం.
    రాత్రి పదకొండు. సినీమాకి వెళ్ళిన తక్కిన ఇద్దరు స్నేహితులూ గదికి తిరుగు ముఖం పట్టారు. మామూలుకు భిన్నంగా గదిలో లైటు వెలగడం వాళ్ళు దూరం నుంచి చూశారు. కాని మెట్లు ఎక్కుతుండగా లైటు లేదు. రమణ వాళ్ళ కెదురు పడ్డాడు. ఒక్కసారిగా శ్వాస కొట్టుకుంది. వాళ్ళను చూడడం తోనే "టీ తాగి వచ్చేస్తాను" అంటూ గబగబా మెట్లు దిగి కిందికి వెళ్లాడు.
    స్నేహితులు గదికి చేరుకున్నారు. లోపల ఒకటే చీతకి, లైటు లేదు. స్విచ్ వేశారు. లైటు వెలగలేదు. ఆశ్చర్యపోయారు. దీపం హోల్తర్ ని తాకి చూశారు . అందులో బల్బు లేదు. మరీ ఆశ్చర్య పోయారు. మంచం మీద బల్బు ఉన్నట్టు లీలగా కనిపించింది వాళ్ళకు. దాన్ని హోల్డర్ కు పెట్టి , స్విచ్ వేశారు. అటూ ఇటూ చూశారు. 'అయ్యో!' అని అరిచారు. వాళ్లను భయం ఆవహించింది. వెంటనే తలుపు దగ్గరికి వెళ్లారు. నేల మీద గోపీ చచ్చి పడి ఉన్నాడు. అతని చుట్టూ రక్త ప్రవాహం, కళ్ళు లోతుకు పోయినాయి.
    "హత్య! హత్య!" అని అరుస్తూ వాళ్ళు కిందికి పరుగెత్తారు. చుట్టూ పక్కల వాళ్ళని పిలుచుకు వచ్చారు. పోలీసుల్ని రప్పించారు. విషయం తెలుసుకుని రమణను వెతకడం మొదలు పెట్టారు.
    గదిలో జరిగిందేమిటంటే -- నిర్మల వెనకాలే సినీమాకి వెళ్లి గదికి తిరిగి వచ్చిన గోపీకి రమణ కూ మధ్య మాటలు పెరిగాయి. చేతులు కలిశాయి. ఉన్నట్టుండి రమణ తన చాకుని బైటికి తీశాడు. కోపంలో గోపీ కంఠం మీద రొమ్ము మీదా చాకుతో పొడిచాడు. గోపీ కింద పడిపోయాడు. కొంచెం సేపు యాతన పడ్డాడు. నెత్తురు పోవడం తోనూ, షాక్ తినడం తోనూ కొన్నినిమిషాల్లో నే అతను ప్రాణాలు విడిచాడు.
    గోపీ మరణం చూసి రమణ ఉలికి పడ్డాడు. ఇలా జరుగుతుందని అతను అనుకోలేదు. గోపీని గాయ పరచాలన్నదే అతని ఉద్దేశం. తరువాత ఏం చేయడానికి తోచలేదు. ఒళ్ళు వణికి పోయింది. ఏడుపు వచ్చింది. కళ్ళు బైర్లు కమ్మాయి.
    మేడ మెట్లు దిగాడు. పరిగెత్తుతూ, నడుస్తూ నగరం శివార్లు చేరుకున్నాడు. శ్వాస వేగంగా కొట్టుకుంది. ఒక మూల భయం, శరీరం తన వశం తప్పింది. చచ్చిపోవడం మంచిదను కున్నాడు. నల్లుల మందు మింగి మరణించడానికే నిశ్చయించు కున్నాడు, కొట్టు కోసం గాలించాడు. ఆ అర్ధరాత్రి వేళ కొట్లన్నీ మూసి ఉన్నాయి. పైగా, ఏ వైపు చూసినా పోలీసులు తన కోసం తిరుగుతున్నట్టు ఒక భయం. పాడుబడ్డ ఒక గోడ దగ్గర ఆ రాత్రి గడిపాడు.
    తెల్లవారింది. రమణ ధైర్యం తెచ్చుకున్నాడు. నగరం వైపు నడిచాడు. ఒక పోలీసు స్టేషన్ కి వెళ్లి పోలీసులకు లొంగి పోయాడు.
    విచారణకు తరువాత ఈ హత్యకేసు కోర్టుకి వచ్చింది. హత్యకు ప్రధానమైన కారణం రమణ -- నిర్మల ల సంబంధమే. ఈ సంగతిని వెల్లడి చేస్తే ఒక యువతి భావి జీవితం పాడయి పోతుందని పోలీసులు భావించారు. నిర్మల తలిదండ్రులు కూడా అదే విధంగా వాళ్లకు తెలియ జేశారు. కాగా, హత్యకు కారణం 'ఒక యువతి' అని కేసుని బనాయించ లేదు. గోపీకి స్కూల్లో ఆరువందల రూపాయల స్కాలర్ షిప్ వచ్చిందనీ, అది రమణ కు రాలేదనీ, ఆ ఈర్ష్య కొద్దీ అతను గోపీ ని హత్య చేశాడనీ వివరించారు.
    విచారణ సందర్భంగా ఈ స్కాలర్ షిప్ ఉదంతాన్ని న్యాయమూర్తి అంగీకరించలేదు. హత్యకు కారణం తెలియరాక పోయినా, నిందితుడే హత్య చేశాడనడానికి చాలినంత ఋజువు లభించిందని చెప్పి, రమణకు యావజ్జీవ శిక్ష విధించారు.
    ఇలా ఇద్దరు స్నేహితుల జీవితాలు చిన్నాభిన్న ము లైనాయి.
    జైలు లో రమణ అయిదేళ్ళు గడిపాడు. ఈ అయిదేళ్ళూ మంచిగా ఉండి, మంచివాడ నిపించు కున్నాడు. తాను చేసిన నేరానికి విచారించాడు.
    జైల్లో ఉన్నా అతను నిర్మలను మరిచి పోలేదు. ఆమెను నిజంగానే ప్రేమించాడు. ఆమె కూడా అలాగే అతన్ని ప్రేమించింది.
    ఒక సంవత్సరం తరువాత నిర్మల నుంచి అతని కోక ఉత్తరం వచ్చింది.
    "మీకు యావజ్జీవ శిక్ష పడింది. విడుదల అయి వచ్చేందుకు ఇంకా పదిహేనెళ్ళవుతుంది. అంతదాకా నేను పెళ్లి చేసుకోకుండా ఎలా ఉండగలను? కనక నేను పెళ్లి చేసుకుంటున్నాను. మీరు నన్నాశీర్వదించాలి." విచారంతో వ్రాసింది నిర్మల.
    ఉత్తరం చదువుతూ కంట తడి పెట్టాడు రమణ. ఆమె వ్రాసింది సబబే అనుకున్నాడు.
    కాని, విధి మరోలా చేసింది.
    నిర్మల వద్ద నుంచి ఉత్తరం వచ్చిన ఒక్క ఏడాది తరవాత గాంధీజీ శత జయంతి వచ్చింది. శిక్ష లో మూడింటి లో ఒక వంతు జైలు లో ఉన్నవారిని విడుదల చెయ్య వచ్చునని ఉత్తరు వయింది. కనక రమణ విడుదల అయి బయటికి వచ్చాడు.
    కంట తడి పెడుతూ అతను బయటికి వచ్చాడు. అంతకు క్రితమే నిర్మల వివాహం జరిగి ఉంటుందని అతనికి తెలుసు.
    'ఇంత త్వరగా విడుదల అవుతానని ఇద్దరికీ తెలియక పోయింది గదా' అని అనుకుని బాధ పడ్డాడు.
    ఊరికి వెళ్ళిన తరవాత ఆమెను కలుసుకున్నాడా? ఏ స్థితిలో ఆమెను చూశాడు? మానసికంగా ఎంత బాధ పడ్డాడు?-- అనేవి ఎవరికీ తెలియవు.

                              *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS