Previous Page Next Page 
వాస్తవ గాధలు పేజి 3


                                      అర్ధరాత్రి వేళ

                 
    రాత్రి తోమ్మిదయినా రమణ గదికి రాలేదు. ఇది చూసి అతని స్నేహితుడు గోపీనాద్ ఆశ్చర్యపోయాడు.
    ఇలా ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, మూడు నెలలుగా రమణ గదికి సరిగ్గా రావడం లేదు. ఇన్ ష్టిట్యూట్ నుంచి ఆరింటి కల్లా గదికి రావచ్చు. ఏదన్నా పని ఉంటె , ఏడింటి లోపల రావచ్చు. కాని చాలా రోజులుగా తొమ్మిది దాటిన తరవాత గాని రమణ గదికి రావడం లేదు. ఇది గోపీకి ఆశ్చర్యం కలిగించింది.
    అతను ఆలోచించాడు రకరకాలుగా. కాని కారణం మాత్రం అంతు చిక్కలేదు. రమణ తన బాల్య మిత్రుడు. ఇద్దరూ ఒకే తరగతి లో చదివి, ఒకే సంవత్సరం లో ఎస్. ఎస్. ఎల్. సి పరీక్ష పాసయిన వారు. ఇప్పుడు పాలిటెక్నిక్ చదువు తున్నారు. ఒకే గదిలో ఉంటున్నారు. వాళ్ళిద్దరి మధ్యా రహస్యాలేమీ లేవు. అలా ఉంటున్నప్పుడు రమణ ఎందుకిలా చేస్తున్నాడా అని ఆశ్చర్యపోయాడు గోపీ.
    కొన్నాళ్ళు గా నేనొక "హీరో నవుతాను" అని రమణ సగర్వంగా అనసాగాడు. మామూలు కంటే ఎక్కువగా డ్రెస్ చేసుకునేవాడు. అతని వైఖరి అదోలా కనిపించింది.
    "వీడేమన్నా ప్రేమలో పడ్డాడా?' అనుకున్నాడు గోపీ. 'ఏమయితే నేం ఏం చెప్పడం లేదే వీడు' అని నొచ్చుకున్నాడు.
    రాత్రి పదయింది. రమణ ఇంకా రాలేదు. గోపీ పడుకున్నాడు. వాళ్ళు కాక ఆ గదిలో ఇంకా ఇద్దరు విద్యార్ధులుంటున్నారు. వాళ్లూ నిద్రపోయారు. గోపీకి నిద్ర రాలేదు. రమణ కోసం ఎదురు చూస్తున్నాడు.
    గడియారం పదకొండు కొట్టింది. గది తలుపు మెల్లగా తెరుచుకుంది. రమణ లోపలికి రావడం కనిపించింది. చీకట్లో తడుము లాడాడు. దీపం వెయ్యలేదు. చప్పుడు కాకుండా పడక తీసుకుని పరుచుకుని పడుకున్నాడు.
    "రమణా!" అన్నాడు గోపీ.
    రమణ ఉలికి పడ్డాడు. అతని పడక వైపుకి దొర్లి అతని డిందు మీద తల పెట్టుకున్నాడు గోపీ.
    "ఒక పనిలే. డిలే అయింది."
    గోపీ మాట్లాడలేదు. రమణ దగ్గర ఘుమ్మని వాసన కొడుతుంది.
    "ఏమిటీ వాసన?'
    "సెంటు వాసన" అన్నాడు రమణ.
    "సెంటు కాదు పూల వాసన. ఎందుకు నాతొ అబద్దం చెపుతున్నావ్?' అడిగాడు గోపీ.
    రమణ మౌనం వహించాడు. చెపుదామా వద్దా అని ఆలోచించాడు. గోపీని నిశితంగా చూశాడు. తరవాత అతని చెవి దగ్గర చేతులు చేర్చి "ఆమె జడలోని పూల వాసన " అన్నాడు.
    "ఎవరు?"
    "ఆమె."
    "పేరు?"
    "ఆ సంగతి అడగకు."
    "ఏం?'
    "ఇప్పుడు చెప్పను. సందర్భం వచ్చినప్పుడు చెపుతాను."
    "ఆమెను ఎక్కడ కలుసుకున్నావ్?'
    "చెపుతా గాని, ఎవ్వరితోనూ చెప్పకూడదు."
    "అలాగే."
    "ప్రామిస్ గా."
    "ప్రామిస్ గానే."
    "అయితే డాబా మీదికి వెడదాం , రా."
    ఇద్దరూ పైకి వెళ్లి పిట్ట గోడ మీద కూర్చున్నారు.
    "షి ఈజ్ మై స్వీట్ హార్ట్!" అని ఆరంభించాడు రమణ. అంతే. తన్ను తాను మరిచిపోయాడు.
    "ఎవరామే? ఎక్కడుంది?"
    "అదంతా అడగకు. ఆమె నా పాలిటి ట్రెషర్. నాకు దక్కడం నా అదృష్టం."
    "ఎలా వశమయింది నీకు?"
    'చెపుతా ఉండు. కాని, గోపీ మధ్య మధ్య ప్రశ్నలు వేయకు. అంతా నీలోనే ఉంచుకోవాలి. ఒక రోజు లక్ష్మీ దియేటర్లో సినిమా చూస్తున్నాను. నా ముందు వరస లో ఆమె కూర్చుని ఉంది. ఆమెను చాలాసార్లు చూశాను.
    స్కూల్లో చదువుతుంది."
    "ఏ స్కూల్లో?'
    "ఏమీ అడక్కూడదని చెప్పానా? ఆమె చదువుకుంటుంది . చాలాసార్లు చూశాను. నేనామెను చూడడం ఆమెకు నచ్చినట్లు గ్రహించాను. అదే నాకు చాలా సంతోషం కలిగించింది. కాని నా వంక సూటిగా చూసే ధైర్యం ఆమెకు లేదు.
    ఆ రోజు సినిమాకు వెళ్లానన్నాను గదా, మాటినీ షో. నా ముందు వరసలో ఆమె కూర్చుని ఉంది. ఆమెతో పాటు మరికొందరు అమ్మాయిలూ-- బందువు లను కుంటాను, ఉన్నారు. ఆమె సినీమాకి వెళ్ళడం నేను చూశాను. టికెట్టు కొని, నేనూ లోపలికి వెళ్లాను. నా రాకను ఆమె చూడక పోలేదు. అయితే ఆ తరవాత నేనెక్కడ కూర్చుంది ఆమెకు తెలీదు. ఒక్కసారి వెనక్కు తిరిగి చూసింది. నన్ను చూడగానే సిగ్గుతో ముఖం తిప్పుకుంది. నన్నలా చూడడం ఆమెకు సంతోషం కలిగించినట్లు అనుకున్నాను.
    మాటినీ అయిపొయింది. అందరం బయటికి వచ్చేశాం. గుంపు లో నన్నేవ్వరో చెయ్యి పట్టుకుని లాగుతున్నట్లనిపించింది. తిరిగి చూద్దురు గదా . ఆశ్చర్యం! ఆమె చీర కొంగు లోని ఒక పోగు నా రిస్టు వాచీ ' కీ' కి చుట్టుకుని ఉంది. ఆమెను దాటి ముందుకి వెళ్ళాలనుకున్నప్పుడు జరిగిన సంఘటన ఇది. బహుశా దీన్ని భగవంతుడే కల్పించి ఉండవచ్చు.
    పోగుని తీశాను. ఆమె ముఖం ఎర్ర బడింది. అప్పుడామే నవ్విన నవ్వుని నేను మరిచి పోలేను. నా వైపు చూసింది. ఆ చూపులో కరిగి పోయా ననుకో.
    ఆనాటి నుంచీ ఆమెకు ధైర్యం వచ్చింది. నేనామెను చూస్తె ఆమె కూడా నా వైపు చూసేది. అలాంటప్పుడు నా మనస్సు కొంచెం భయపడేది. ప్రతి రోజూ ఒకరి నొకరు చూసుకునే వాళ్ళం.
    ఒకనాడు ఆమె ఇంటి మీదుగా వెళ్లాను. ఆమె చూసేటట్టుగా ఒక చీటిని గుమ్మం ముందు పడేసి వెళ్లాను. ఆ మరునాడు కూడా ఆమె ఇంటి మీదుగా వెళ్లాను. గోడ పక్కగా వెడుతుంటే , ఒక చీటీ నా ముందు వచ్చి పడింది. చదువు కున్నాను. 'మీరు నాకు వచ్చారు' అని ముత్యాల్ల వంటి అక్షరాలతో వ్రాసింది. నా సంతోషం ఇంతా అంతా కాదు.
    ఆ తరవాత నేను మరో ఉత్తరం అందజేశాను. అందుకు , 'మీతో చాలా మాట్లాడాలి' అని బదులు వచ్చింది.
    ఆమెతో ఎలా మాట్లాడడం? ఆలోచించాను. చివరికి సినిమా దియేటర్లో కలుసుకున్నాం. 1-80 తరగతిలో మే మిద్దరం ఒకవైపు కూర్చున్నాం. మనసు విప్పి మాట్లాడుకున్నాం. మొదటి సారిగా ఆమె చెయ్యి పట్టుకున్నప్పుడు....."
    రమణ చెప్పడం ఆపి వేశాడు. హీనస్వరంతో 'మ్' అని దీర్ఘం తీశాడు గోపీ. అతని మనస్సు ఎందుకో బాధ పడసాగింది.
    'ఆ సుఖం అనుభవిస్తే నే గాని తెలీదు. ఒళ్ళంతా అదోలా అయింది.
    దియేటర్లో చాలా రోజులు కలుసుకున్నాం. కాని, అందువల్ల మాకు తృప్తి కలగలేదు. మేమిద్దరం ఏకాంతంగా ఉండే చోటు కోసం గాలించాం.
    ఆ చోటు ఎక్కడుందని మాత్రం అడక్కు. ఎలాగో ఒక చోటు కనుక్కున్నాం. అది ఎవ్వరికీ తెలీదు. అక్కడే కలుసుకునే వాళ్ళం . అరగంట సేపు ఉండి తరవాత వెళ్ళే వాళ్ళం. అక్కడ నేనూ ఆమె......."
    రమణ ఆపి వేశాడు. కొంచెం సేపు ఉండి మళ్లీ ఆరంభించాడు. ఆ గదిలో అతడూ, ఆమె భార్యా భర్తలుగా సంచరించిన విధాన్ని సవివరంగా తెలియ జేశారు. ఆ మాటలు వింటూ గోపీ అలాగే మైమరిచి పోయాడు.
    ఆ రాత్రి చాలా పొద్దుపోయిన తరవాత గాని వాళ్ళు గదికి రాలేదు.
    ఆ మరునాడు ఏడింటికి లేచాడు రమణ. డాబా మీద పిట్టగోడ పక్కగా ఒంటరిగా ఉన్న గోపీ దగ్గరికి వెళ్లాడు . "ఎరా, అలా ఉన్నావ్, ఆముదం తాగిన వాడిలా?' అని అడిగాడు . గోపీ నీరసంగా జవాబు చెప్పాడు. ఎక్కువగా మాట్లాడలేదు.
    నిజానికి ఆ రోజు నుంచి గోపీ ఎక్కువగా మాట్లాడలేదు. అతని అలవాట్ల లో కొన్ని మార్పులు కనిపించాయి. అంతకు మునుపంతా రాత్రిళ్ళు చాలాసేపు చదివేవాడు. కాని, ఇప్పుడు! చదవడానికి కూర్చున్న అరగంట లోనే పుస్తకాన్ని మూసి వేసేవాడు. చదువు మీద శ్రద్ధ చూపడం లేదు.
    అతని మనస్సులో ఒక భావ సంచలనం. యౌవనం లో అడుగు పెట్టాడా మరి! జీవితానికి సంబంధించిన ఊహలెన్నో అతనికి కలిగాయి. అవన్నీ ఊహలుగానే నిలిచిపోయాయి. కాని, రమణ విషయంలో అవి నిజమైనాయి. అది తలుచుకునే సరికి గోపీకి విచారం కలిగింది. 'రమణ నా మైత్రిని మరిచి పోయాడు. అన్ని అనుభవాలను నాతో పాటు పంచుకున్న'వాడు ఈ విషయంలో మాత్రం....' అనుకున్నాడు గోపీ.
    ఒకరోజు మధ్యాహ్నం గోపీ తన తరగతి కి వెడుతూ రమణ తరగతి గది వైపు దృష్టి మరల్చాడు. రమణ లేడని గ్రహించాడు. అంతే. అతని మనస్సు రకరకాలుగా ఆలోచించింది. 'వీడి విషయం పూర్తిగా కనుక్కోవాలి.' అనుకున్నాడు. తరగతి కి వెళ్ళకుండా బయటికి వచ్చేశాడు. ఆ తరవాత పట్టణం వీధులు గాలించడం మొదలు పెట్టాడు.
    రమణ వెళ్ళే వీధులు గోపీకి తెలుసు. అవన్నీ చూడసాగాడు.
    పెద్ద బజారు దాటి వెళ్ళగానే కొబ్బరి కాయల మార్కెట్టు. ఆ వీధిలో ఒక దృశ్యం చూశాడు. తమ ఎదురింటి అమ్మాయి నిర్మల ఎక్కడికో గబగబా వెడుతుంది. ఈపాటప్పుడు ఎక్కడికి వెడుతుందా అని ఆలోచించాడు. అక్కడే కొంచెం సేపు నిలబడ్డాడు. ఆమె వెళ్ళిన కొంచెం సేపటి కల్లా రమణ కూడా ఆ వైపే వెళ్ళడం చూశాడు. గతుక్కు మంది గోపీ కి. వాళ్ళను అనుసరించాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి వాళ్ళ టీచరు కనిపించి మాటల్లోకి దింపాడు. అందులోంచి బయట పడేసరికి వాళ్ళిద్దరూ ఎక్కడో మాయమైనారు.
    'ఆ అమ్మాయి నిర్మలన్న మాట!' అనుకున్నాడు గోపీ. ఆమెతో అందచందా లున్నాయి. లక్షణమైన పిల్ల. ఆమె ఓర చూపుల్లో ఎంత సొగసుందని! ఆమె చూపు ఒక్కసారయినా తన మీద పడదా అని చాలా రోజులు తపించి పోయాడు. ఆ అమ్మాయా రమణ ప్రేయసీ! నమ్మలేక పోయాడు గోపీ. తన గది చేరుకున్నాడు. చాలాసేపు ఆలోచిస్తూ పడుకున్నాడు.
    మరునాడు ఉదయం గోపీ లేవలేదు. జ్వరమనే సాకుతో పడుకున్నాడు. రమణ గదిలోంచి బయటకు వెళ్ళడం చూశాడు గోపీ. కప్పుకున్న దుప్పటిని కాస్తా తీసేసి, మెల్లగా రమణ ను అనుసరించాడు. సింహద్వారం వద్ద నిలబడి , ఎదురింటి వైపు చూస్తూ ఏదో సైగ చేశాడు రమణ. నిర్మల అతన్ని ఓర చూపులతో చూసింది. ఈ దృశ్యం చూసి గోపీ స్తంభించి పోయాడు.
    అంతా అతనికి అర్ధమయింది. వాళ్ళిద్దరూ అలా చూసుకోవడం చూసి గోపీ భరించలేక పోయాడు. మళ్లీ తన గదికి వచ్చేశాడు.
    రెండు నెలలు గడిచాయి.
    గోపీ లో మార్పు వచ్చినట్టు రమణ గ్రహించాడు. ఎంత ప్రయత్నించినా గోపీ మామూలు స్థితికి రాలేదు. అతని వైఖరి కొత్తగా కనిపించింది రమణకు.
    ఒకనాడు రమణ సినిమాకి వెళ్ళారు. దియేటరు లోకి వెళ్ళిన తరువాత నిర్మల కోసం ఎదురు చూడసాగాడు. ఆమె రావడానికి కొంచెం ఆలస్యమయింది.
    "ఆలస్య మయిందెం?' అని అడిగాడు.
    "మీ స్నేహితుడు గోపీ ఉన్నాడు. చూడండి...." అంటూ మొదలు పెట్టింది.
    "వాడికేం?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS