Previous Page Next Page 
ముత్యాల పందిరి పేజి 2


    "మందిత పోతున్నావు?" అంట నాగయ్య జుట్టందుకున్నడు.
    "దండం, సేటూ! నీ కాల్మొక్కుత, సేటూ!" నట ముడుసుక పోయిండు.
    చంద్రంకు మామమీద కోపమయింది. సదూకునీకి పోతన్ననంట సెప్పిన, యినడేంది? అట్ల సిన్న సిలగాడి జుట్టందుకుంటే ఎవలూకుంటరు?
    నాగయ్య జతగాండ్లంత దొబ్బున ఆడకీ పోగయిన్రు. వాండ్లంత చూస్తనే ఉన్నరు. లక్ష్మయ్య సేటు నాగయ్య యీపుమీన దబ్బ దబ్బ సరిసిండు.
    "ఏందిర? యిప్పుడు సెప్పు. సదుకునీకి పోతన్నావు? కొలువున్నోడు సదుకునీకి పోతే, ఆడ పనెవాల్లు చేస్తరు? నీ నాయనకు పైసలేడకెల్లొస్తయి? బువ్వెవడెడతడురా? సెప్పు!" అంటరిసిండు.
    "సింగాండ్లు సదుకుంటేతప్పునా, మామ?" అంటడిగిండు చంద్రం.
    "ఓరి, సెంద్రిగ, నువ్వూకో! గమ్మునుండన్న!" అన్నడు లక్ష్మయ్య.
    "నాగయ్య జుట్టిడు ముంగల!"
    "నువ్వేందిర, సెబుతవ్?"
    "మా దోస్తు జుట్టిడవాలె."
    "ఇడవాలంటావు? అచ్చ! ఇడిసిపెడత గని, మల్లెన్న డిట్ల చెయ్యకంట ఉంటరా?"
    "ఏమిటికి?"
    "కొలువు చేసుకునీకి."
    "మేము లేకుంటే పని నడ్వద? పిల్లగాండ్లకు కొలువెందుకు మల్ల?" అన్నడు యోగయ్య.
    "పెద్దోల్లు కొలువు సెయ్యాలె. మాకు బువ్వెట్టాలే. మేం మంచిగ సదూకుని ఏడన్న పట్నంల, దఫ్తర్ ల కొలువు చేస్తం. నూర్లు తెస్తం!" అన్నడు యాదగిరి.
    "ఏందిరో, యాదగిరి! జిట్టెడు పోరగానివి, నువ్ కూడ సెబుతున్నావు? నువ్వు సదూకుని దఫ్తర్ల కొలువుంటావు? నీ కొరకు యాడుందిర, కొలువు?"
    "సదుకుంటె ఉంటది" అన్నడు చంద్రం.
    "సదువేడ కెల్లొస్తది?"
    "బడికెల్లాలె."
    "సాలోనికి సదువేందిర, ఎర్రిసిలగ? తాతోల్లు సేసినపని మంచిగ నేరుసుకుంట యింట్లుండ రాదు? బడికిపోతే ఏమొస్తది? బువ్వకొచ్చె సదుగులెనా, అయ్యి?" అన్నడు లక్ష్మయ్య.
    "ఏమన్న కాని, మామా! మేమయితే సాలె పని చేసేడిదిలేదు. సిట్టెలు తడపా, ఆరవెట్టా, గుమ్మికెయ్యా, పంటెకుసుట్టా, రాటం తిప్పా, కండెలుపట్టా-గీ పనంత సేసి సేసి యాష్టాస్తన్నది. పెద్దోల్ల మయినంక సూసుకుంటములే! నీ అసొంటోల్లు సేస్తె సాలు! మేమెందుకొరకు?"
    లక్ష్మయ్య సాలె ఆయనే అయిన కాని, సిన్నతనముల యాడనో మొగ్గం నేసిండు. మల్లగుంతల కూసుంటే ఒట్టు. జర్రంత సురుకున్న వోడు. మనుసుల్ని మంచి చేసుకోని, పన్లు సేపిచ్చుగుంటం, మంచిగ ఎరికెవానికి. ఒక పొద్దు పట్నమెల్లి-గాడ నూలు అమ్మకం చేస్త ఉండె సేటు కాడికెల్లి నూలు తీసుకోని, పల్లెకుబోయి వానికి వీనికి నూలిచ్చి సీరలు నేసిచ్చిండు. నేపిస్త ఉంటే, పేటల పెద్ద సేటు కెరికయి, "యిగ్గో, లచ్మయ్యా! నూలు నేను తెచ్చిస్తగాని, యీడ పల్లెల నువ్వు మంచిగ సీరలు నేసిచ్చి నా కంపుత ఉండు. పట్నం దర యీడనే యిచ్చి నీతాప తీసుకుంట. నేతగా నోండ్లకు కూలి యిచ్చినన్క మంచిగ నీకు లాబ మిస్త. ఇన్నవా?" అన్నడు.
    "మంచిది!" అన్నడు లక్ష్మయ్య.
    అన్నడే కాని, కొత్త గోచ్చిన సవుకారు తన మెట్ల నిలబెట్టుకొనాలె, పల్లెల వేతగానోండ్ల నెట్ల కట్టుకొని రావాలె, అంట సొంచాయించడమ్కుశురు చేసిండు.
    ఉయ్యాలవాడల నేసకం చేసేటోండ్లు మంది లెస్సగున్నరు. సాలోండ్లున్నరు; తొగటోండ్లున్నరు; మాలోండ్లున్నరు. కురమలు కూడున్నరు గాని, వాండ్లు చేసెడిది మాలు పని కాదు. గొంగండ్లు నేస్తరు. వాండ్ల తరీకంత అలగుంది. ఆరొక్క పని ఆరొక్క తరీకుంటది మల్ల. సాలోండ్లలోనె మల్ల రేషం పని చేసెటోండ్లు అలగున్నరు. దేవాంగుల కొంతమంది దసలి పనిచేస్తరు. గ్గదె, దసలంటే టస్సరు సిలకు. అట్ల మా తన్న అట్లనే అంటరు. మా బావ మీ కెరికె లేదా? మీ కెరికె లేకుంటే మేమేమి చెయ్యాలె?
    మల్ల, పన్లల్ల ఎన్ని తరీకలున్నయ్యొ ఎరికె నెనా? ఈయాల్రేపు, సన్నపని చేసెటోండ్లు తక్కువ. అంత, దొడ్డునె శేమొగ్గాలన్ని మూలపడినయికద! పెద్దోండ్లప్పటి సంది సేస్తన్న కుప్పడాలు యిప్పుడేవల్లక్కావాలె? సేసెటోండ్లు మటుక్కేడున్నరు? గ్గామనుసుల్లేరు; గా పన్లు లేవు. కొమ్ము తిప్పి, పోగు మలపటం యీ యాల రేపు పోరగాండ్లు చేస్తరా, చూస్తరా? అంతదాక పోయెడిదెందుకు? పడుసోండ్ల ముచ్చటాడనెట్టున్రి! పెద్దమడుసులు నేస్తున్రా? ఏమంటే, సెయ్యాడదంటరు; కండ్లు కనిపియ్యటం లేదంటరు. చేసెటోండ్లు ఒక లిద్దరున్న కాని, మంచిగ ఫరాకతుగ చేసెతందుకు పుర్సత్ యాడున్నది; బలం యాడున్నది? ఎట్లనో అట్ల మొగ్గం ముంగల కూసుంటరు. లట్టు లట్టని పిస్తరు. యాదో ఒక గుడ్డ నేస్తరు. సిగురు బద్దేసి సనుగు కోస్తరు.
    ఆడోండ్లు, పిలగాండ్లు కండెలు వడతరు; ఆసువోస్తరు. మొగ్గం నేయలేకుంటే, మొగోండ్లల్ల కూడ ముసలోండ్లు గీ పన్లె చేస్తరు.
    ముబ్బుల్ల లేసిన సంది, రేయి పండుకొనే దాన్క యాదో ఒక పని సేస్త ఉంటే, యాష్టాస్తనే ఉంటది, ఎంత సేసిన గాని, ఏం లాబం?
    'సాలోడు సచ్చిన, బతికిన గుంతలానె' అంట సెప్పిన్రు కద? గంతనే అయితున్నది.
    ఏమన్న కాని బువ్వ రావాలి కద! అందుకొర కట్లనే చేస్తున్రు. ముందుగల లక్ష్మయ్య నూలు తెచ్చి, నియత్ గలోండ్లకు వీనికి వానికిచ్చి సీరలు నేపిచ్చిండు, అట్ల నేపిస్త నేపిస్తనే సవుకా రయిండు. గంతనెనా? యింక, పేటల పెద్ద సేటు లెక్క కావాలంట ఊ ఉరుకుతున్నడు. ఉరుకుతనె అయితారు? కారుకద!
    లక్ష్మయ్య సేటు అందరి సేటుల్లెక్కకాదు. నేతగాండ్లను మంచిగ దుబుకోని, పొద్దంత పని సేపిచ్చుకుంటడు. ఆ యిద్దె ఆడి సొంతమే. అట్లనే ఎయ్యిలు కమాయించిండు మల్ల! ఉయ్యాలవాడల, ఎనిమిది లోతుల పెద్ద మిద్దె యిల్లు కట్టిపిచ్చిండు. ఆండ్లనే, దుకనంకోసానికి ఏరుపాటుగ పెద్ద అర్ర తీసుకుండు. నూలు పెట్టెలూ, రంగుడబ్బాలూ, ఉడ్తలూ, ఊడ్తెలూ -మాలంత అండ్లనే ఉంటది. నూలు తీస్కనెటోండ్లూ, సనుగులు తెచ్చిచ్చెటోండ్లూ అంత ఆడికే వస్తరు. ఊర్ల, పెద్ద పెద్దోండ్లు అంత యిప్పుడు లక్ష్మయ్య పార్టీనే. ఆఫీసర్లు గిట్ట ఎవరన్న కాని పట్నం కెల్లొస్తే వాండ్లు ముందుగల లక్ష్మయ్యని సూడాలె.
    ఆసొంటి లక్ష్మయ్య యియ్యాల నూరు మగ్గం నడిపిస్తండు. వాని కింద కండెలు పట్టే పోరగాండ్లె ఉన్నరు యిర్వైమందిదన్క. వాండ్లల నాగయ్య కూడున్నడు. నాగయ్య చంద్రం దోస్తు.
    పోరగాండ్ల తరీక సూస్తంటె లక్ష్మయ్య శాన కోపమయిండు. వాండ్లను తిట్టిండు. మొట్టిండు. బెదిరిచ్చిండు. బతిమాలిండు.
    ఎంతసేసినగాని వాండ్లు సేటు మాట యినలే. వాండ్లకు దైర్న మొక్కటున్నది. చంద్రం దోస్తునేకద! చంద్రం లక్ష్మయ్య సేటు మేనల్లుడే కదా! చంద్రం ఏమన్నగాని కొట్టడుకద! బర్హాల్, కొట్టకం, గిట్టకంగిన సేసిండనుకుందం. పిల్లోండ్లు పెద్దోండ్ల మాట లినకుంటే గట్లనే సేస్తరు. లక్ష్మయ్య గట్ల సేసినగాని, చంద్రం గమ్మనూకుంటడా? "ఏంది, మామ, గట్ల కొడతవూ? మా దోస్తు లంత బడికిపోయి సదుకుంటమంటే ఏమిటికి కొడతవు? నీ కొలు వెవలిక్కావాలె? మేము సచ్చినగాని, సాలె పని సెయ్యనే సెయ్యం! నువ్వే మన్న సేసుకో! యాడన్న సెప్పుకో! మాకేంది బయం?" అంట అన్లే? అని ఆడున్నదా? ఉరుక్కుంట, ఉరుక్కుంట దోస్తులంత ఒక్కటే పోసుడు! మల్ల ఎనక్కి గూడ తిరిగి సూడలే.
    చంద్రం దయిర్నెంకు జరంత నవుకున్నడు కాని, అక్ష్మయ్య ఊర్ల  పిలగాండ్ల నిట్ల కొలువుల కెల్లి పిలుసుకపోయి పని కరాబు సేస్తంటే మల్ల కోపం ఎక్కవయింది. దొబ్బు దొబ్బున బావ యింటి దిక్కయి ఉరికిండు.
    పిలగాండ్లు అన్న మాటలు లక్ష్మయ్య సెవుల గింగురుమంట ఉన్నయి. తాతలప్పటి సంది ఉన్న నమోన సెదిరిపోతన్నట్టున్నది. ఆసడికి కట్టుకొన్న బవంతి పునాదులకంట కూలిపోయె తట్టుంది.
    గింతంత పోరగాండ్లు యిప్పుడే పెద్దోండ్ల మాటినకుంటే, యింక ముంగల యినెవో డెవుడు?  వాండ్లంత యిట్ల యినకుంటపోతె థోడం దినాల్ల సాలోడంట మిగుల్తడా, ఊర్ల? అచ్చ! కొలువులు సేసుకుంట దేశంల యాడన్న బతుకుతరనుకుందం. బతికిన గాని ఏమి లాబం? సాలోడు సాలెపని యిడిసిపెట్టి గాపనిసెయ్యా, గీపనిసెయ్యా! పరువయిన మాటనా, గది?
    'కుల యిద్దెకు సాటిలేదు గువ్వల సెన్నా!' అన్నడు, ఇంటరా వీండ్లు?
    లక్ష్మయ్య జోరుగ నడుస్తనే ఉన్నడు. దార్ల, మాలీ పటేల్ యింటిపక్కకున్న కాలీ జాగాల తవ్వకం చేస్తున్రు. ఆ జాగ తనదే, కారకాన వెట్టాలంత పునాదు లేపిస్తుండు. పది పన్నెండు మంది ఉసికె గంపలు మోస్తున్రు.
    లక్ష్మయ్య వాండ్ల దిక్కుకు సరిగ సూడలే. సూడకున్న గాని, కంటి కొనల కెల్లి సన్నగ గనిపిచ్చిండు ఒక్క మనిసి. బక్కగున్నడు. కర్రె గున్నడు. నెత్తిమీన ఉసికె గంపున్నది.
    అడెవురో లక్ష్మయ్య కెరికెనే.
    "స్సి! నీమీద మన్నువడ! నువ్వు సాలోడివయి పుట్టకుంటే మంచి గుంటుండెరా!" అంట ఉమిసిండు.
    కులం యిద్దె యిడిస్తే, యిట్లనే గంపలు మొయ్యాలె. ఊర్లోల్లంత సెప్పిన యిన్నడా యీడు? ఆడు సాలోడంటెనే సిగ్గయితది. నీకేందిర యీ కరమంటే అంటడూ, సాలెపన్ల దినమంత కష్టంసేస్తె రూపాయినే వస్తది కాని, కూలిపన్ల రొండ్రూపాలొస్తయంట!
    ఈ సిన్న పిలగాండ్లు యీన్ని సూసి గీబుద్ధి నేరుసుకుంటున్నరు. ఈడు వాండ్లకు గురువు. ముందుగల యీడి కాళ్ళు యిరగదంతె, అప్పుడు వాండ్లక్కూడ బుద్దొస్తది.
    కోపంల అనుకుంటన్నడే కాని, లక్ష్మయ్యకు బెదురు కూడున్నది.
    దేశంల ఎన్ని మార్పులు రాటంలే? కట్టు మారింది. బట్ట మారింది. మాట మారింది. మనుసు మారింది. ఈయాల్రేపు మడుసులంత అప్పటోల్ల లెక్కనే ఉన్నరా? ఇగ్గో, దునియల ఎట్లెట్ల నన్నగాని మార్పులొస్తనే ఉంటయి. అది తప్పేడేది లేదు. ఒక జాగాలొచ్చి, యింకో జాగాల రావంట సెప్పగల్దుమా? మల్ల, దునియ పుట్టిన సంధి ఎప్పటి కట్లనే ఉన్నదా? తాంతోండ్లు రేల్గాడి ఎన్నడన్న సూసిన్రా? లేదుకద! ఈయాల మన మెక్కుతన్నం. అట్లంట బండ్లమీద పోకుంటే ఎట్లంట లొల్లిసేస్తే ఎవలింటరు? ఇంక నగుతరు కూడ. అట్లనే సట్టరు మొగ్గా లొచ్చినయి, సాలోండ్లు శానమంది శేమొగ్గాలిడిసిపెట్టి, లట్టు లట్టంట యీ మొగ్గాలు పట్టిన్రు. ఎందుకు పట్టాలె? గ్గా మొగ్గాలె ఎందుకు నెయరాదంటే యింటరా? అట్లనే యిది కూడ.
    ఇగ్గో, దునియ ఎప్పటి కిట్ల మార్తనే ఉంటది. ఒద్దనెతందుకు మన మెవలం? మనం ఒద్దంటే అట్లుంటం మానుతాది? అందు కొరకు, ఏమి చెయ్యాలె? జర్ర సాంచాయించుకోని సూడాలె. అప్పుడు ఆండ్ల ఇజం ఎరికయితది. మనిసి బతుకుల ఏదన్న జరగనీ, నగుతానె ఒప్పు కొనాలె. ఎప్పటికీ మనం అనుకూనీడెదె నిజమంటనుకొనద్దు. మన కండ్ల ముంగల సూసెడిది గింతనెకద? ఎనక ఎంతనో ఉన్నది. సూడ గల్దుమా? అట్ల సూసేతందుకు లోతయిన కండ్లుండాలె. అయి మన్ల శానమందికి లేవు కద!
    పాత నీరొచ్చి కొత్తనీటిని కొట్టేస్తదంట! చెప్తనే ఉంటరు. అది ఎరికెనే కాని, మనం ఎప్పటికి ఒప్పుకొనం. మనం అనుకున్న తరీకెనె చేస్తెనే దునియ సరిగుంటదంట! ఏందేందో అనుకుంటం. అంత బెమనే!
    ఎన్ననుకున్న గాని, గా ఉసికెగంప మోసెటోని మీద లక్ష్మయ్య కోపం తగ్గలే. ఆడు పనిసేస్తన్న జాగాల తను పునాదు లేప్పిచ్చాలెకద? బవంతిలెక్క, మంచిగ కారకాన కట్టించాలికద? పనోండ్లను పెట్టుకోని కూలికి మొగ్గాలు నేపిచ్చుకొనాలెకద? ఇప్పటి పనోండ్లు కులపిద్దె యిడిసిపెడితే, తన బవంతి లేసెదెట్ల? కొత్త కారకాన పనిసేసెడి దెట్ల? లక్ష్మయ్య మనసుల కట్టుకున్న బవంతి మొదలంట కూల్తన్నట్టె అనిపిచ్చింది. పేనం ఉసూరుమన్నది.
    'లే! ఇట్ల జరిగెతందుకీల్లే. పని నడ్వాలె. సెయనంట పలికినోన్ని ముప్పు తిప్పలు వెట్టాలె. ఈ పిలగాండ్లకు బుద్ధి సెప్పాలె. 'అట్లనుకుంట ఎనక్కు సూపిండు.
    ఉసికె గంపోడు మోస్తనే ఉన్నడు.
    లక్ష్మయ్య గాడికిపోయి, మేస్తిని పిలిసిండు. ఉసికె గంప సాలోన్ని ముంగల పన్లకెల్లి తీపిచ్చే సిండు. ఆడికోపమాగినాది? వాన్ని జోరుగ తిట్టిండు. ఆడి కెల్లి బావింటికి ఉరికిండు.
    లక్ష్మయ్య ఉరుకెట్లున్నదీ? ఎవలికో పెద్ద కష్టం రాబట్టి, దాన్ని కాపాడెతందుకు తా నొక్కడే ఉన్నడంట పారొస్తన్నట్లున్నది.

                                      *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS