అది చదవగానే అతని మొహం వివర్ణమైపోయింది.
అందులో ఎంత అసభ్యమయిన పదజాలం వాడబడిందంటే తిరిగి మరో మనిషికి చెప్పడానికి కూడా వీల్లేకుండా ఉంది.
"నాకు తెలీదు" అన్నాడు ఈశ్వర్."
అతని మొహంలోకి పరీక్షగా చూశాడు వి.కె.ఆర్.
"ఒక ఆడపిల్లని అల్లరి పెట్టడానికి కాకపోతే ఇలా ఎవరూ రాయరు. నువ్వు తెలీదంటే సరిపోదు."
"నిజంగానే చెపుతున్నాను. నాకు నిజంగా తెలీదు" అన్నాడు ఈశ్వర్ తిరిగి.
వి.కె.ఆర్. స్వర్ణకేసి చూశాడు. ఆమె వెక్కి వెక్కి కుళ్ళి కుళ్ళి ఏడుస్తూనే వుంది.
"ఏమ్మా! అతను కాదంటున్నాడు."
"నో..... నో..... అతనే..... అతనే...... రాశాడు"
వెక్కిళ్ళ మధ్య అంది స్వర్ణ. ఆమె మనసుని ఖూనీ చేసుకొంటోంది. హృదయాన్ని పిడికిట బిగించి నలిపేసుకుంటోంది.
అది ఒక నిరపరాధిపైన చేస్తోన్న అసత్యపు అభియోగమని ఆమెకి తెలుసు. దానివల్ల అందరిలోనూ తనేం పోగొట్టుకుంటుందో, ఎన్ని మాటలు పడవలసి వస్తుందో కూడా తెలుసు కానీ..... తన మానప్రాణాలు కాపాడుకోడానికి యింతకన్నా మార్గం ఏది? దారి ఏది?
"షటప్! నాకసలు ఈ అమ్మాయి ఎవరో కూడా తెలీదు" అరిచాడు ఈశ్వర్.
"గొంతు చించుకుని అరిస్తే చాలదు మిస్టర్! నీవల్ల కాలేజీలో అన్నీ గొడవలే! మొన్న దెబ్బలాట, నిన్న జెన్నీ పైన దాడి, యీ రోజు యీ అమ్మాయికి ప్రేమలేఖ.... ఛీ......ఛీ..... ఇది ప్రేమలేఖ కాదు. బూతులేఖ! నిన్ను......."
"సర్! మొన్న దెబ్బలాట నిజం, నిన్న జెన్నీని కొట్టిందీ యథార్ధమే! కానీ ఇది అబద్ధం నాకిలాంటివి రాయవలసిన పనిలేదు. అవసరం అంతకంటే లేదు" కోపంతో అతని ముక్కుపుటాలు ఎగిరిపడుతున్నాయి.
అనవసరంగా నింద వేస్తున్నందుకు రోషం ముంచుకొస్తోంది.
"లేద్సార్! ఇతనే రాశాడు. ఈ మధ్య నేను కనబడితే చాలు అదోలా చూస్తూంటే యిలాంటిదేదో చేస్తాడనుకున్నాను. నేను భయపడినట్టే జరిగింది. సర్! నాకు భయంగా వుంది. ప్లీజ్! కాలేజీలో రౌడీల బారినుంచి నన్ను కాపాడండి. యీ చదువే లేకపోతే నాకు బతుకేలేదు" రుద్ధకంఠంతో అంది స్వర్ణ.
ఈశ్వర్ ఆమెకేసి జాలిగా చూశాడు.
ఆమె అబద్ధం చెబుతోంది. అది నిజం.
ఆమెకి అసభ్య పదజాలంతో ఉత్తరం రావడం వాస్తవం.
అది చదివితే అతనికే కలవరం కలిగింది.
తను రాయలేదన్నది నిర్వివాదాంశం.
కానీ ఎవరు చేసి వుంటారు?
అతనికి చెప్పనవసరం లేదు.
తన ప్రత్యర్థి వర్గం - జెన్నీ ఒక్కటే!
ఈశ్వర్ ఆలోచిస్తున్నాడు.
ఎదురుపడి బలాబలాలు తేల్చుకోవడం తప్పఇదివరలో ఇలాంటి చిల్లర అలవాట్లు లేవు.
జెన్నీ యింత చవకబారు పనిచేస్తాడా? అని ఆలోచిస్తున్నాడే తప్ప యీ చిల్లర పనిద్వారా జెన్నీ అతనిపైన పగని ఎలా సాధించాలనుకున్నాడో అతనికి అందని విషయం! ఇక్కడితో యీ సమస్య విడిపోదని, అది చిలికి చిలికి గాలివాన కాబోతోందని కూడా ఈశ్వర్ కి ఆ క్షణంలో తెలీదు.
"నిన్ను కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తున్నాను" అన్నాడు ప్రిన్సిపాల్ వి.కె.ఆర్.
"ఒక నిర్ణయం తీసుకునేముందు న్యాయాన్యాయాలు ఆలోచించడం మంచిది."
"ఏం! నువ్వు సత్యహరిశ్చంద్రుడివా - న్యాయం గురించి మాట్లాడుతున్నావ్? నిన్నకాక మొన్న కాలేజీ గోడలన్నీ పాడైనాయి నీ మూలంగా. ఓ గొప్పింటి పిల్ల అల్లరయింది. ఈ రోజు యీ అమ్మాయి! అసలీ కాలేజీలో ఆడపిల్లల్ని చదువుకోడానికి రానిస్తావా? లేదా?"
వి.కె.ఆర్. మాటలకి ఈశ్వర్ కోపంతో భగ్గుమన్నాడు.
"మీరు ఆవేశంలో మాట్లాడుతున్నారే తప్ప నేను చెప్పేది వినరా?"
"ఏమిటి వినాలి?" వ్యంగ్యంగా అడిగాడు.
"నాణేనికి ఒకవేపు బొమ్మ, మరోవేపు బొరుసు వుంటాయి. అలాగే అబద్ధానికి రెండోవేపు నిజం వుంటుంది."
"నువ్వు కళ్ళెర్ర చేస్తున్నావని భయపడి ప్రతివాడినీ పిలిచి నువ్వు రాశావా అని అడగాలా? లేక వేలిముద్ర నిపుణులని పిలిపించి ఉత్తరం పైన వేలిముద్రలని తీయించమంటావా?" వెటకారంగా ఉన్నాయి ఆయన మాటలు.
"మిస్టర్ వి.కె.ఆర్! యింతసేపూ మీ పెద్దరికాన్ని గౌరవించాను.
ఒక మనిషిని నువ్వు చంపావు అన్నంత మాత్రాన అది నేరం కాదు. అది కేవలం - నిరూపించబడేవరకూ అభియోగం మాత్రమే అవుతుంది.
