"సిట్ డవున్ అండ్ టేక్ ది నోట్స్" అన్నాడు కోపంగా.
అశ్వని కేం చేయాలో తోచలేదు.
ఆ లెక్చరర్ పట్టాభి. అసలే చండశాసనుడు. పైగా ప్రాక్టికల్స్ అతని చేతిలో ఉంటాయి.
ఇక క్లాసులోంచి బయటికి వెళ్ళే అవకాశం లేదు ఆమెకి.
లెక్చరర్ చూసి వార్నింగ్ ఇవ్వడంతో తిరిగి బల్లమీద కూలబడింది అశ్వని నిస్సహాయంగా.
ఆమె మనసు మనసులో లేదిప్పుడు.
ఏం జరుగుతుందో?
ఆమె ఉసూరుమని నిట్టూర్చింది. ఏమీ కాకూడదని ఇంత శ్రమ పడిందో అంతా తల్లకిందులైపోయింది. ఆమెకి క్లాసులో పాఠం అర్ధం కావడంలేదు. చెవులకి ఏమీ వినబడ్డంలేదు.
అదే సమయంలో -
స్వర్ణ ఎరుపెక్కిన కళ్ళతో -
తడబడుతోన్న అడుగులతో -
చెయ్యరాని తప్పు చేస్తున్నానే అన్న తపనతో, ఆమె సుకుమారమైన మనసు వికలమైపోగా, గుండెపైన జెన్నీ అనబడే కిరాతకుడు గుచ్చుతున్న గుండుసూదుల పోటులని భరిస్తూ వస్తున్న ఉద్వేగాన్ని అణచుకోడానికి ప్రయత్నిస్తూ మునిపళ్ళతో కింది పెదవిని నొక్కిపట్టి వడివడిగా ప్రిన్సిపాల్ గదివేపు కదులుతోంది.
ఆమెకి స్టెయిర్ కేస్ దగ్గర చిదంబరం, రాజ్ కుమార్, ఫిలిప్స్, వెంకోజీ హేళనగా చూస్తూ ఎదురొచ్చారు.
వాళ్ళని చూడగానే చెప్పుతో కొట్టాలనిపించింది స్వర్ణకి.
"ప్రిన్సిపాలుడు గదిలో ఉన్నాడు" చిదంబరం అన్నాడు.
"ఒంటరిగానే ఉన్నాడు" ఫిలిప్స్ చెప్పాడు.
"ఒంటరిగా ఉన్నాడని చెప్పి గదిలోకి వెళ్ళమంటే ఆడకూతురెలా వెళ్తుందిరా" వెంకోజీ ఇకిలించాడు, తనజోక్ కి తనే ఆనందపడుతూ.
"ముసిలోడూ రసికుడేలా" అన్నాడు రాజ్ కుమార్.
"షటప్ రాస్కెల్స్" తీవ్రంగా అంది స్వర్ణ.
ఆమె కళ్ళనించి నిప్పురవ్వలు కురిశాయి.
"పాపం ఆడకూతురు సిగ్గుపడుతోందిరా?"
"పోనీ అవ్వా పచ్చీవేసి తీసుకెళ్దామా?" చిదంబరం అన్నాడు.
"మీ అక్కల్ని అమ్మల్ని తీసుకెళ్ళండి" ఏదో పిచ్చి తెగింపుతో ఉక్రోషంతో అనేసింది స్వర్ణ.
జెన్నీ వాళ్ళతో ఉంటే ఏమనేదో కానీ అతని మనుషుల్నీ మాత్రం పురుగుల్ని చూసినట్టు చూసిందామె.
ఆమెలో రక్తం వేగంగా ప్రవహిస్తోంది.
పిల్లిని గదిలో పెట్టి కొట్టడం మొదలు పెడితే మీద పడి కళ్ళు పీకేస్తుందన్నట్టుగా బుసలుకొట్టింది స్వర్ణ.
కానీ ఆమెని వాళ్ళు లక్ష్యపెట్టలేదు.
స్వర్ణతో పాటు వాళ్ళు కూడా ప్రిన్సిపాల్ గదివరకూ వచ్చారు.
స్వర్ణ స్వింగ్ డోర్ తెరుచుకొని లోపలకి వెళ్ళింది.
11
అటెండర్ తీసుకొచ్చిన స్లిప్ ని చదివి లెక్చరర్ -
"మిస్టర్ ఈశ్వర్! యూ ఆర్ రిక్వైర్డ్ యిన్ ది ఆఫీస్ రూమ్. ప్రిన్సిపాల్ కబురు చేశారు" చెప్పాడు.
ఈశ్వర్ లేచి బయటికి నడుస్తుంటే అతని వెనకే అతని బృందం కూడా కదిలింది.
క్రితం రోజు జెన్నీపైన తాను దాడి చేసినందుకే అయి ఉంటుందనుకున్నాడు ఈశ్వర్.
స్టెయిర్ కేస్ దగ్గర జెన్నీ చూయింగ్ గమ్ నములుతూ ముఠాతో ఎదురుగా కనిపించాడు. తన ఊహ కరక్టేననుకున్నాడు ఈశ్వర్.
జెన్నీ, ఈశ్వర్ ఒకర్నొకరు తీక్షణంగా చూసుకున్నారు. ఆ చూపులు కొన్ని క్షణాలపాటు వేడిగా, వాడిగా ఢీకొన్నాయి.
వాళ్ళని దాటి ప్రిన్సిపాల్ రూమ్ రాగానే తన మిత్రులని అక్కడే ఉండమని అతను లోపలికి వెళ్ళాడు.
ప్రిన్సిపాల్ వి.కె.ఆర్. చాలా సీరియస్ గా ఉన్నాడు. ఆయన కెదురుగా స్వర్ణ కూర్చునుంది.
ఈశ్వర్ని చూడగానే చేతుల్లో మొహాన్ని దాచుకొని వెక్కి వెక్కి ఏడ్వడం మొదలుపెట్టింది.
"మిస్టర్ ఈశ్వర్?" గంభీరంగా పిలిచాడు ప్రిన్సిపాల్ వి.కె.ఆర్.
"సర్!"
"ఇది నువ్వు రాసిందేనా?" ఓ కాగితాన్ని అతని చేతికిచ్చాడు.
ఈశ్వర్ ఏమీ అర్ధంకాని వాడిలా వాళ్ళిద్దర్నీ ఓసారి చూసి ఆ కాగితాన్ని అందుకున్నాడు.
న్యూస్ పేపర్లోంచి అక్షరాలని కత్తిరించి ఉత్తరంగా తెల్లకాగితంపైన అతికించబడ్డాయి.
ఈశ్వర్ గబగబా చదివాడు.
